Saturday, November 23, 2024

Exclusive – తెలంగాణ కాంగ్రెస్ సామాజిక పాలిటిక్స్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: వచ్చే అసెంబ్లి ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలో ఖచ్చితంగా రావాలనే పట్టుదలతో ఆ పార్టీ నేతలు అన్ని రకాలుగా వ్యూహాలకు పదును పెడుతున్నారు. అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్‌.. ఒక వైపు బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీల్లోని అసంతృప్తులకు గాలం వేస్తూనే.. మరో వైపు సంప్రదాయ ఓటు బ్యాంక్‌పైన ఆ పార్టీ నేతలు ప్రధాన దృష్టిని సారిస్తున్నారు. ఇప్పటికే రెండు పర్యాయాలు అధికారానికి దూరమైన కాంగ్రెస్‌.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం రాకపోతే.. భవిష్యత్‌లోనూ ఇబ్బందు లు తప్పవని, శాశ్వతంగా అధికారానికి దూరం అవుతామనే భయం తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు పట్టుకున్నది. అందుకు కాంగ్రెస్‌ పార్టీకి మొదటి నుంచి అండగా ఉన్న రెడ్డి సామాజిక వర్గంపైన ఇప్పుడు ప్రత్యేక దృష్టిని సారించింది. రెడ్డి వర్గమంతా కాంగ్రెస్‌లోకి వచ్చే విధంగా చాపకింద నీరులా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఆ దిశగా పీసీసీ నాయకత్వం అడుగులు వేస్తోంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పోలరైజేషన్‌ అయితే.. మిగతా వర్గాల ఓట్లను కూడా మెజార్టీగా సాధించుకోవడానికి అవకాశం ఉంటుందనే భావనలో కాంగ్రెస్‌ నేతలు ఉన్నారు.

రాష్ట్ర విభజన తర్వాత రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు మెజార్టీగా బీఆర్‌ఎస్‌ వైపు మొగ్గు చూపారు. దీంతో క్షేత్రస్థాయిలో కూడా ఆ సామాజిక వర్గానికి చెందిన ఓటు బ్యాంకు కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎస్‌ వైపు మళ్లిందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. గ్రామాల్లోని మిగతా ఓటర్లను ప్రభావితం చేయగలిగే సామర్థ్యం ఎక్కువగా రెడ్డి వర్గానికి చెందిన నాయకులకే ఉంటుంది. అందుకు పెద్ద నాయకులను కాంగ్రెస్‌ వైపు తిప్పుకుంటే.. ఆటోమెటిక్‌గా ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా కాంగ్రెస్‌తో కలిసొచ్చే అవకాశం ఉంటుందని ఆలోచనలో ఉన్నారు.

కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో.. తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తుందనే ధీమాతో ఆ పార్టీ నేతలు ఉన్నారు. క్షేత్ర స్థాయిలో కూడా పార్టీ గ్రాఫ్‌ పెరిగిందని చెబుతున్నారు. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కాంగ్రెస్‌ నేతలు జాగ్రత్త పడుతున్నారు. అందుకు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలతో పాటు టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌రెడ్డి సైతం కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. బీఆర్‌ఎస్‌లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి సరైన ప్రాధాన్యత దక్కడం లేదని అసంతృప్తి వ్యక్తం చేయగా.. పార్టీ నుంచి ఆయన్ను సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడాయన త్వరలోనే కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

కాంగ్రెస్‌లో వైఎస్‌ఆర్‌టీపీ విలీనం?
ఇక వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తే.. షర్మిలకు స్టార్‌ క్యాంపెయినర్‌ ఇస్తామని ఆ పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. షర్మిల కోసం మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు కాంగ్రెస్‌ అధిష్టానం వద్దకు రాయబారం నడిపినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. షర్మిల కూడా ఇప్పటికే కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తోనూ రెండుసార్లు భేటీ కావడం.. రాహుల్‌గాంధీ జన్మదినం సందర్భంగా ట్విట్టర్‌లో శూభాకాంక్షలు తెలపడంతో అందుకు ఊతమిస్తోంది. షర్మిల కాంగ్రెస్‌లోకి వస్తే వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చరిష్మా ఉపయోగపడుతుందని అంచనాతో ఆ పార్టీ నేతలున్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌లోనూ షర్మిల ఇమేజిని ఉపయోగించుకుని.. అక్కడ పార్టీని బలోపేతం చేసుకోవాలనే ఆలోచన, వ్యూహాంతో ఉన్నట్లుగా కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. ముందుగా ఢిల్లి కోటపైన జెండా ఎగురవేశాక.. ఏపీపైన ఫోకస్‌ పెట్టాలని హస్తం పార్టీ పక్కగా వ్యూహరచన చేస్తున్నట్లుగా సమాచారం.

- Advertisement -

ఇదిలా ఉండగా, రాష్ట్రంలోని మిగతా నియోజక వర్గాల్లోని వివిధ పార్టీలకు చెందిన నాయకులపైన కూడా పీసీసీ నాయకత్వం ఫోకస్‌ పెట్టింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్‌రెడ్డి, కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డిలు కారు దిగి హస్తం గూటికి వచ్చేందుకు రెఢీ అయ్యారనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు నేతలు గతంలో కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన విషయం తెలిసిందే. వీరితో పాటు మాజీ ఎంపీలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డిల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చేవెళ్ల పార్లమెంట్‌ నుంచి పోటీచేసి ఓటమి చెందారు. మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లిన విషయం తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ చేతిలో రాజగోపాల్‌రెడ్డి ఓటమి చెందారు. ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాత్రం కాంగ్రెస్‌లోనే ఉన్నారు. ఇప్పుడు రాజగోపాల్‌రెడ్డిని తిరిగి కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టడమే కాకుండా ఢిల్లిలోనూ లాబీయింగ్‌ చేస్తున్నారు. జిల్లాలో బీఆర్‌ఎస్‌ను బలంగా ఎదుర్కోవాలన్నా.. రాజకీయంగా మరింత శక్తివంతం కావాల్సిన అవసరం ఉందని కోమటిరెడ్డి బ్రదర్స్‌ గుర్తించారు. అందుకే రాజగోపాల్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు సిద్దమైనట్లుగా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement