144 సెక్షన్ విధించిన పోలీసులు
మాగనూరు, నవంబర్ 27 (ఆంధ్రప్రభ) : నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థుల పరిస్థితి విషమించడంతో ఇవాళ ఏబీవీపీ, ఎమ్మార్పీఎస్, సీపీఎం, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల దగ్గరకు చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో నారాయణపేట డీఎస్పీ నల్లపు లింగయ్య ఆధ్వర్యంలో 144 సెక్షన్ విధించారు.
ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ… మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థుల పరిస్థితి ఈ విధంగా మారడానికి గల కారణాలను వ్యక్త పరచకుండా అధికారులు నీరుగారుస్తున్నారని, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వీలు లేకుండా శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
ప్రభుత్వ, పోలీసు తీరును విద్యార్థి సంఘాల నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. మధ్యాహ్న భోజనం వికటించి పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురికాగా ఆసుపత్రుల్లో చేరడంతో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. పది రోజుల్లో మూడోసారి మధ్యాహ్న భోజనం వికటించడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.