Tuesday, November 19, 2024

ఫ్యాక్ట్ చెక్: సీఎం కేసీఆర్‌కు ఈటల లేఖ!

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ముఖ్యమంత్రికి రాసిన లేఖ కలకలం రేపుతోంది. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అవడానికి ముందు తనపై వచ్చిన అభియోగాలకు సంజాయిషీ ఇస్తూ సీఎం కేసీఆర్‌‌కు ఈటల రాసినట్టుగా చెబుతున్న లేఖ నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో ఉన్న ప్రకారం.. తాను చేసింది తప్పేనని.. క్షమించమని ఈటల రాజేందర్ కేసీఆర్‌ను కోరినట్లుగా ఉంది. కార్యకర్తలతో తాను సమావేశాలు జరిపింది నిజమేనని, ఈ సమావేశాలకు పెద్దపల్లి లీడర్లు కూడా హాజరయ్యారని.. తామంతా పార్టీకి విధేయులుగానే ఉంటామని ఈటల రాజేందర్ చెప్పినట్లుగా అందులో ఉంది.

అయితే అది ఫేక్ లెటర్ అంటూ ఈటల అనుచరులు ఖండిస్తున్నారు..ఈటల వర్గీయులైన బీజేపీ నేతలు లేఖను కొట్టిపడేశారు. ఇది పూర్తిగా తప్పుడు ప్రచారమని తెలిపారు. దీనిని ఉద్దేశపూర్వకంగా పుట్టించారంటూ కరీంనగర్ జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈటలను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే ఇలా అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ లేఖను రూపొందించిన వారితోపాటు దానిని వైరల్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వీణవంక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చశారు. ఈటల ఎప్పుడూ తన లెటర్ ‌ప్యాడ్‌పై తెలుగులో ఏ విషయాన్నీ రాయలేదని అందులో పేర్కొన్నారు.

కాగా, భూకబ్జా ఆరోపణలపై ఈటలను మంత్రివర్గం నుంచి సీఎం కేసీఆర్ తొలగించిన సంగతి తెలిసిందే. అనంతరం జరిగిన పరిణామాలతో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఈటల బీజేపీలో చేరి రెండు వారాలు గడిచింది. అయితే, టీఆర్ఎస్‌లో మంత్రి స్థానంలో ఉన్నప్పుడు ఆయనపై వేటు పడేందుకు ముందు నాటకీయ పరిణామాలు జరిగిన సంగతి తెలిసిందే. తనను టీఆర్ఎస్ అధిష్ఠానం ఉద్దేశపూర్వకంగానే బయటకు వెళ్ళగొట్టిందంటూ ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏ తప్పూ చేయలేదని వివరణ ఇచ్చుకున్నారు. అయినా ఎవరో సామాన్యులు రాసిన లేఖకు స్పందించి తనపై తక్షణం వేటు వేయడం ఏంటని కూడా ప్రశ్నించారు. కొన్ని పథకాలను, నిర్ణయాలను ప్రశ్నించినందుకే తనపై ఈ చర్యలు తీసుకున్నారంటూ ఈటల రాజేందర్ ఆరోపణలు గుప్పించారు.

ఇది కూడా చదవండి: సీఎం జగన్ కేసుల ఉపసంహరణపై హైకోర్టు ఆదేశాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement