వరంగల్ జిల్లా ఏనుమాముల మార్కెట్‌లో ఉద్రిక్తత నెలకొంది. సోమవారం ఉదయం మార్కెట్ కార్యాలయాన్ని రైతులు ముట్టడించారు. వ్యాపారులు మిర్చి ధరలను అకస్మాత్తుగా తగ్గించారని ఆరోపిస్తూ రైతులు ధర్నాకు దిగారు. ఇప్పటి వరకు రూ.25 వేలు పలికే వండర్ హాట్ రకం మిర్చిని ఒకేసారి రూ.15000 పలుకడంపై మండిపడ్డారు.
ఇది సరైన పద్దతి కాదని ఆగ్రహం వ్యక్తం చేసారు. కనీసం 20 వేలు పలికినా దానికి తగ్గట్టు ఏదైనా సర్దుకోవచ్చు కానీ.. లేదా 25 వేల కంటే ఎక్కువైనా పలకాలిగాని ఇంత తక్కువగా పలకడం ఏంటని వ్యాపారులపై విరుచుకుపడ్డారు. 15 వేలకు విక్రయించే 1048, 5531 రకం మిర్చి రూ.8 వేలు, తేజ రకం రూ.20 వేలు, రూ.12 వేలకు విక్రయిస్తున్నారని అన్నదాతలు ధర్నాకు దిగారు.
మిర్చి ధరను వ్యాపారులు కావాలనే తగ్గించి కొనుగోలు చేసేందుకు ప్లాన్ వేస్తున్నారని మండిపడ్డారు. ఇలా అయితే అప్పులు తెచ్చి పంటను పండిచామని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబం రోడ్డున పడుతుందని వాపోయారు. ధరలు తగ్గిస్తే ఊరుకునేది లేదని మార్కెట్ కార్యాలయాన్ని చుట్టు ముట్టారు. రైతుల ఆందోళనతో ఎనుమాము మార్కెట్‌లో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో మార్కెట్ కార్యాలయల అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటా హుటిన చేరుకున్న పోలీసులు రైతులు చేస్తున్న పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. మిర్చి ధర పెంచే వరకు తమ ఆందోళన విరమించేది లేదని రైతులు స్పష్టం చేస్తున్నారు. ధరలు యధాతధ స్థితికి వచ్చే వరకూ రైతుల ధర్నా కొనసాగిస్తామని మిర్చి రైతులు స్పష్టం చేశారు.