మక్తల్, ఆగస్టు 26(ప్రభ న్యూస్) : ఆదర్శప్రాయుడు, క్రమశిక్షణకు మారుపేరు దివంగత ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి అని పాలమూరు పార్లమెంట్ సభ్యులు డీకే అరుణ అన్నారు. దివంగత చిట్టెం నర్సిరెడ్డి 75వ జయంతి సందర్భంగా మక్తల్ పట్టణంలోని మినీ ట్యాంకర్ వద్ద విగ్రహ పునఃప్రతిష్ట ప్రారంభోత్సవం వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణిక రెడ్డి, మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితో కలిసి ఇవాళ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ… మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా పంచాయతీ సమితి అధ్యక్షుడిగా అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని నర్సిరెడ్డి సేవలను కొనియాడారు. ఆయన కృషివల్లే కృష్ణానదిపై లెఫ్ట్ ఇరిగేషన్ పథకాలు ప్రారంభించుకోవడం జరిగిందని సంగంబండ రిజర్వాయర్ నిర్మాణంలో ఆయన పాత్ర మరువలేదన్నారు. నేడు నియోజకవర్గం సస్యశ్యామలం కావడానికి నర్సిరెడ్డి పాత్ర మరువలేనిదన్నారు.
క్రమశిక్షణకు మారుపేరుగా అభివృద్ధికి ఆదర్శప్రాయుడుగా తన రాజకీయ జీవితంలో సాగిందని నేడు ఆయన జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం సంతోషదాయమన్నారు. నర్సిరెడ్డి కూతురుగా విగ్రహావిష్కరణ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మక్తల్, నారాయణపేట నియోజకవర్గం బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు చిట్టెం కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.