రాజన్న సిరిసిల్ల : బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులదే అధికారమని సీఎం కేసీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్లలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. సిరిసిల్లలో నేతన్నలు ఆత్మహత్యలు చేసుకోవద్దని రాసిన రాతలను చూసి చలించిపోయానని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో మనకు ఎందుకు ఈ బాధలు అని బాధపడ్డామని కేసీఆర్ గుర్తు చేశారు. నా 70 ఏండ్ల జీవితంలో సిరిసిల్లలో కనీసం ఓ 170 సార్లు తిరిగానని కేసీఆర్ గుర్తు చేశారు. ఇక్కడ బంధుత్వాలు, ఆత్మీయతలు, ఎంతో మంది నా క్లాస్‌మేట్స్ ఉన్న సిరిసిల్ల ఇదన్నారు. హెలికాప్టర్‌లో వస్తుంటే అప్పర్ మానేరు నుంచి సిరిసిల్ల వరకు ఒక సజీవ జలధారగా మారిందని, సంతోసంగా ఉందన్నారు.
తాను చిన్నప్పుడు మోటార్ బైక్ మీద, సైకిల్ మీద ముస్తాబాద్ నుంచి వస్తే బ్రహ్మాండంగా మానేరులో నీళ్లు కనిపించేవి. కానీ సమైక్య పాలనలో దుమ్ములేసే పరిస్థితి వచ్చిందన్నారు. పోతుగల్లు గ్రామంపైన గూడూరు అనే ఊరు ఉండేది. ఆ ఊరికి మా అక్కను ఇచ్చాం. అక్కడ అప్పర్ మానేరు కాలువలో తాను ఈత కొట్టానన్నారు. తన కండ్ల ముందే పోతగల్లు గ్రామంలో 15 నుంచి 20 రైస్ మిల్స్ వచ్చాయన్నారు. సమైక్య పాలకుల దాడి, దోపిడీ పెరిగాక.. తాను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అవి మాయమైపోయాయని కేసీఆర్ పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో అప్పర్ మానేరు అడుగంటి పోయిందని కేసీఆర్ గుర్తు చేశారు. ఆ ప్రాజెక్టులోనే తెలంగాణ ఉద్యమ సభ జరిపిన పరిస్థితిని చూశామన్నారు.
ప్రాణం పోయినా సరే రాష్ట్రం రావాలి.. వచ్చిన రాష్ట్రం సజీవ జలధారలతో కళకళలాడాలని కలలు కన్నామన్నారు. అప్పర్ మానేరు ఎండాకాలంలో కూడా మత్తడి దుంకుతుంటే సంతోషంగా ఉందన్నారు. ఉద్యమ సందర్భంలో జయశంకర్ తనతో కలిసి తిగిరిగేవారన్నారు. ఓరోజు మధ్య రాత్రి సిరిసిల్ల నుంచి హైదరాబాద్ వెళ్తున్నామన్నారు. ఆత్మహత్యలు పరిష్కారం కాదు.. చావకండి అని రాయించారన్నారు. ఆ రాతలు చూసి కన్నీళ్లు పెట్టుకున్నామన్నారు. సమైక్య రాష్ట్రంలో మనకు ఎందుకు ఈ బాధలు అని బాధపడ్డామన్నారు. ఇక్కడ ఎంపీగా వస్తే ఆదరించి గెలిపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 24 గంటల కరెంట్ ఇస్తున్నామన్నారు.