మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనను కేంద్ర జలశక్తి శాఖ తీవ్రంగా పరిగణించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. హైదరాబాద్లోని రాష్ట్ర నీటిపారుదలశాఖ అధికారులతో నిపుణుల కమిటీ సమీక్ష నిర్వహించనుంది. అనంతరం మేడిగడ్డ జలాశయాన్ని సందర్శించనుంది. జలాశయాన్ని పరిశీలించిన వెంటనే నివేదిక అందించాలని కమిటీకి కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలు ఇచ్చింది.
కాగా, కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ వంతెన శనివారం ఒక్కసారిగా కొంతమేరకు కుంగింది. భారీ శబ్దంతో బి-బ్లాకులోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య ఉన్న వంతెన ఒక అడుగు మేర కుంగిపోయింది. బ్యారేజీ 20వ పిల్లర్ కుంగడంతోనే పైన వంతెన కుంగినట్లు సమాచారం. బ్యారేజీ పొడవు 1.6 కిలోమీటర్లు ఉండగా సంఘటన జరిగిన ప్రదేశం మహారాష్ట్ర వైపు నుంచి 356 మీటర్ల సమీపంలో ఉంది.