హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గరిమెళ్ల ప్రత్యూష అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో తాను నిర్వహిస్తున్న బొటిక్‌లోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. స్నానాల గదిలో విగత జీవిగా పడి ఉన్న ప్రత్యూష మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఒంటరిగా ఉంటున్న ప్రత్యూష శనివారం ఉదయం బొటిక్‌కు వచ్చింది. మధ్యాహ్నం ఆమె ఎంతకూ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన వాచ్‌మెన్ తలుపులు తట్టి పిలిచినా స్పందించకపోవడంతో ఈ విషయాన్ని ఆయన స్థాకులకు చెప్పారు. దీంతో వారు తలుపులు బద్ధలుకొట్టి చూడగా ఆమె స్నానాల గదిలో పడి ఉన్న దృశ్యాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో వారు రంగ ప్రవేశం చేశారు. ప్రత్యూష పార్థివ దేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించాక మృతదేహాన్ని అపోలో ఆసుపత్రికి తీసుకువచ్చి భద్రపర్చారు. ఆదివారం ఆమె మృతదేహానికి అంత్యక్రియలు జరిగే అవకాశముంది.
ప్రత్యూష గదిలోనే కార్బన్ మోనాక్సైడ్ సీసాను గుర్తించిన పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. కార్బన్ మోనాక్సైడ్‌ను పీల్చి ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. చలనచిత్ర రంగంలో ప్రముఖులకు ప్రత్యూష ఫ్యాషన్ డిజైనర్‌గా పని చేస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్‌లకు ఆమె డిజైనర్‌గా ఉన్నారని సమాచారం. టాప్ ముగ్గురు డిజైనర్లలో ప్రత్యూష ఒకరని చెబుతున్నారు. మృతురాలు ప్రత్యూష ప్రముఖ తారలైన జాక్వెలిన్, పరిణితి చోప్రా, మాధురి దీక్షిత్, కాజోల్ దేవగన్, విద్యాబాలన్, రవీనా టాండన్, నేహా దూపియా, శృతిహాసన్, క్రీడాకారిని సానియా మీర్జా, హీరోయిన్లు హుమా ఖురేషి, రకుల్‌ప్రీత్ సింగ్, జూహీచావ్లా, కృతి కర్బందాతో చాలా మంది తారలకు ఫ్యాషన్ డిజైనర్‌గా పని చేస్తోంది. బంజారాహిల్స్‌లో ప్రత్యూషకు బొటిక్ కూడా ఉంది.
ప్రత్యూష గదిలో లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు
ఆత్మహత్యకు ముందు ప్రత్యూష రాసిన లేఖను పోలీసులు తన గదిలో స్వాధీనం చేసుకున్నారు. తాను కోరుకున్న జీవితం ఇది కాదని ఆమె లేఖలో పేర్కొన్నట్టు సమాచారం. ఒంటరి జీవితంతో విరక్తి చెందానని, తల్లిదండ్రులు భారం కాలేనని ఆ లేఖలో ప్రత్యూష తెలిపిందని పోలీసులు చెప్పారు. తనను క్షమించాలని ఆత్మహత్య లేఖలో ఆమె తల్లిదండ్రులను కోరింది.