బండి సంజయ్‌పై ఫేక్ వీడియో, కాల్ రికార్డింగ్
సోషల్ మీడియాలో పోస్ట్
వెలిచాల రాజేందర్ రావుపై ఈసీకి ఫిర్యాదు
తెలంగాణ లోక్సభ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. విమర్శలు, ప్రతివిమర్శలతో ప్రచారం హోరెత్తుతోంది. ప్రధాన పార్టీల నేతల మాటల తూటాలతో రాష్ట్రంలో దద్దరిల్లుతోంది. ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో వారు చేసే కొన్ని వ్యాఖ్యలు, గెలుపు కోసం వారు చేసే కొన్ని పనులు వివాదానికి దారి తీస్తున్నాయి. కొన్నిసార్లు కేసులు నమోదు కూడా అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే కరీంనగర్లో చోటుచేసుకుంది. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్ధి వెలిచాల రాజేందర్ రావుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
తన సొంత సోషల్ మీడియా ఖాతాలో కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అనని మాటలను అన్నట్లుగా డీప్ ఫేక్ వీడియోలు, కాల్ రికార్డింగ్ సృష్టించి దుష్ప్రచారం చేశారన్న ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వెలిచాలపై ఎన్నికల రిటర్నింగ్ అధికారికి, పోలీసులకు బీజేపీ నేత కొట్టె మురళీ క్రిష్ణ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కొట్టె మురళీ క్రిష్ణ ఫిర్యాదుపై కరీంనగర్ టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.