Thursday, November 21, 2024

Exclusive – పెద్దల యాదిలో ఈ తరం – శ్మశానంలో వెలుగుపూల సందడి

ఆంధ్రప్రభ స్మార్ట్​, ఉమ్మడి కరీంనగర్ బ్యూరో : సాధారణంగా ఇంటి వద్ద దీపాలు పెట్టి, టపాసులు పేల్చి దీపావళి పండుగను జరుపుకుంటారు. కానీ కరీంనగర్‌లో మాత్రం అందరూ శ్మశానానికి వెళ్లి సమాధుల మధ్య దీపాల వెలుగుల సందడిలో ఆత్మీయుల అనుబంధ యాదిని గుర్తు చేసుకోవటం ఆనవాయితీ. చక్కగా సమాధులను అలంకరించి పెద్దలను స్మరించుకుంటూ అక్కడే టపాసులు కాల్చి.. సరదాగా పండుగను జరుపుకుంటారు. దీపావళి పండుగ రోజున అందరూ దేవుళ్ల‌ను పూజిస్తారు. కానీ కొన్ని సామాజికవర్గాల కుటుంబాలు మాత్రం సమాధుల వద్ద పూజలు నిర్వహించి చనిపోయిన తమ పూర్వీకులను గుర్తుచేసుకుంటారు. ఇది కాస్త వింతగా కొందరు భావించటం సహజమే.. కానీ ఉన్నప్పటికీ చనిపోయిన వారి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ పండుగను జరుపుకోవ‌డం అనుబంధం, ఆత్మీయతను స్మరించుకునే అద్బుత పండుగ ఇది.

సమాధుల వ‌ద్ద‌ దీపావళి
ఈ ఆచారాన్ని ఆరు దశాబ్దాలకు పైగా ఇక్కడ కొనసాగుతోంది. పూర్వీకులను స్మరించుకుంటూ తమ కుటుంబీకులను ఖననం చేసిన శ్మశాన వాటికలో సమాధుల వద్ద దీపాలు వెలిగించి వేడుక చేసుకుంటారు. కరీంనగర్ కార్ఖానా గడ్డలోని హిందూ శ్మ‌శాన వాటికలో ఏటా దళిత కుటుంబాలు తమ కుటుంబీకుల సమాధుల వద్దనే దీపావళి పండుగను జరుపుకుంటాయి. పండగకు వారం రోజుల ముందే శ్మ‌శాన వాటిక వద్ద శుభ్రం చేసి సమాధులకు రంగులు వేస్తారు. తమ ఆత్మీయుల సమాధుల వద్దకు కుటుంబ సభ్యులంతా వెళ్లి అక్కడ అంత శుభ్రం చేసిన తరువాత పూలతో సమాధులను అలంకరిస్తారు.

- Advertisement -

ఆ తరం యాదిలో.. ఈ తరం
దీపావళి నాటికి సమాధులను ముస్తాబు చేసి పండుగ రోజున సాయంత్రం కుటుంబ సభ్యులంతా సమాధుల వద్దకు చేరుకుని అక్కడే గడుపుతారు. సమాధుల వద్ద పండుగ జరుపుకుంటే తమ వారితో కలిసి ఉన్న భావన వస్తుందని స్థానికులు చెబుతుంటారు. అందుకోసమే చిన్నా,పెద్ద‌ అనే తేడా లేకుండా ఆబాల గోపాలమూ తమ పూర్వీకులకు ఇష్టమైన వంటలు కూడా వండి సమాధుల వద్ద నైవేద్యంగా పెడతారు. పితృ దేవతలకు నైవేద్యాలు సమర్పించిన అనంతరం వారిని స్మరించుకుంటూ వారి సమాధుల వద్ద పూజలు చేస్తారు. ఉపాధి కోసం వెళ్లి వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా దీపావళి పండుగకు మాత్రం క‌చ్చితంగా కరీంనగర్ కు చేరుకుని తమ కుటుంబ సభ్యులతో కలిసి సమాధుల వద్ద పండుగ జరుపుతారు. కొత్త బట్టలు వేసుకొని పిల్ల పాపలతో సాయంత్రం ఆరుగంటలకు సమాధుల వద్దకు వచ్చి అక్కడే రెండు గంటలు గడిపి తిరిగి ఇళ్లకు వెళుతుంటారు. తమ పూర్వీకులు లేనిదే తాము లేమని, తమకు జన్మలేదని .. తమకు జన్మను ప్రసాదించిన పెద్దల యాదిలో కొన్ని గంటలైనా గడపటమే తమకు నిజమైన దీపావళి అని ఇక్కడి ప్రజలు చెబుతుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement