Thursday, November 28, 2024

Farmers Celebrations – వరి వేస్తే ఉరి కాదు.. సిరి అని నిరూపించిన ప్రభుత్వం మాది

ప‌లు స్టాల్స్‌ ప్రారంభించిన మంత్రులు
మూడు రోజుల పాటు కార్య‌క్ర‌మాలు
30న‌ సీఎం రేవంత్ రెడ్డి రాక
వరి వేస్తే ఉరి కాదు.. సిరి
క్వింటాకు రూ.500 బోనస్‌తో రైతుల్లో సంతోషం
వ్యవసాయమంటే దండగ కాదు..
పండుగ అని నిరూపించిన ఘనత కాంగ్రెస్‌ది
11 నెలల్లో రైతుల సంక్షేమానికి 54,280 కోట్లు ఖర్చు చేశాం
ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసి, రైతులకు అండగా నిలిచాం
రైతుల ఆదాయం పెంచేందుకు అన్ని చర్యలూ తీసుకుంటాం
సాగుకు సాంకేతికను జోడిస్తాం
సాంకేతికపై రైతులకు అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహిస్తాం
మంత్రులు దామోదర రాజ నర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు

ఆంధ్రప్రభ, మ‌హాబూబ్‌న‌గ‌ర్‌ : మ‌హ‌బూబ్ న‌గ‌ర్ కు మూడు కిలోమీట‌ర్ల దూరంలో అమిస్టాపూర్ శివారులో రైతు పండుగ సంబురాలు గురువారం ప్రారంభ‌మయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే సంబురాల‌ను రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌, ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు లు నేడు లాంచ‌నంగా ప్రారంభించారు.. ఈ కార్య‌క్ర‌మాంలో ఈ నెల 30వ తేదీన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. రైతు విజయోత్స‌వ స‌భ‌కు ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లా నుంచి రైతులు వ‌చ్చారు.

స్టాల్స్ ప్రారంభించిన మంత్రులు
పాలమూరులో రైతు విజ‌యోత్స‌వాలు సంద‌ర్భంగా అమిస్టాపూర్ వ‌ద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను మంత్రులు తుమ్మ‌ల‌, దామోద‌ర‌, జూప‌ల్లి ప్రారంభించారు. రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు 150 స్టాల్స్‌ను ఇక్క‌డ ఏర్పాటు చేశారు. ప్ర‌తి స్టాల్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ మంత్రి, మహబూబ్‌నగర్ ఇంచార్జ్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ రైతుల పండుగను జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆధునిక సాగు పద్ధతులను నేర్చుకోవడానికి రైతులు చూపిస్తున్న ఆసక్తి చూస్తుంటే చాలా సంతోషం కలుగుతోంది. వ్యవసాయం దండగ కాదు, పండుగ అని‌ చెప్పాం. ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచే ఆ మాటను ఆచరణలోకి తీసుకొచ్చాం. 11 నెలల కాలంలోనే 54,280 కోట్ల రూపాయలు రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం ఖర్చు చేశాం.. ఏకకాలంలో 22.5 లక్షల మంది రైతులకు 18 వేల కోట్ల రుపాయల రుణమాఫీ చేశాం. ఈ వానకాలం సీజన్‌లో సుమారు 67 లక్షల ఎకరాల్లో, 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తెలంగాణ రైతాంగం పండించింది. పండిన ప్రతి గింజనూ కొనే బాధ్యత మా ప్రభుత్వానిది. రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం సేకరణకు 8 వేల కేంద్రాలను ప్రారంభించాం.
ఇప్పటికే నాలుగున్నర లక్షల మంది రైతుల నుంచి సుమారు 26 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. రైతుల ఖాతాల్లో 5 వేల కోట్ల రూపాయలు జమ చేశాం. వరి వేస్తే ఉరి అని గత ప్రభుత్వం రైతులను బెదిరించింది. వరి వేస్తే ఉరి కాదు.. సిరి అని మా ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది. మా ప్రభుత్వం సన్న వడ్లు పండించిన రైతులకు, క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తోంది. వరి మాత్రమే కాదు, కందులు, శనగలు, జొన్నలు, సోయాబీన్ వంటి పంటలకు మద్ధతు ధర ప్రకటించి, కొనుగోలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది. ఇప్పుడు వ్యవసాయమంతా యంత్రాల మీదే నడుస్తోంది. నాటు వేయడం దగ్గర్నుంచి కోత కోసే వరకూ ప్రతి పనికీ యంత్రాలు వచ్చాయి. ఇప్పుడిప్పుడే వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెరుగుతోంది. భవిష్యత్తులో యాంత్రీకరణ ఇంకా పెరుగుతుంది. ఈ యంత్రాలు రైతులకు శారీరక శ్రమను తగ్గించడంతో పాటు, పెట్టుబడిని కూడా తగ్గిస్తున్నాయి. సాగుకు సాంకేతికతను జోడించి రైతుల ఆదాయం పెంచేలా చర్యలు తీసుకుంటున్నాం. అని వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement