- ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై హైకోర్టులో పిల్
- పట్టణాల్లోకి కూలీలకు పథకం వర్తించాలని వినతి
- విచారించిన హైకోర్టు ధర్మాసనం
- నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ సీఎస్ కు కోర్టు ఆదేశం
హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న ప్రారంభించిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నారాయణపేట వాసి గవినోళ్ల శ్రీనివాస్.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. భూమి లేని రైతు కూలీలకు ఏటా రూ. 12వేలు చెల్లించేలా రేవంత్ సర్కార్ పథకాన్ని రూపొందించింది.
కేవలం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కూలీలకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. పురపాలకాల్లో ఉన్న రైతు కూలీలకు డబ్బులు ఇవ్వడం లేదని పిటిషనర్ పేర్కొన్నారు. 129 పురపాలకాల్లో 8లక్షల మందికి పైగా రైతు కూలీలు ఉన్నారని చెప్పారు. గ్రామాల్లో ఉన్న వారికి ఇచ్చి పురపాలకాల్లో ఉన్న వాళ్లకు ఇవ్వకపోవడం సరైంది కాదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. రైతు కూలీలు ఎక్కడున్న అందరూ సమానమేనని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. కేవలం గ్రామాల్లోని వారికే వర్తింపజేయడం సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని చెప్పారు.
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ ధర్మాసనం.. పురపాలకాల్లోని రైతు కూలీలకు ఆత్మీయ భరోసా పథకం వర్తించడంపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీజే ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.