Friday, November 22, 2024

TG: రుణమాఫీ పేరుతో రైతుల‌కు ఢోకా – రేవంత్ పై కేటీఆర్ విసుర్లు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు రుణమాఫీపై మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్‌లో స్పందించారు. రాష్ట్ర రైతులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేస్తోందని చెప్పారు. రైతుబంధు కింద జూన్‌లో ఇవ్వాల్సిన నిధుల నుంచే రూ.7,000 కోట్లు రుణమాఫీకి దారిమళ్లింపు చేశారని అన్నారు.

రైతులకు హక్కుగా రావాల్సిన రైతుబంధు డబ్బు నుంచి కొంతమొత్తం విదిల్చి, రుణమాఫీ చేస్తున్నామని పోజులు కొడుతున్నారన్నారు. రూ.40 లక్షల పైచిలుకు రైతులు లక్ష రూపాయల వరకు రుణాలు తీసుకుంటే కేవలం 11 లక్షల మందినే ఎట్లా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు. 2014, 2018లో కేసీఆర్ సర్కార్ రుణమాఫీతో పోలిస్తే పావు వంతు రైతులకే అర్హతనా అని నిలదీశారు.

అప్పట్లో కేసీఆర్ సర్కార్ 2014లోనే లక్షలోపు రుణాలను మాఫీ చేయడానికి రూ.16,144 కోట్లు వెచ్చించి సుమారు 35 లక్షల రైతులకు లబ్ధి చేకూర్చిందని చెప్పుకొచ్చారు. 2018లో అదే లక్షలోపు రుణమాఫీకి రూ.19,198 కోట్లు అంచనా కాగా మొత్తం లబ్ధిదారుల సంఖ్య సుమారు 37 లక్షలని తెలిపారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు రూ.2లక్షల వరకూ ఉన్న పంటరుణాలన్నీ వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన అందరు రైతులకూ రైతుబంధు విడుదల చేయాలని అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement