Friday, November 22, 2024

TS : నిరుపేదల మేనిఫెస్టోను ప్రజలందరికీ వివరించండి.. విప్ బాల్క సుమన్

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుపేదలకు లబ్ధి చేకూర్చే మేనిఫెస్టో ప్రకటించారని, ప్రజలందరికీ మేనిఫెస్టో గురించి వివరించాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తెలియజేశారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో బారాస యువజన నాయకులతో మాట్లాడారు. బారాస ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలందరికీ వివరించాలని పిలుపునిచ్చారు. ప్రతి మహిళకు మూడు వేల రూపాయల పింఛన్, తెల్ల రేషన్ కార్డు గల ప్రతి ఒక్కరికీ సన్నబియ్యం, రాష్ట్రంలోని 93 లక్షల మందికి ఐదు లక్షల రూపాయల బీమా సౌకర్యం, ఆసరా పింఛన్లను ఐదు వేలకు పెంపు, ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితిని 15 లక్షల పెంపు, రైతుబంధు ఎకరానికి ఏడాదికి 16 వేలకు పెంచుతూ మేనిఫెస్టో విడుదల చేసిన అంశాలన్నింటిని గడపగడపకు తెలియ జేయాలన్నారు.

రాష్ట్రంలో మూడవసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని, పెద్దపల్లిలో గులాబీ జెండా ఎగిరేలా ప్రతి గులాబీ కార్యకర్త సైనికుల్లా పని చేయాలన్నారు. కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ అవకాశాలు ఉంటాయన్నారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసి పేదల జీవితాల్లో వెలుగులను నింపారన్నారు. కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, 60 గ్యారంటీలు ఇచ్చినా చెయ్యికి ఓటు వేసే పరిస్థితి లేదన్నారు. సంక్షేమం, అభివృద్ధి బారాసతోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో దాసరి ప్రశాంత్ రెడ్డి, ఉప్పు రాజ్ కుమార్, సూర శ్యామ్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement