కడెం ఆయకట్టు రబీ పంటలకు జనవరి 5న నీటి విడుదల
కడెం, డిసెంబర్ 26 (ఆంధ్రప్రభ) : కడెం నారాయణరెడ్డి ప్రాజెక్ట్ ఆయకట్టు కింద రబీ పంటలకు సాగునీరు అందిస్తామని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. గురువారం కడెం మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో కడెం, దస్తురాబాద్, జన్నారం రైతులతో కడెం ప్రాజెక్టు ఆయకట్టు కింద రబీ పంటలకు సాగునీటి విడుదలపై ఇరిగేషన్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుల ముఖాముఖి కార్యక్రమం సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. గత పదేళ్ల పాలనలో కడెం ప్రాజెక్టు మరమ్మత్తులకు చిల్లిగవ్వ ఇవ్వలేదని, దాని కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ చూపి కడెం ప్రాజెక్టు మరమ్మత్తులకు రూ.9 కోట్ల 46 లక్షలు మంజూరు చేసిందని, ఇప్పుడు ప్రాజెక్టు సురక్షితంగా ఉందన్నారు. కడెం, దస్తురాబాద్, జన్నారం రైతుల పంట సాగునీరు సరపరాకై చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతుల గురించి ఆలోచించే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. జనవరి 5వ తేదీ కడెం ప్రాజెక్టు నుండి ఆయకట్టు రబీ పంటల కోసం నీటిని విడుదల చేస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు.
కొందరు మూర్ఖులు ప్రభుత్వంపై బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నారని, తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని, ప్రజలేవరు అలాంటి తప్పుడు మాటలను అపోహలను నమ్మకూడదన్నారు. అలాగే సదర్ మట్ ఆయకట్టు కింద రబీ పంటలకు సాగునీరు అందిస్తామని ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో కడెం ప్రాజెక్టు ఈఈ రాథోడ్ విట్టల్, డీఈ లు నవీన్, వెంకటేశం, ఏఈలు గణేష్ నాయక్, నితిన్, విశాల్, పాండవపూర్ పీఏసీఎస్ చైర్మన్ రామడుగు శైలజ, రమేష్ రావు, కడెం, జన్నారం, దస్తురాబాద్ మండలానికి చెందిన మాజీ ప్రజా ప్రతినిధులు, రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.