జనగామ – తన కూతురు, అల్లుడు తనను ఇబ్బందులు గురి చేస్తున్నారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మరోసారి కన్నీరు పెట్టుకున్నారు. అమాయకురాలైన తన కూతురిని అడ్డుపెట్టుకుని అల్లుడిని ప్రేరేపించడం అధర్మమని ఆయన మండిపడ్డారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘నీతిగా ప్రజా క్షేత్రంలో ఎదుర్కోవాలి తప్ప.. నా బిడ్డను, అల్లుడిని ప్రేరేపించడం మంచిది కాదు. రాజ్యాంగబద్ధంగా నా బిడ్డను ఏమనే పరిస్థితి లేక తప్పని పరిస్థితుల్లో హైకోర్టును ఆశ్రయించాను. ఆ స్థలంలో నా బిడ్డ నిర్మాణం చేసుకుంటానని చెప్పింది. కానీ అలాంటి నా బిడ్డను మీస్ గైడ్ చేసి రోడుపై వేస్తున్నారు. లాంటి వారిని భగవంతుడు క్షమించడు. ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాసేవ చేయాలి కాబట్టి నేను ప్రజాసేవలోనే ఉంటాను. ప్రజాసేవకు భంగం కలగకుండా ఉండేందుకే హైకోర్టును ఆశ్రయించాను. ప్రజాసేవ చేయాల్సిందిగా హైకోర్టు కూడా ఆదేశించింది’’ అని అన్నారు.
కష్టం చేసుకుని బతుకుతున్న తన కూతురిని మూర్ఖులు, దౌర్భాగ్యులు రోడ్డు పాలు చేస్తున్నారని ముత్తిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు సమాజానికి మంచిది కాదని, వారికి అరిష్టం కలుగుతుందని ముత్తిరెడ్డి శపించారు.
కాగా, కొంత కాలంగా ముత్తిరెడ్డిపై ఆయన కుమార్తె భవాని తీవ్ర అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. నియోజకవర్గంలోని చేర్యాల పట్టణంలో తన పేరుమీదున్న 23 గుంటల భూమిని తన తండ్రి కబ్జా చేసి తనకు తెలియకుండా తన పేరు మీద రిజిస్టర్ చేయించారంటూ ఆరోపించింది, ఆ భూమిని చేర్యాల ఆసుపత్రికి గిఫ్ట్ గా ఆమె ఇచ్చింది.. ఆయన వివాదం కొనసాగుతూనే ఉంది..