పెద్దపల్లిరూరల్, (ప్రభన్యూస్): పెట్టుబడుల భారం పెరిగి.. దిగుబడి వచ్చే పరిస్థితి లేక పోవడంతో ఆవేదనకు గురైన ఓ రైతు సాగు చేసిన వరి పొలానికి నిప్పు పెట్టిన ఘటన పెద్దపల్లి శివారులోని చందపల్లిలో గురువారం చోటు చేసుకుంది. చందపల్లికి చెందిన తోట పెద్దన్న వానాకాలంలో రెండున్నర ఎకరాలలో సన్నరకం వరి పంట సాగు చేశాడు. పంటకు చీడ, పీడలు అధికం కావడంతో పెట్టుబడులు పెరిగిపోయాయి.
పెట్టుబడులు పెట్టి పొలం సరిగా దిగుబడి వచ్చే పరిస్థితి లేక పోవడంతో ఆ రైతు దిగాలు చెందాడు. ఎంత చేసినా ఫలితం లేదని నిరాశతో తాను రెక్కల కష్టంతో సాగు చేసిన వరిపొలానికి నిప్పంటించాడు. దీంతో పొలం కాలి బూడిదైంది. వరిసాగుతో తాను ఆర్థికంగా నష్టపోయాయని, ప్రభుత్వం ఆదుకోవాలని పెద్దన్న వేడుకున్నాడు.