Tuesday, November 26, 2024

కల్తీ కారం పొడి గుట్టు రట్టు

తాండూరు, ప్రభన్యూస్ : తాండూరు పట్టణంలో గుట్టుగా సాగిస్తున్న కల్తీ కారంపొడి వ్యాపారం గుట్టును వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. శనివారం పట్టణంలో దాడులు నిర్వహించి కీలక వ్యాపారి వద్ద నుంచి సుమారు రెండు క్వింటాళ్ల కల్తీ కారం పొడిని స్వాదీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు పట్టణం సాయిపూరు ప్రాంతానికి చెందిన ఎండి ఎజాజ్ పట్టణంలోని పాత కూరగాయల మార్కెట్ లో కారం పొడికి సంబంధించిన వ్యాపారం నిర్వహిస్తున్నాడు. పైకి ఈ వ్యాపారం నిర్వహిస్తూనే గుట్టుగా పనికిరాని, కుళ్లిపోయిన మిరప కాయలతో పొడి తయారు చేసి.. రంగు కోసం రసాయనాలు కలిపి కల్తీ కారం పొడి తయారు చేస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. అలా తయారు చేసిన కల్తీ కారం పొడిని వివిధ ప్రాతాలకు ఎగుమతి చేస్తున్నట్లు వారి విచారణలో తేలింది.

ఈ మేరకు శనివారం తాండూరు పట్టణం పాత కూరగాయల మార్కెట్ లోని ఎజాజ్ దుకాణంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో దుకాణంలోని సుమారు రెండు క్వింటాళ్ల కారం పొడితో పాటు రంగులను, పాడైన మిరుపకాయలను స్వాధీనం చేసుకుని పట్టణ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు వ్యాపారిపై కేసు నమోదు చేస్తున్నట్లు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి, ఎస్ఐ అబ్దుల్ రవూఫ్ లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్తీ వ్యాపారాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement