అన్నం పెట్టే అన్నదాతల ప్రాణాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడొద్దని రాష్ట్ర ప్రభుత్వ విప్, చెన్నూరు శాసనసభ్యులు బాల్క సుమన్ పేర్కొన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో యాసంగిలో కేంద్రం వరిధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన మహా రైతు ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు.
కేంద్రంలోని బీజేపీ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందన్నారు. పంజాబ్‌లో వరి కొనుగోలు చేస్తున్న కేంద్రం తెలంగాణలో పండించిన ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేయదని ప్రశ్నించారు. రైతు పక్షపాతిగా తమ ప్రభుత్వం పని చేస్తుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడడం సిగ్గు చేటన్నారు.
కేంద్రం చేస్తున్న మోసాలను రైతాంగానికి వివరించేందుకే మహా ధర్నా నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పురాణం సతీష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రవీణ్‌తోపాటు తెరాస ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.