ఆంధ్రప్రభ – ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరోతెలంగాణలోని పదేళ్ల తర్వాత బదిలీలు, ఉద్యోగోన్నతులను ప్రభుత్వం చేపట్టింది. తాము కోరుకున్న ప్రదేశాలకు బదిలీ కావడం, ప్రమోషన్లు లభించడంపై ఉపాధ్యాయుల్లో ఆనందం నెల్కొంది. అయితే ఏళ్ల తరబడి పాఠశాలల్లో పిల్లలతో మమేకమై, ఆత్మీయ అనురాగాలు రంగరించి చదువులు చెప్పిన గురువులు గుండె బరువుతో పాఠశాలను వదిలి వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చిన్నారులు టీచర్ల చేయి పట్టుకుని బోరున ఏడుస్తున్న సన్నివేశాలు పలుచోట్ల ఆవిష్కృతం అవుతున్నాయి.
పాఠశాలను వదిలి వెళ్లొద్దు మేడం…
కాగజ్ నగర్ మండలం ఆరెగూడ జడ్పీ హైస్కూల్లో పనిచేస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులకు బదిలీ అయింది. శనివారం స్కూల్ టీచర్లు, పిల్లల పోషకులు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. 12 ఏళ్లు అక్కడే పని చేసిన మానస టీచర్ వెళ్తుంటే… మేడం… మీరు వెళ్లొద్దంటూ.. చిన్నారులు కంటతడి పెడుతూ రోదించారు. బరువెక్కిన పసి గుండెల వేదన చూసి ఉపాధ్యాయురాలు మానస కూడా దుఃఖాన్ని దిగమింగుకోలేక కన్నీటి పర్యంతమై వారందరిని అక్కున చేర్చుకొని సర్ది చెప్పారు.
టీచర్ తోపాటు పాఠశాల విడిచిన విద్యార్థులు…
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొనకల్ ప్రైమరీ స్కూల్లో జాజాల శ్రీనివాస్ ఎస్జీటీగా పనిచేస్తూ ఇటీవల అక్కపెల్లిగూడకు బదిలీ అయ్యారు. ఆయన సరిగ్గా 12 ఏళ్ల కిందట ఈ పాఠశాలలో చేరగా అప్పుడు ఇద్దరు టీచర్లకు కేవలం ఆ స్కూల్లో 32 మంది విద్యార్థులు ఉండేవారు. పిల్లలను ఆటపాటలతో పాఠాలు బోధిస్తూ… పిల్లలను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రత్యేక శ్రద్ధ చూపడంతో విద్యార్థులు మరింత దగ్గరయ్యారు. మరికొందరు జాయిన్ అయ్యారు. మాస్టార్ తాము కూడా మీ వెంట వస్తామని 3.5 కి.మీ. దూరంలో అక్క పెల్లి గూడ కు టీసీలు తీసుకుని వెళ్లి జాయిన్ అయ్యారు. ఇలా 133 మంది విద్యార్థులు వెళ్లారు. గురువున్న చోటికి పిల్లలు వెళ్లడంతో ఆ పాఠశాల సంఖ్య 250కి చేరుకోవడంతో అధికారులు నివ్వెర పోయారు.
ఊరినే తీర్చిదిద్దిన గురువు…
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేరామేరి మండలం మారుమూల గిరిజన గ్రామం సావర్ ఖేఢ్. వంద మంది విద్యార్థులు ఉన్న ఆ పాఠశాలకు వెళ్లిన టీచర్ కబీర్ల రంగయ్య ఉన్నత విలువలతో కూడిన చదువులు చెప్పి పాఠశాలనే కాదు ఆ గ్రామాన్ని తీర్చిదిద్దాడు. పిల్లల తల్లిదండ్రులను నచ్చచెప్పి బడిలో చేర్పించారు. రంగయ్య మాస్టార్ బదిలీ ఆపాలని ఆ గ్రామస్థలు పోరుబాట పట్టారు. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు రంగయ్య మాస్టారు ఆ గ్రామానికి తిరిగి గురువుగా వచ్చారు. ఊరి వాళ్లంతా రంగయ్య మాస్టారు పాదాలకు పాలాభిషేకం చేశారు. వందమంది పిల్లలు ఉన్న పాఠశాల ప్రస్తుతం 250కి చేరింది. జాతీయ ఉపాధ్యాయుడి అవార్డుకి రంగయ్య ఎంపికయ్యారు.
పువ్వులు చల్లుతూ… టీచర్లకు ఘన సత్కారం…
ఆదిలాబాద్ రూరల్ మండలం లోకారి- కె యూపీఎస్ పాఠశాలలో బదిలీ అయిన టీచర్లకు విద్యార్థులు ఘనంగా వీడ్కోలు పలికారు. అక్కడ పదేళ్లపాటు పనిచేసిన బేత లలిత, మీరాబాయి టీచర్లను దారి పొడవునా విద్యార్థులు పూలు చల్లుతూ ఘనంగా సత్కరించారు. బదిలీ సందర్భంగా విద్యార్థులు భావోద్వేగంతో కంటతడి పెట్టడంతో టీచర్లు సైతం చెమ్మగిల్లి న కళ్ళతో భారంగా నిష్క్రమించారు.
విద్యార్థుల అంతరంగాలను పసిగట్టాలి – సైకాలజిస్ట్ డాక్టర్ రవి వర్మ
.
విద్యార్థుల అంతరంగాలను ముందుగా పసిగట్టి వారితో మమేకమయ్యేలా టీచర్లు ప్రయత్నించాలి. అలాంటి టీచర్లు బదిలీపై వెళుతున్నప్పుడు విద్యార్థులు కంట తడి పెడుతుంటారు. బోధనకే పరిమితం కాకుండా ఆట పాటలతో అలరించడం వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత బయటపడుతుంది. ఉపాధ్యాయులు సమయపాలన క్రమశిక్షణ అలవర్చుకొని ఉన్నత లక్ష్యాలను అధిగమించేలా చిన్నారులను తీర్చిదిద్దాలి. మంచి టీచర్లు అనే భావన పిల్లల్లో వస్తే చదువులపై సహజంగా ఆసక్తి పెంచుకుంటారు.