Monday, November 25, 2024

TS | మంచు దుప్పట్లో తెలంగాణ.. రోజురోజుకి పెరుగుతున్న న్యూమోనియా కేసులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతుండడంతో చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా న్యూమోనియా బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతుండడంతోపాటు పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్‌ డిజిట్‌కు పడిపోయాయి. దీంతో న్యూమోనియా బారిన పడుతున్నవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. న్యూమోనియా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి కావడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

మరీ ముఖ్యంగా తీవ్రమైన చలి కారణంగా చిన్నారులు న్యూమోనియా బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. చలి కారణంగా న్యూమోనియాతో పలు రకాల వైరస్‌లు పిల్లలపై ప్రభావం చూపితే శ్వాస వ్యవస్థలో ఇబ్బందులు ఏర్పడుతాయని, సరైన సమయంలో మందులను వాడకపోతే క్రమేణా నీరు ఊపిరితిత్తుల్లోకి చేరుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తీవ్రమైన చలికారణంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో న్యూమోనియాతో బాధపడుతున్న పిల్లల కేసుల సంఖ్య హైదరాబాద్‌లోని నీలోఫర్‌తోపాటు ఎంజీఎం, వివిధ జిల్లాల ఆసుపత్రుల్లో పెరుగుతోంది.

నీలోఫర్‌ ఆసుపత్రిలో ఇప్పటికే దాదాపు 100మంది దాకా చిన్నారులు న్యూమోనియాతో చేరినట్లు వైద్యవర్గాలు చెబుతున్నాయి. చిన్నారుల్లో అనేక మంది జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులతో ఆసుపత్రికి వస్తున్నారని, వారం గడిచినా జ్వరం తగ్గకపోవడంతో న్యూమోనియాగా నిర్ధారించి చికిత్స అందిస్తున్నామని వైద్యులు చెబుతన్నారు. న్యుమోనియా బాధితుల్లో అయిదేళ్ల లోపు చిన్నారులు ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆహార పోషణ సరిగా లేక, వాతావరణ పరిస్థితులు అనుకూలించక, రోగ నిరోధకశక్తి సన్నగిల్లడంతో ఈ జబ్బు బారిన పడుతున్నారని చెబుతున్నారు. తల్లిపాలు ఆరు నెలల పాటు తీసుకుంటే న్యుమోనియా వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని తెలిపారు. తక్కువ బరువుతో పుట్టే పిల్లలకు న్యుమోనియా వచ్చే అవకాశాలు ఎక్కువ అని చెబుతున్నారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు, గర్భిణులు ఈ వ్యాధి బారిన తరచూ పడే పడే అవకాశం ఉంది.

న్యూమోనియా సోకిన చిన్నారుల్లో విడవని పొడి దగ్గు, తీవ్రమైన జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కపం, రక్తం పడడం, చాతీనొప్పి, ఆహారం తీసుకోవడానికి ఇష్టం ఉండకపోవడం, మైకం వంటి లక్షణాలు కనిపిస్తాయని, విడవని దగ్గు, జలుబుతోపాటు జ్వరం, శ్వాసకోశ సమస్యలు పెరిగితే వెంటనే వైద్యుడికి చూపించి మందులు వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. చిన్నారులకు బలవర్ధకమైన ఆహారం పిల్లలకు ఇవ్వాలని, ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం తినిపించొద్దని సూచిస్తున్నారు. చలి నుంచి శరీరాన్ని పూర్తిగా కప్పే దుస్తులను చిన్నారులకు వేయాలంటున్నారు.

- Advertisement -

పంజా విసురుతున్న చలి…సింగిల్‌ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు…

ప్రస్తుతం రాష్ట్రంలో చలి డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. ఈశాన్యం నుంచి గాలులు వీస్తుండడంతో పది రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. కొమరంభీమ్‌ ఆసీఫాబాద్‌, సిర్పూరు తదితర ప్రాంతాల్లో అత్యల్పంగా6 నుంచి 8 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. రాబోయే 2-3రోజుల పాటు చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.

చలికితోడు పొగమంచు పలు జిల్లాల్లో కురుస్తోంది. ఉదయం 9 గంటలు దాటినా పొగమంచు వీడడం లేదు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాందేడ్‌-అఖోల జాతీయ రహదారి 161ని పొగమంచు పూర్తిగా కమ్మేస్తోంది. దీంతో వాహనదారులు లైట్లు వేసుకుని నెమ్మదిగా ప్రయాణించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement