ఆరుగాలం కష్టించి పండించిన పంట అమ్మకం సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరి ధాన్యం కొనడానికి ముందుకు రాకపోవడంతో అన్నదాతలు హరిగోస పడాల్సిన పరిస్థితి నేడు ఏర్పడింది. ఒకవైపు పాలక ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోవడం, మరో వైపు వరి కోతల సమయంలో అకాల వర్షాలు సంభవించి రైతులకు అపారమైన నష్టం వాటిల్లుతుంది. వాజేడు మండలంలో సుమారు ఐదు వేల ఎకరాలలో వరి సాగు చేసిన రైతులు పంట చేతికి రావడంతో ఆనందపడ్డారు. ఆ ఆనందాన్ని అకాల వర్షం రూపంలో వచ్చి వరుణుడు రైతులను అతలాకుతలం చేస్తున్నాడు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైతు కళ్లాల్లో ఉన్న వరి ధాన్యం తడిసి పోతున్నాయి. కల్లంలోని వరి ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు నానా అవస్థలు పడుతూ ధాన్యం పై బరకాలు కప్పి రక్షించుకుంటున్నారు.
కోతల సమయంలో అకాల వర్షాలు సంభవించడంతో వరి నేల రాలి రైతులకు తీవ్రమైన నష్టాన్ని మిగిల్చింది. నేటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంట కళ్ళముందే అకాల వర్షాలకు తడిచి పోతుంటే ఏమి చేయలేక దిక్కుతోచని స్థితిలో ఆవేదన చెందుతున్నారు. రైతులు ఇప్పటికే లక్షల్లో పెట్టుబడులు పెట్టి వరి పంట పండించుకొని పంటలు అమ్ముకోవడానికి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక, కొనే నాథుడే లేకపోవడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రైతు పండించిన ధాన్యాన్ని అకాల వర్షాల నుండి కాపాడుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. ఇకనైనా పాలక ప్రభుత్వాలు స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మండల రైతాంగం డిమాండ్ చేస్తున్నారు.