హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నుమాయిష్ ప్రారంభమైంది. నుమాయిష్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. నేటి నుంచి ఫిబ్రవరి 15వ తేదీ దాకా నుమాయిష్ కొనసాగనుంది. స్వాతంత్య్రానికి పూర్వం నుంచి కొనసాగుతూ వస్తున్న ఈ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ప్రతి సంవత్సరం జనవరి 1వ తేది నుంచి ఫిబ్రవరి 15వ తేది వరకు 46 రోజుల పాటు కొనసాగుతుంది.
దాదాపు 2400 స్టాళ్లను ఏర్పాటు చేశారు. అమ్యూజ్‌మెంట్ పార్క్, ఫుడ్ కోర్టులు, వివిధ పారిశ్రామికవేత్తల ఉత్పత్తి అమ్మకాలు చేపట్టేందుకు స్టాళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. నుమాయిష్‌కు వచ్చే సందర్శకులకు ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లను చేపట్టారు. పోలీస్, అగ్ని మాపక శాఖ అప్రమత్తంగా ఉండి నుమాయిష్ విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపడంతో పాటు మెట్రో రైలు వేళలను పొడిగించారు.