హైదరాబాద్ – ఆదిలాబాద్ రైతు జాదవ్ దేవ్‌రావ్ ఆత్మహత్యకు ప్రభుత్వానిదే బాధ్యతని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.
కాంగ్రెస్ సర్కారు రుణమాఫీ చేయకపోవడంతో ఆదిలాబాద్ జిల్లా బేల మండలం రేణిగూడకు చెందిన రైతు జాదవ్ దేవ్‌రావ్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తన పేరిట రుణం ఉన్న బ్యాంకులోనే పురుగుల మందు తాగి ఆ రైతు బలన్మరణానికి పాల్పడ్డాడంటే.. ఆ రుణభారం రైతన్నను ఎంత మానసిక వేధనకు గురిచేసిందో అర్థమవుతుందన్నారు. ఆ అన్నదాత నిండు జీవితం బలికావడానికి రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ పేరిట చేసిన మహామోసంతోపాటు రైతు వ్యతిరేక విధానాలే ప్రధాన కారణమన్నారు. .
పదేళ్లపాటు రాజుగా బతికిన రైతన్న ఈ రోజు ఇందిరమ్మ రాజ్యంలో అవస్థల పాలవుతూ అరిగోస పడుతున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అన్నదాతలను పట్టించుకోవడం లేదన్నారు.అప్పులు తీరక అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడుతున్నా కనికరం లేని కాంగ్రెస్ సర్కారులో ఏమాత్రం చలనం లేదన్నారు. అధికారంలోకి రాగానే రైతులందరికీ రూ.2లక్షల రుణమాఫీ చేస్తానని ముఖ్యమంత్రి మాట తప్పడం.. రైతు భరోసా ఎత్తకొట్టడం వల్లే నాగోరావ్ అనే రైతు అన్యాయంగా బలయ్యారన్నారు.
ఇది ఆత్మహత్యకానే కాదని.. ముమ్మాటికీ రేవంత్ సర్కారు చేసిన హత్యగానే తెలంగాణ రైతాంగం భావిస్తుందన్నారు. నాగోరావ్ మరణానికి కారణమైన ఈ ప్రభుత్వంపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
రైతు కుటుంబానికి కనీసం రూ.20లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించి.. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రుణమాఫీ కాక దిక్కుతోచని స్థితిలో ఉన్న లక్షలాది మంది రైతుల అప్పులను వెంటనే మాఫీ చేసి, ప్రభుత్వం వారిని రుణవిముక్తులను చేయాలన్నారు. ఇలాంటి దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు.
పదేళ్లపాటు తెలంగాణలో గుండెలపై చేయి వేసుకుని హాయిగా బతికిన రైతుల జీవితాల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పూర్తిగా అధికారం అలుముకుందన్న కేటీఆర్, ఒకప్పుడు సాగులో, పంట దిగుబడిలో నెంబర్ వన్‌గా ఉన్న తెలంగాణ, ఇప్పుడు అన్నదాతల ఆత్మహత్యల్లో దేశంలోనే నంబర్ వన్‌గా ఉండడం కాంగ్రెస్ సర్కారు చేతకానితనానికి నిలువెత్తు నిదర్శనమని విమర్శించారు.
అన్నదాతలారా.. దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు అంటూ కేటీఆర్ రైతన్నలకు విజ్ఞప్తి చేశారు. నమ్మించి మోసం చేసిన ఈ నయవంచక కాంగ్రెస్ సర్కారును నిలదీద్దాం.. హామీలు అమలయ్యే దాకా కొట్లాడి ముఖ్యమంత్రి మెడలు వంచుదాం.. తప్ప మీ ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు.