తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజ కొనుగోలు చేస్తామని చెప్పడం జరిగిందని.. కానీ గత పదిహేను రోజుల క్రితమే జనగామ వ్యవసాయ మార్కెట్ లో ధాన్యం రాశులు చూసినప్పటికీ నేటికీ కొనుగోలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని, మరో ప్రక్క వర్షాలు కురవడంతో దాన్యం రాసి తడిసి మొలకెత్తాయని, ఆ ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈరోజు జనగామ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ లో రైతులు పోసిన ధాన్యం తడిసి మొలకెత్తడంతో రైతులు మూకుమ్మడిగా వ్యవసాయ మార్కెట్ గేటుకు తాళం వేసి బైఠాయించారు.
వీరికి కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ…వర్షాకాలం పంటను కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్పిందన్నారు. అయితే గత పదిహేను రోజుల క్రితమే వ్యవసాయ మార్కెట్ లో ధాన్యం రాశులు పోసి ఉన్నామని, మార్కెట్ అధికారులు కొంటామని ఇప్పటికీ కొనుగోలు చేయలేదన్నారు. దీంతో ప్రకృతి వైపరీత్యంతో కురిసిన వర్షాలకు ధాన్యం రాశులు తడిసి ముద్దయ్యాయని, మొలకెత్తిన ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసన ధర్నాలో రైతులు వడ్లకొండ శ్రీశైలం, చామకూర నరసయ్య, నామాల అనిల్, మారబోయిన ప్రశాంత్, రవి, రాములు, కీర్తి, అశోక్, తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ మార్కెట్ లో ధాన్యం కొనేందుకు పర్మిషన్ లేదు – బాల్ దేవి జయ సిద్ధి లింగం :
వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనేందుకు పర్మిషన్ లేదని వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ బాల్ దేవి జయ సిద్ధి లింగం తెలిపారు. ఈ వర్షాకాలం సీజన్ లో మార్కెట్లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు పర్మిషన్ లేదన్నారు. రైతుల విన్నపం దృష్ట్యా కలెక్టర్ ను కలిశారు. వీరితో పాటు ప్రత్యేక శ్రేణి కార్యదర్శి నాగేశ్వర శర్మ, మార్కెట్ కార్యదర్శి జీవన్, తదితరులు పాల్గొన్నారు.