Thursday, November 21, 2024

Exclusive – పెద్దరికం చిన్నబోతోంది!

నానాటికీ క్షీణిస్తున్న రాజకీయ విలువలు

రాజ్యాంగబద్ధ పదవులకూ అపఖ్యాతి

అవకాశవాద, స్వార్థ రాజకీయాలతో మచ్చ

తెలంగాణ నేతల్లో సుఖేందర్‌ రెడ్డిది సుదీర్ఘ ప్రస్థానం

మండలి చైర్మన్‌గా రెండుసార్లు కీలక బాధ్యతలు

రాజ్యాంగ పదవిలో ఉంటూనే విలువలకు తిలోదకాలు

- Advertisement -

ప్రత్యర్థి నేతలపై నేరుగా రాజకీయ విమర్శలు

ఇలాంటి వైఖరి తగదంటున్న మేథావివర్గం

పదవుల ఔన్నత్యాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సూచన

భావి తరాలకు ఆదర్శంగా నిలవాలని విజ్ఞప్తులు

రాజకీయాల్లో పదవులు, హోదాలు అలంకారప్రాయం కాదు.. బాధ్యతతో కూడినవి. అందునా రాజ్యాంగబద్ధ పదవులు మరింత బృహత్తరమైనవి. ఈ పదవి ఒక సమూహానికో, వర్గానికో పరిమితం కాదు. మొత్తం శాసనవ్యవస్థకు ప్రతీక. ప్రజాస్వామ్య ఔన్నత్యాన్ని పరిరక్షించే గొప్ప బాధ్యత. ఇలాంటి సమున్నత పదవుల్లోని వ్యక్తులు రాజ్యాంగ విలువలు, సూత్రాలతోపాటు, నైతిక విలువలకూ ప్రాధాన్యం ఇవ్వాలి. సమాజానికి ఆదర్శంగా నిలవాలి. భవిష్యత్‌ తరాలకు మార్గదర్శకం కావాలి. అలా కాకుండా, అధికారమే పరమావధి అనుకుంటే.. విలువలకు తిలోదకాలిస్తే రాజ్యాంగ స్ఫూర్తికే విఘాతం కలుగుతుంది. ప్రజాస్వామ్యం మనుగడ ప్రమాదంలో పడుతుంది. దురదృష్టవశాత్తు ఇటీవలి కాలంలో రాజకీయాలతోపాటు.. రాజకీయాలతో ముడిపడిన రాజ్యాంగబద్ధ పదవులూ తిరోగమిస్తున్నాయి. ఏకంగా పెద్దల సభల్లోనే నైతికత లోపిస్తోంది. పెద్దరికం చిన్నబోతోంది. ఈ అభిజాఢ్యం తెలంగాణ రాజకీయాల్లోనూ ప్రతిబింబిస్తోంది. ఇలాంటి పరిణామాలు ఎంతమాత్రం వాంఛనీయం కావని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.

(న్యూస్‌ నెట్‌వర్క్‌ ఇన్‌చార్జ్‌)

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: సమకాలీన రాజకీయాల్లో నలభయ్యేళ్ల ప్రస్థానం సుదీర్ఘమనే చెప్పాలి. పైగా అన్నేళ్లు అధికారంలో కొనసాగడం గొప్పతనమే. గెలిచిన ప్రతీసారి కీలక హోదాలు.. పదవులు.. వివాదాలకు దూరంగా, సౌమ్యుడిగా అందరి మన్ననలు పొందడం నిజంగా అదృష్టమే. ఇలాంటి నేతలు అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన కొందరు నేతల్లో తెలంగాణ శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఒకరు.

కమ్యూనిస్టు పార్టీ ద్వారా రాజకీయ ఆరంగేట్రం చేసిన ఆయన ఆ తర్వాత పార్టీలు మారినా, అంచెలంచెలుగా ఎదుగుతూ రాజకీయాల్లో తనకంటూ ఒక పత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన ప్రముఖ, అగ్రనేతల్లో ఒకడిగా చెరగని ముద్రవేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కీలక పదవులు చేపట్టి రాష్ట్రస్థాయిలోనూ పార్టీలకు అతీతంగా గౌరవమన్ననలు పొందారు.

1984లో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా ప్రస్థానం ప్రారంభించిన ఆయన పలుమార్లు ఎంపీగా గెలుపొందారు. ముఖ్యంగా తెరాస, భారస ప్రభుత్వాలలో రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా, శాసన మండలి సభ్యుడిగా, మండలి చైర్మన్‌గా రాజ్యాంగబద్ధ పదవిని అధిష్టించారు. పెద్దల సభలో పెద్దరికం స్థాయికి చేరారు.

. అయితే, ఇక్కడే ఆయన విమర్శలకు గురవుతున్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో నైతిక విలువలను విస్మరిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మహోన్నత బాధ్యతల్లో ఉండి, రాజకీయ పరమైన వ్యాఖ్యలు, ఒక పార్టీకి కొమ్ముకాసే ప్రకటనలు ఆయనపై వివాదాస్పద ముద్ర పడేలా చేస్తున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

రాజకీయం వేరు.. పదవులు.. బాధ్యతలు వేరు.. ప్రజాస్వామ్యంలో వేటికవే ప్రత్యేకమైనవి. ఒక నాయకుడిగా ప్రజలతో మమేకమవుతూ, వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం కర్తవ్యం. అలాగే, తనకు అవకాశాలు కల్పించిన, ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీకి విధేయతగా మెలగడం కూడా అవసరమే.

ఈ క్రమంలో పరిణితితో, విజ్ఞతగా వ్యవహరించే నేర్పును ప్రదర్శించాలి. ఏ ఎండకా గొడుగు పట్టాల్సి వచ్చినా, నైతికత చట్రం పరిధిని దాటకుండా చూసుకోగలగాలి. లేదంటే ఇనేళ్లలో వచ్చిన పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు అపఖ్యాతికి గురయ్యే ప్రమాదముంది.

తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీలలో ఎంపీగా మూడ పర్యాయాలు గుత్తా సుఖేందర్‌ రెడ్డి కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఎంపీగా ఉన్న సమయంలో పట్టణ, గ్రామీణాభివృద్ధి, సమాచారం, ప్రసారాలు, ఇంధనం, రైల్వేలు, వాణిజ్యం మొదలైన పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీలలో సభ్యుడిగా పనిచేశారు. జాతీయ స్థాయి గుర్తింపు పొందారు. నేషనల్‌ డైరీ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌గానూ (1998) సేవలు అందించారు. ఈ ప్రస్థానంలో అంచెలంచెలుగా ఎదిగిన ఆయన, వివాదరహిత, విలువలతో కూడిన నాయకుడిగా మన్ననలు అందుకున్నారు.కండువా మారింది.. స్వరం మారింది…కానీ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గుత్తా సుఖేందర్‌రెడ్డి వైఖరిలో మార్పుకనిపించింది. కాంగ్రెస్‌ ఎంపీగా నాటి తెరాస ప్రభుత్వంపై గట్టిగానే పోరాడారు. తెరాస ప్రభుత్వం తీసుకొచ్చిన పార్లమెంటరీ కార్యదర్శుల పదవులకు వ్యతిరేకంగా న్యాయపోరాటం కూడా కొనసాగించారు.

ఆ తర్వాత అనూహ్యంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి దగ్గరయ్యారు. తెరాసలో చేరిపోయారు. పార్టీ ఫిరాయించిన సందర్భంలో ఎంపీ పదవికి రాజీనామా చేయలేదు. దీనిపై విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఇక ఎంపీగా పదవీకాలం ముగింపు దశలో కేసీఆర్‌ ఆయనకు మరో కేబినెట్‌ హోదాతో పదవిని కట్టబెట్టారు. తెలంగాణ రాష్ట్ర రైతు సమన్యయ సమితి చైర్మన్‌గా నియమించారు. ఆ తర్వాత 2019 ఆగస్టులో ఎమ్మెల్సీగా ఎన్నికై, మండలి చైర్మన్‌గా మూడేళ్లు అధికారంలో కొనసాగారు. మళ్లిd 2021లోనూ అదే పార్టీనుంచి ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు.

మరోసారి మండలి చైర్మన్‌ బాధ్యతల్ని చేపట్టారు.రాజ్యాంగ పదవికేదీ గౌరవం?రాజ్యాంగ పదవుల్లో ఉన్నవాళ్లు కండువాలు మార్చాల్సిన అవసరం లేదంటూ కొన్నాళ్ల కిందట గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజమే శాసనసభాపతుల స్థానం రాజ్యాంగ బద్ధమైనది. పార్టీలకు అతీతమైన బాధ్యతలతో కూడినది. ఇక్కడ కండువాలతో పనిలేదు. కానీ ఆయన ఈ వ్యాఖ్యలకు ముందు ఎలా వ్యవహరించారో గుర్తుచేసుకోవాల్సింది. తెరాస, భారాసలో ఉన్నప్పుడు ఆ పార్టీ తరఫున రాజకీయ స్వరం వినిపించిన సందర్భాలు, ఆ పార్టీ నేతల్ని పొగడ్తల్లో ముంచెత్తిన సందర్భాలున్నాయి. మండలి చైర్మన్‌గా ఉంటూనే కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌ను ఆకాశానికెత్తిన ఘనత ఆయనకే సొంతం.

అలాగే 2018, 2023 ఎన్నికల సమయంలోనూ వరుస మీడియా సమావేశాలు నిర్వహించి, పార్టీకి ప్రచారం చేసిన సంగతి మరచిపోయారేమో? ఒక్క మాటలో చెప్పాలంటే అదే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి టీఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌ లేకుంటే రాష్ట్రమే లేదనే తరహాలో ఆయన భజన తెలంగాణ ప్రజలకు ఇప్పటికీ జ్ఞాపకమే.

గతేడాది అసెంబ్లి ఎన్నికల్లో భారాస ఓడిపోయి, కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే మరోసారి గుత్తా సుఖేందర్‌రెడ్డి స్వరంలో మార్పుకనిపించింది. కొందరు సహచరుల మాదిరిగానే ఆయనా ఘర్‌వాపసీకి సిద్ధమయ్యారనే ప్రచారం జరిగింది. దీనిపై ఇప్పటికీ అధికారిక ప్రకటన లేనప్పటికీ, తన కుమారుడు గుత్తా అమిత్‌ను కాంగ్రెస్‌లోకి పంపించడం ద్వారా పరోక్ష సంకేతాలిచ్చి నట్లయింది.

మూసీ ప్రక్షాళన రాజకీయ వివాదంలో భారాసకు వ్యతిరేకంగా సుఖేందర్‌ రెడ్డి స్వరం వినిపించారు. మీరు చేస్తే ప్రక్షాళన.. ఇంకొకరు చేస్తే వేరొకటా? అంటూ నేరుగా కేటీఆర్‌, హరీష్‌లను టార్గెట్‌ చేస్తూ రాజకీయ విమర్శలు చేశారు.

.భావితరానికిదేనా సందేశం?

రాజ్యాంగ పదవిలోని వ్యక్తులు కండువాలు మార్చాల్సిన పనిలేదన్న మండలి చైర్మన్‌ సుఖేందర్‌ రెడ్డి వ్యాఖ్యల్లో పరమార్థం ఏంటని సామాన్యులతోపాటు విశ్లేషకులూ తలలు పట్టుకుంటున్నారు. ఊసరవెళ్లిని మించిన నైజం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ తాను ఏపార్టీ తరఫున మండలికి ప్రాతినిధ్యం వహిస్తున్నారో చెప్పగలరా? అని అడుగుతున్నారు. ఎంకంటే భారాస తరఫున ఆయన ఎమ్మెల్సీ అయ్యారు. తద్వారా మండలి చైర్మన్‌ పదవి చేపట్టారు.

కానీ, సుఖేందర్‌ రెడ్డి మా పార్టీలో లేరని స్వయానా భారాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేసీఆరే మీడియా ముఖంగా చెప్పారు. దీనిపై మండలి చైర్మన్‌ నుంచి స్పష్టమైన జవాబు రాలేదు. తాను ఫలానా పార్టీలోనే ఉన్నానని కానీ, లేదంటే ఫలానా పార్టీలోకి వెళ్లానని చెప్పలేని స్థితిలో ఉండటం శోచనీయం. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం, రాజ్యాంగ పదవులు చేపట్టిన వారుసైతం అవకాశవాద, స్వార్థ రాజకీయాలకు లోనవడం ద్వారా భావి తరానికి ఎలాంటి సందేశమిస్తున్నారని మేథావి వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement