హైదరాబాద్, ఆంధ్రప్రభ : రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక సూచన చేసింది. రేషన్ కార్డు ఈ కేవైసీ పూర్తి చేయని వారు త్వరగా చేయాలని కోరింది. ఈ కేవైసీకీ గడువు వచ్చే ఏడాది జనవరి 31 వరకు ఉందని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ దేవేంద్రసింగ్ చౌహాన్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే ఏడాది జనవరి 31లోగా ఈ కేవైసీని పూర్తి చేయాలని అన్ని రేషన్ షాపుల నిర్వాహకులను ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు (ఫుడ్ సెక్యూరిటీ కార్డు) ఈ కేవైసీ ప్రక్రియ కొనసాగుతుంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 70.80శాతం ఈ కేవైసీ పూర్తి అయిందని పౌరసరఫరాలశాఖ పేర్కొంది. మిగతా వాళ్లకు కూడా ఈ కేవైసీ పూర్తి చేయాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మీసేవ సెంటర్లలో రద్దీ భారీగా పెరగనుంది. ఈకేవైసీకి గడువు ఇక నెల మాత్రమే ఉండడంతో మీసేవ సెంటర్ల వద్ద రేషన్ కార్డు ఈ కేవైసి కొరకు ప్రజలు ప్రతి నిత్యం బారులు తీరనున్నారు. ఒకవైపు ప్రజాపాలన కార్యక్రమం కింద కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారెంటీ-ల పథకాల కొరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతూ ఉంది. మరోవైపు రేషన్ కార్డు ఈకేవైసీ ప్రక్రియకు గడువు తేదీ కూడాతక్కువగా ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్న పరిస్థితులు నెలకొన్నాయి.