గోడ చాటు..దుమారం! ఎంతకూ ఆరని నీళ్ల మంటలు
పార్టీల మధ్య సుంకిశాల రగడ
రిటైనింగ్ వాల్ కూలడానికి బాధ్యులెవరు
ఘటనను దాచిపెట్టేందుకు కారణాలేంటి
వారం తర్వాతే ఎందుకు బయటపెట్టారు
70శాతం పూర్తయినట్టు నివేదకలు
కూలిన గోడ నిర్మాణం బాధ్యత ఎవరిది?
పూర్తి బాధ్యత కంపెనీనే చేపట్టాలంటున్న ఇంజినీర్లు
బీఆర్ఎస్ హయాంలో డిజైనింగ్ లోపాలే అన్న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
4,350 కోట్లతో చేపట్టే కొడంగల్ లిఫ్ట్ అదే కంపెనీకా?
మేఘాపై సీఎం రేవంత్‌కు ఎందుకంత మమకారం
ప్రశ్నించిన బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్: సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిన ఘటన తెలంగాణలో పెను దుమారం సృష్టిస్తోంది. ఇటు ప్రభుత్వ పరంగా.. అటు ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది. మేడిగ్డ, అన్నారం బ్యారేజీలతోపాటు సుంకిశాల బాధ్యత కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అంటూ ఉప ముఖ్యమంత్రి భట్టి విమర్శిస్తుండగా.. తప్పులమీద తప్పులు చేస్తున్న మేఘా కంపెనీపై సీఎం రేవంత్‌కు ఎందుకంత ప్రేమ అని, ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయాల్సిందిపోయి.. కొడంగల్ లిఫ్ట్ బాధ్యతలను కూడా అప్పగిస్తారా? అని నిలదీశారు.
ఇక.. ఆగస్టు 2వ తేదీ ఉదయం 7 గంటల సమయంలో సుంకిశాల ప్రాజెక్టులోని ఇన్‌టేక్ వెల్ రిటైనింగ్ వాల్ ఒక్కసారిగా కూలిపోయింది. ఇది కూలుతున్న వీడియో ఒకటి ఆగస్ట్ 7వ తేదీన సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. దీన్ని ఎవరూ తీశారనే విషయంపై స్పష్టత లేదు. కానీ, సరిగ్గా కార్మికులు లేని సమయంలో ఘటన జరగడంతో ప్రాణనష్టం తప్పిందని చెప్పవచ్చు. కాగా, గోడ కూలిన ఘటనపై హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ప్రాథమిక విచారణ చేసింది. ఇక.. ఇన్‌టేక్ వెల్‌కు ఉన్న మిడిల్ టన్నెల్‌కు అమర్చిన గేట్, సైడ్ వాల్ కూలిపోయాయి. నాగార్జున సాగర్ నుంచి ఊహించని స్థాయిలో వరద రావడంతో ఈ ఘటన జరిగింది. సాగర్ రిజర్వాయర్‌లోని నీరు ఒక్కసారిగా చొచ్చుకు వచ్చి టన్నెల్ గేట్, సైడ్ వాల్ కూలిపోయి ఇన్‌టేక్ వెల్ నిండిపోయింది అని ప్రాథమిక విచారణలో తేలినట్లు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.
సుంకిశాల ప్రాజెక్టు ఎందుకోసం?
వ్యవసాయ అవసరాలు, విద్యుదుత్పత్తి, తాగునీరు.. ఇలా వివిధ అవసరాల కోసం నీటి ప్రాజెక్టులు నిర్మిస్తుంటారు. సుంకిశాల ప్రాజెక్టును పూర్తిగా తాగునీటి అవసరాల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది. 2050 నాటికి హైదరాబాద్ మహానగర తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ మహానగర తాగునీటి అవసరాలకు రోజుకు 602 మిలియన్ గ్యాలన్ల (ఎంజీడీ) నీరు అవసరం. ఇందులో నాగార్జున సాగర్ నుంచి ఇప్పటికే 270 ఎంజీడీల నీటిని తీసుకువస్తున్నారు.
ఇక.. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టులో భాగంగా అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా నీటిని కోదండాపూర్ వద్ద పంపు హౌస్‌కు తరలిస్తున్నారు. అక్కడ నీటిని ట్రీట్ చేసిన తర్వాత హైదరాబాద్ సిటీకి తరలిస్తున్నారు. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు. ఒకవేళ ప్రాజెక్టు నీటిమట్టం డెడ్ స్టోరేజీ (510 అడుగులు)కు చేరితే నీరు తరలించడం సాధ్యం కాదు. అందుకని కృష్ణా నదికి వరుసగా రెండు, మూడేళ్లు వరదలు రాకపోతే సాగర్‌లో నీటి మట్టం డెడ్ స్టోరేజీకి చేరితే హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నీటిని తరలించడం కష్టమవుతుంది. ఈ ఇబ్బందులు అధిగమించేందుకు సుంకిశాల ప్రాజెక్టుకు 2016లో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం సంకల్పించింది. 2021 మార్చి 16న మేఘా ఇంజినీరింగ్ కంపెనీకి పనులు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఉమ్మడి ఏపీలో ప్రతిపాదనలు..
కోదండాపూర్ వరకు 2325 ఎంఎం వ్యాసంతో రెండు వరుసల్లో పైపులైన్లు నిర్మించడం, సంపు నిర్మాణం, పంపుహౌస్‌కు అనుసంధానించే మూడు సొరంగాలు తవ్వడం, తదితర పనులు చేయాలి. ముందుగా రూ.1450 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రతిపాదించగా.. 2022 అక్టోబరు నాటికి రూ.2214 కోట్లకు అంచనాలు పెరిగాయి. వాస్తవానికి ఈ ప్రాజెక్టుకు 2011లోనే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తయారు చేసింది. 2012లో అప్పటి ప్రభుత్వం దగ్గరికి నివేదిక చేరింది. రూ.840కోట్లు అంచనా వ్యయంగా నిర్ణయించారు. దీనికి జైకా నుంచి రుణం తీసుకునేందుకు కూడా ప్రతిపాదించారు. కానీ అప్పట్లో అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి నీరు బాగా వస్తుండటంతో సుంకిశాల ప్రాజెక్టు అంతగా అవసరం లేదని ప్రభుత్వం భావించింది. అందుకే పనులు ప్రారంభం కాలేదని జలమండలికి చెందిన మాజీ ఇంజినీర్ ఒకరు చెప్పారు.
మూడు మార్గాల్లో నీటి రాక
ప్రస్తుతం పనుల్లో భాగంగా భారీ ఇన్‌టేక్ వెల్ నిర్మించారు. దీని ఎత్తు 590 అడుగులుగా జలమండలి చెబుతోంది. ఇన్‌టేక్ వెల్‌లోకి నీటిని తరలించేందుకు వీలుగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి మూడు టన్నెల్స్ (సొరంగాలు) నిర్మించారు. నాగార్జున సాగర్‌లో 455 అడుగుల ఎత్తులో నీరు ఉంటే తీసునేందుకు వీలుగా మొదటి టన్నెల్ ఉంటుంది. రెండో టన్నెల్ 5౦4 అడుగుల ఎత్తు వరకు నీరు ఉంటే తీసుకునేలా ఉంది. మూడో టన్నెల్ సాగర్‌లో నీటి మట్టం 547 అడుగుల ఎత్తు వరకు చేరినా తీసుకునేలా ఉంది. వీటి ద్వారా సాగర్‌లో నీటి మట్టం ఆధారంగా ఇన్‌టేక్ వెల్‌లోకి నీరు చేరుతుంది. ఈ వెల్‌కు సంబంధించిన సైడ్ వాల్ నిర్మాణంలో ఉంది. ఇటీవల రెండో టన్నెల్ నుంచి వరద వచ్చి గేటు కొట్టుకుపోవడంతోపాటు సైడ్ వాల్‌లోని ఒక బ్లాక్ కూలిపోయింది.
సైడ్ వాల్ నిర్మాణం ఎవరి బాధ్యత?
సైడ్ వాల్ కూలింది సరే, మళ్లీ ఖర్చు భరించి నిర్మించాల్సిన బాధ్యత ఎవరిపై ఉందనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. ఇది కచ్చితంగా నిర్మాణ పనులు చేస్తున్న మేఘా ఇంజినీరింగ్ కంపెనీపైనే ఉంటుందని నీటి పారుదల శాఖ రిటైర్డ్ ఇంజినీర్లు అంటున్నారు. పనులు చేస్తున్న సమయంలో ఈ తరహా ఘటనలు జరిగినప్పుడు తిరిగి నిర్మించే బాధ్యత కూడా ఆ నిర్మాణ కంపెనీపైనే ఉంటుంది. ఇప్పటి దాకా 70శాతం పనులు పూర్తయ్యాయని నివేదికలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది మార్చిలోగా పనులు పూర్తవుతాయని జలమండలి అధికారులు చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిర్దేశిత గడువులోగా ప్రాజెక్టు పూర్తి కావడం కష్టమే అనిపిస్తోంది. ఎందుకంటే, సాగర్‌లో నీటి మట్టం 510 అడుగులకు తగ్గితేనే ప్రాజెక్టు పనులు చేసే వీలుంటుంది. ఈ ఏడాది వరదలు రావడంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. నీరు అధికంగా ఉంటే పనులు చేయడం సాధ్యపడకపోవచ్చునని ఇంజినీర్లు అంటున్నారు.
ఎందుకు దాచిపెట్టారు.. ప్రభుత్వాన్ని నిలదీసిన కేటీఆర్..
సుంకిశాల ఘటనపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సైడ్ వాల్ కూలిపోయినా సరే అయిదు రోజుల వరకు ప్రభుత్వం బయటకు చెప్పకుండా దాచిపెట్టిందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. దీనిపై మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘‘హైదరాబాద్ తాగునీటి అవసరాల దృష్ట్యా బీఆర్ఎస్ ప్రభుత్వం సుంకిశాల ప్రాజెక్టును చేపట్టింది. గతంలో కోట్ల విజయభాస్కరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మొదటగా ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. ఎన్నో ఏళ్లుగా మరుగున పడిన ప్రాజెక్టును ముఖ్యమంత్రిగా కేసీఆర్ తిరిగి తెరపైకి తీసుకొచ్చి పట్టాలెక్కించారు. రాబోయే 50ఏళ్లకు తగ్గ నీటి అవసరాలు తీర్చేలా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాం. ఆగస్టు 2న అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు సైడ్ వాల్ కూలిన ఘటన జరిగితే ఎందుకు ప్రభుత్వం బయట పెట్టలేదు? ఈ విషయాన్ని ఎందుకు రహస్యంగా ఉంచిందనే విషయంపై సమాధానం చెప్పాలి’’ అని కేటీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
ప్రభుత్వం ఏం చెబుతోంది?
సుంకిశాల ప్రాజెక్టు గోడ కూలిన వ్యవహారంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రెస్పాండ్ అయ్యారు. ‘‘సుంకిశాల ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మొదలుపెట్టిన ప్రాజెక్టు కాదు, మేం కట్టించింది కూడా కాదు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులతోపాటు సుంకిశాల పాపం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానిదే. సుంకిశాల ప్రాజెక్టుకు 2021 జులైలో అగ్రిమెంట్ చేసుకుని.. 2023 జులై నాటికి టన్నెల్ సైడ్ వాల్ వరకు పూర్తి చేశారు. సాగర్‌లో నీళ్లొచ్చాయి కాబట్టే కూలింది అంటున్నారు. దీన్ని బట్టి అప్పటి డిజైన్లు ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయో అర్థమవుతోంది’’ అని భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. మరోవైపు బీజేపీ శాసనసభా పక్షం కూడా సుంకిశాల ప్రాజెక్టును సందర్శించి సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసింది.
మేఘాపై బంధం వెనక మతలబు ఏంటో?: కేటీఆర్
మేఘా ఇంజినీరింగ్ సంస్థపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక ఔదార్యం చూపిస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సుకిశాలపై సీఎం రేవంత్.. మేఘా బంధం వెనకున్న మతలబు ఏంటని ప్రశ్నించారు. సుంకిశాల ప్రమాదానికి కారణమైన మెఘా ఇంజనీరింగ్ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయాలని, ప్రమాదంపై న్యాయ విచారణ చేయాలని ప్రధాన ప్రతిపక్షంగా డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
సుంకిశాల ప్రాజెక్టు ప్రమాదానికి కారణమైన ఆ కంపెనీపై చర్యలు తీసుకోవాల్సిందిపోయి.. ఆ సంస్థకు రూ.4,350 కోట్ల కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి అప్పజెప్పనున్నారని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే మెఘా ఇంజనీరింగ్ కంపెనీని తెలంగాణ సంపద దోచుకు వెళ్తున్న ఈస్ట్ ఇండియా కంపెనీగా అభివర్ణించిన రేవంత్ రెడ్డి.. నేడు అదే సంస్థపై ఎందుకింత ఔదార్యం, ప్రేమ చూపిస్తున్నారో ప్రజలకు తెలిపాలన్నారు. మేఘా ఇంజినీరింగ్‌పై రేవంత్‌కు ఉన్న ప్రత్యేక ఆసక్తి, అందులోని ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు.