Saturday, November 23, 2024

Engineering | అధ్యాపకులు రెండు కళాశాలల్లో బోధించవచ్చు.. ఏఐసీటీఈ అనుమతి

తెలంగాణలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో బోధించే అధ్యాపకులు రెండు కాలేజీల్లో బోధించే అవకాశాన్ని ఏఐసీటీఈ కల్పించింది. ఇప్పటి వరకు అధ్యాపకులు ఒక ఇంజినీరింగ్ కళాశాలలో మాత్రమే బోధించాలనే నిబంధన ఉండేది. అయితే కొత్తగా ఆఫ్ క్యాంపస్‌లు ఏర్పాటు చేసుకునే కళాశాలలు మాత్రం వారితో రెండుచోట్ల బోధన చేయించవచ్చు. ఉత్తమ పనితీరు కనబరిచే ఇంజినీరింగ్ కళాశాలలకు అఫిలియేషన్ విశ్వవిద్యాలయం పరిధిలో ఆఫ్ క్యాంపస్‌లు పెట్టుకోవచ్చని ఏఐసీటీఈ నిర్ణయించింది.

స్వయంప్రతిపత్త హోదా కలిగిన కళాశాలలు, NAC-A గ్రేడ్ కళాశాలలు 2024-25 విద్యా సంవత్సరం నుండి ఆఫ్ క్యాంపస్‌లను ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే, ఏఐసీటీఈ అనుమతి నిబంధనలలో ఆఫ్ క్యాంపస్‌ల సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రధాన కళాశాల అనుబంధంగా ఉన్న యూనివర్సిటీ పరిధిలో మాత్రమే వాటిని ఏర్పాటు చేయాలి.

ఆఫ్ క్యాంపస్‌లను మొత్తం మూడు కేటగిరీలుగా ఏఐసీటీఈ విభజించింది. ప్రధాన క్యాంపస్‌కు 5 కి.మీ.లోపు దూరంలో ఉండే కళాశాలలు, 75 కి.మీలోపు ఉండే కళాశాలలు, ఆపైదూరంలో ఉండే కళాశాలలు అని మూడు కేటగిరీలను ఏర్పాటు చేయనున్నారు. మొదటి కేటగిరీ కింద అధ్యాపకులతో పాటు ఆయా సదుపాయాలైన ప్రయోగశాలలు, క్రీడామైదానాలు లాంటివి రెండు క్యాంపస్‌లు వినియోగించుకోవచ్చు.

- Advertisement -

అంటే ఒక అధ్యాపకుడు ఎక్కడ అవసరముంటే అక్కడ పాఠాలు బోధిస్తారు. ఇక రెండో కేటగిరీలో మాత్రం అధ్యాపకులను ఆఫ్ క్యాంపస్‌కు పంపొచ్చు. కాకపోతే ఒకేరోజు రెండింటిలో బోధించడానికి వీల్లేదు. ఒకరోజు ప్రధాన క్యాంపస్, మరుసటిరోజు ఆఫ్ క్యాంపస్‌లో పాఠాలు చెప్పొచ్చు. ఇక మూడో కేటగిరీ కింద అధ్యాపకులను, వసతులను పంచుకోవడానికి వీల్లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement