హయ్యర్ ఎడ్యుకేషన్‌లో ఆడాళ్లే ఎక్కువ
రాష్ర్టాలవారీగా తెలంగాణకు ఐదో స్థానం
గత సర్కారు నిర్ణయాలు.. మాజీ సీఎం కేసీఆర్ చొరవ
62 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల ఏర్పాటు
మహిళలకు కలిసి వచ్చిన విద్యా అవకాశాలు
అందుబాటులోకి పలు ప్రొఫెషనల్ ప్రోగ్రామ్‌లు
ఇంజినీరింగ్ స్టడీలోనూ తెలంగాణ టాప్
కేంద్రం చేపట్టిన సర్వేలో వెల్లడైన అంశాలు ఇవే
అయిషే 2021–22 నివేదికలో వెల్లడి
ఉన్నత విద్యలో తెలంగాణ దూసుకుపోతోంది. పురుషులను వెనక్కినెట్టి మహిళలు మరింత స్పీడ్‌గా వెళ్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. మాజీ సీఎం కేసీఆర్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు దేశంలో తెలంగాణను ముందంజలో నిలబెట్టాయి. ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేస్తే కేరళ, తెలంగాణ, హర్యానా, అసోం, హిమాచల్‌ప్రదేశ్, జమ్ముకశ్మీర్, మేఘాలయ, ఛత్తీస్‌గఢ్‌లో మగాళ్ల కన్నా.. ఆడాళ్లు హయ్యర్ ఎడ్యుకేషన్‌పై ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక.. కేంద్రపాలిత ప్రాంతాలను మినహాయిస్తే అత్యధికంగా డిగ్రీలో నమోదుశాతం గల రాష్ర్టాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. తమిళనాడు (47), హిమాచల్‌ప్రదేశ్ (43.1), ఉత్తరాఖండ్ (41.8), కేరళ (41.3), తెలంగాణ (40) శాతంతో వరుసగా టాప్ 5 రాష్ర్టాలుగా నిలిచాయి.
మహిళా సాధికారత కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. మాజీ సీఎం కేసీఆర్ చేపట్టిన వినూత్న కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఉన్నత విద్యలో తెలంగాణ రాష్ట్రం నుంచి మహిళల స్థూల నమోదు నిష్పత్తి (Gross Enrolment Ratio)లో 7.5 శాతం గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. తెలంగాణలో మహిళల గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 2017–-18లో 34.1 శాతం ఉంది. అది 2021–-22 నాటికి 41.6 శాతానికి పెరిగింది. అదేవిధంగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ (AISHE) 2021-–22 ప్రకారం.. పురుషుల గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియా అదే సమయంలో 34.7 శాతం నుంచి 38.5 శాతానికి (3.8 శాతం) పెరిగింది.
టాప్ 10 రాష్ట్రాల్లో తెలంగాణ..
హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం పురుషుల కంటే మహిళల నమోదు గణనీయంగా ఎక్కువగా ఉన్న టాప్ 10 రాష్ట్రాలలో తెలంగాణ చోటు సంపాదించుకుంది. మొత్తంమీద 2021-–22లో రాష్ట్రం ఆకట్టుకునే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 40 శాతం నమోదు చేయగా.. జాతీయ సగటు 28.4 శాతంగా ఉంది. 2020–-21లో రాష్ట్ర గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 18–23 ఏళ్ల మధ్య ఉన్న జనాభాతో ఉన్నత విద్యలో చేరిన వ్యక్తుల నిష్పత్తి 39.1 శాతంగా ఉంది.
రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల ఏర్పాటుతో.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలల ఏర్పాటు.. కల్యాణలక్ష్మి పథకంతో పాటు బాలికలను ఉన్నత విద్యకు పంపేందుకు కుటుంబాలలో అవగాహన పెంపొందించడం వంటి బహుముఖ విధానాలను అనుసరించింది. దీంతో మహిళల గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెరుగుదలకు కారణమని చెప్పవచ్చు. బీఆర్ఎస్ ప్రభుత్వం తన హయాంలో మహిళల కోసం 62 రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేసింది. ఇందులో సాంఘిక సంక్షేమం కింద 30, గిరిజన సంక్షేమం కింద 15, బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థల సొసైటీల కిద 17 ఉన్నాయి.
అందుబాటులో ప్రొఫెషనల్ ప్రోగ్రామ్‌లు..
ఇలా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలతోపాటు.. ఈ కాలేజీల్లో రెగ్యులర్ డిగ్రీ కోర్సులు కాకుండా.. అగ్రికల్చర్, లా (Law) వంటి ప్రొఫెషనల్ ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి. ఈ కాలేజీల రాకతో చదువుకునేందుకు అమ్మాయిలు ఆసక్తి కనబరిచారు. దీంతో వారి అడ్మిషన్ల పెరుగుదల కారణంగా విశ్వవిద్యాలయాలు కూడా పెద్ద సంఖ్యలో హాస్టళ్లను ఏర్పాటు చేశాయి. ఇలా.. మహిళలు తమ ఉన్నత విద్యను అభ్యసించడానికి సహాయపడుతున్నాయి. మొత్తంమీద 2021-–22లో ఒక్కో కాలేజీకి సగటున 611మంది అడ్మిషన్ల చొప్పున 8,03,327 మంది మహిళలు.. 7,93,353 మంది విద్యార్థులు సహా 15,96,680 మంది వివిధ కోర్సుల్లో చేరారు. తెలంగాణ రాష్ట్రం నుండి మొత్తం 2,573 కళాశాలలు నమోదు చేసుకోగా.. కేంద్ర మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్(AISHE)లో 2,362 కాలేజీల నుంచి డాటా సేకరించారు.
ఇంజినీరింగ్‌లో తెలంగాణ టాప్
ఇంజినీరింగ్‌లో నాణ్యమైన విద్యను అందించడంలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయాల ఫలితంగా తెలంగాణలోని కాలేజీల్లో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్) పెద్ద ఎత్తున పెరిగింది. దేశంలో సగటు జీఈఆర్ 28.4 శాతం ఉంటే.. తెలంగాణలో ఇది 41.6 శాతంగా ఉంది. విద్యార్థులకు ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ తదితర కోర్సులపై అవగాహన కల్పించి, సమగ్ర సమాచారాన్ని అందజేయడంతో ఉన్నత విద్య అభ్యసించే వారి సంఖ్య పెరుగుతోంది.
విద్యా అవకాశాలపై అవగాహన పెంచే చర్యలు..
రాష్ట్రంలో ఉన్నత విద్యావకాశాలు ఏ విధంగా ఉన్నాయి? ఏ కోర్సుల వారికి మంచి ప్లేస్మెంట్ లభిస్తుంది? ఏ కాలేజీల్లో నాణ్యమైన విద్యావిధానం అందుబాటులో ఉన్నది ? ఎంసెట్‌లో ఏ ర్యాంకు వచ్చిన వారికి ఏ కాలేజీలో.. ఏ బ్రాంచ్‌లో సీటు వచ్చే అవకాశం ఉన్నది? అనే వివరాలన్నీ ఒకే వేదిక ద్వారా విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నారు. ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ తదితర పలు రకాల కోర్సుల పట్ల విద్యార్థులకు సంపూర్ణ అవగాహన కల్పించేందుకు ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు. దీనికోసం ఎంతో మంది నిపుణులు అందుబాటులో ఉంటున్నారు. ఈ ఫెయిర్‌లో వివిధ కాలేజీలు ఏర్పాటు చేసిన స్టాళ్లను విద్యార్థులు నేరుగా సంప్రదించి.. నచ్చి న కాలేజీలు, అందుబాటులో ఉన్న సీట్లు తదితర వివరాలు తెలుసుకునే వెసులుబాటు కలుగుతోంది.
అన్ని కేటగిరీల్లో తెలంగాణే బెటర్
ఉన్నత విద్యలో ప్రవేశాలు పొందే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థుల సంఖ్య రాష్ట్రంలో ఏటేటా పెరుగుతోంది. మరీ ముఖ్యంగా అమ్మాయిలు, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాల ఎన్రోల్మెంట్ గణనీయంగా మెరుగవుతోంది. ఇదే విషయాన్ని ఆలిండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ (అయిషే) వెల్లడించింది. 2017-–18 నుంచి 2021–-22 మధ్య ఐదేండ్ల కాలంలో రాష్ట్రంలో మొత్తం నమోదు 6 శాతం పెరిగింది. ఇదివరకు 34 శాతం ఉండగా, ఐదేండ్లల్లో 40.0శాతానికి చేరింది. ఇందులో పురుషుల నమోదు 4 శాతం పెరిగి 34.7శాతం నుంచి 38.5శాతానికి, మహిళల నమోదు ఏకంగా 7 శాతం పెరిగి 34.1 శాతం నుంచి 41.56 శాతానికి చేరింది.
పేదలకు అందుబాటులో ఉన్నత విద్య..
ఉన్నత విద్యలో ఎస్సీల మొత్తం నమోదు శాతం 30.4 శాతం నుంచి 39.2శాతానికి చేరగా, పురుషుల నమోదు 28.6శాతం నుంచి 35.6శాతానికి, మహిళల నమోదు 32.4శాతం నుంచి 42.9శాతానికి అంటే ఏకంగా 10 శాతం పెరిగింది.
ఎస్టీల నమోదు శాతాన్ని పరిశీలిస్తే మొత్తం నమోదు 28.4% నుంచి 38% చేరగా, పురుషుల నమోదు 30.2% నుంచి 39.1 శాతానికి, మహిళల నమోదు 26.6శాతం నుంచి 36.9 శాతానికి చేరింది.
జాతీయ సగటు జీఈఆర్ 28.4శాతం, పురుషుల జీఈఆర్ 28.3, మహిళల జీఈఆర్ 28.5శాతం మాత్రమే ఉన్నది. ఎస్సీ, ఎస్టీసహా మహిళల ఏ క్యాటగిరీలో తీసుకున్నా తెలంగాణ జాతీయ సగటు కన్నా ఉత్తమంగా ఉండటం విశేషం.
రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్యాపరంగా ఉన్నత విద్యలో మొత్తం నమోదు 2017-–18లో 14.19 లక్షలు ఉండగా, 2021-–22కు వచ్చేసరికి 15.96 లక్షలకు చేరింది. అంటే 1.77 లక్షల నమోదు పెరిగింది. పురుషుల నమోదు 7.35 లక్షల నుంచి 7.93 లక్షలకు పెరిగితే మహిళల నమోదు 6.83 లక్షల నుంచి 8.03 లక్షలకు చేరింది.
ఎస్సీ విద్యార్థుల నమోదు 2017-18లో మొత్తం నమోదు 2.03 లక్షలుంటే 2021–-22లో 2.53 లక్షలకు చేరింది. పురుషుల నమోదు 98 వేల నుంచి 1.19 లక్షలకు చేరితే మహిళల నమోదు 1.05 లక్షల నుంచి 1.34 లక్షలకు చేరింది.
ఎస్టీల నమోదు 2017-–18 నుంచి 2021 – 22 మధ్యకాలంలో 1.06 లక్షల నుంచి 1.37 లక్షలకు, పురుషుల నమోదు 57 వేల నుంచి 72 వేలకు, మహిళల ఎన్రోల్మెంట్ 48వేల నుంచి 65వేలకు పెరిగింది.
ఓబీసీల నమోదు 2017–-18 నుంచి 2021-22 మధ్యకాలంలో 5.96 లక్షల నుంచి 7.39 లక్షలకు చేరగా, పురుషుల నమోదు 3.03 లక్షల నుంచి 3.70 లక్షలకు, మహిళల నమోదు 2.92లక్షల నుంచి 3.68 లక్షలకు పెరిగింది.
సర్వేలో వెల్లడైన విషయాలు ఇవే..
కాలేజ్ డెన్సిటీ పరంగా 18-23 ఏండ్ల మధ్య వయస్సుగల లక్ష జనాభాకు అత్యధిక కాలేజీలున్న రాష్ర్టాల్లో 66 కాలేజీలతో కర్నాట మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత 52కాలేజీలతో తెలంగాణ రెండోస్థానం సాధించింది. 49 కాలేజీలతో ఏపీ మూడోస్థానంలో ఉంది. ఈ విషయంలో జాతీయ సగటు కాలేజీల సంఖ్య 30 మాత్రమే.
ఒక రాష్ట్రంలో అత్యధిక కాలేజీలున్న వాటిలో మహారాష్ట్ర, కర్నాటక, రాజస్థాన్, తమిళనాడు, మధ్యప్రదేశ్ టాప్ 5లో నిలిచాయి. ఆ తర్వాత ఏపీ, గుజరాత్ తర్వాత తెలంగాణ 2,395 కాలేజీలతో 8వ స్థానంలో ఉంది.
ఒక కాలేజీలో సగటు ఎన్రోల్మెంట్ తెలంగాణలో ఏటా పెరుగుతున్నది. 2017–18లో 558 మంది విద్యార్థులుండగా, 2018-–19లో 554, 2019-20లో 545, 2020-–21లో 556, 2021–-22లో 611 మంది విద్యార్థులకు చేరింది.
రాష్ట్రంలోని మొత్తం కాలేజీల సంఖ్య సైతం పెరుగుతోంది. 2017–-18లో రాష్ట్రంలో మొత్తం కాలేజీల సంఖ్య 2,045 కాగా, 2018–-19లో 1,988, 2019–-20లో 2,071, 2020–21లో 2,062, 2021–22లో 2,083 కాలేజీలకు చేరింది.