వరంగల్ క్రైమ్, (ప్రభ న్యూస్) : వరంగల్ ఆటోనగర్ కేంద్రంగా నకిలీ స్టిక్కర్స్ తో ఆయిల్ దందా చేస్తున్న ముఠా గుట్టును టాస్క్ ఫోర్స్ పోలీసులు బట్టబయలు చేశారు. పేరిన్నిక గల కంపెనీల పేరుతో నకిలీ ఇంజన్ ఆయిల్ ను తయారు చేస్తూ, వాహనదారులను మోసం చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ టాస్క్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్ వడ్డే నరేష్ కుమార్ నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ బృందం మెరుపు దాడి చేసి ఈ ముఠాని పట్టుకున్నది.
అక్రమార్జనకు అలవాటు పడ్డ వ్యాపారి వాహనాలకు అవసరమైన కంపెనీ ఆయిల్ కు బదులుగా నకిలీ ఆయిల్ ను తయారీచేసి, విక్రయించడం వల్ల వెహికిల్స్ బోర్ కొస్తున్నాయి. హనుమకొండ లోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ నందు డి 4 నెంబర్ గల రేకుల షెడ్డులో పెద్ద మొత్తంలో డ్రమ్ములలో ఇంజన్ ఆయిల్ తీసుకొని వచ్చి స్టోనర్ పేరుమీద, మ్యానుఫ్యాక్చర్ సంవత్సరం లేకుండా, నకిలీ స్టిక్కర్లతో ఇంజన్ ఆయిల్ తయారు చేస్తున్న వంగేటి నాగరాజు బండారాన్ని వెలుగులోకి తెచ్చారు.
విజయలక్ష్మి ఎంటర్ప్రైజెస్ పేరుతో తయారు చేస్తున్నాడన్న పక్కా సమాచారం మేరకు వరంగల్ టాస్క్ ఫోర్స్ ఏసీపీ డా. జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. విజయ్ ఎంటర్ప్రైజెస్ నిర్వాహకుడైన వంగేటి నాగరాజు ను పట్టుకొని అతని ఆధీనంలో ఉన్న నకిలీ ఇంజన్ ఆయిల్, గ్రీస్, పవర్ బ్రేక్ ఆయిల్, లేబుల్స్, సీల్ చేసే మిషన్, వేయింగ్ మిషన్, ఇంజన్ ఆయిల్ ఆన్ లోడ్ పైప్స్,ఖాళీ డబ్బాలు మొదలైన వాటిని సీజ్ చేశారు. వీటి విలువ సుమారు 5.50లక్షల దాకా ఉంటుంది.