Tuesday, November 26, 2024

Exclusive Story on Congress Party అర‌చేతిలో మంట‌లు ….

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కాంగ్రెస్‌ పార్టీలో అభ్యర్థుల జాబితా వెలువడక ముందే ఆశావహుల నుంచి అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. వచ్చే అసెంబ్లి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం దక్కదని వాసన వస్తుండటంతో టికెట్‌ కోసం పార్టీ ముఖ్య నేతలపై ఆశావహులు ఒత్తిడి పెంచుతున్నారు. ఒక వైపు గాంధీభవన్‌ ఎదుట తమ అనుచరులతో ఆందోళన చేయిస్తున్న నాయకులు.. మరో వైపు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం వరకు వెళ్తున్నారు. నాగర్‌కర్నూల్‌ సీటు మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డికే ఇవ్వాలని రేవంత్‌రెడ్డిని గాంధీభవన్‌లో అడ్డుకునే పరిస్థితికి వచ్చింది. పార్టీ అధిష్టానం మాత్రం ఇటీవలనే బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి తనయుడు రాజేష్‌రెడ్డికి టికెట్‌ వస్తుందనే ప్రచారం జరుగు తుండటంతో నాగం వర్గీయులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక టికెట్ల కేటాయింపులు పూర్తయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. గత పదేళ్లుగా పార్టీని నమ్ముకుని పని చేస్తుంటే.. కొత్తగా వచ్చినవారికి టికెట్లు ఇస్తామనే సంకేతాలు అందుతుండటంతో పాత నాయకులు నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పార్టీలోని అసంతృప్తులు, టికెట్లు రానివారిని బుజ్జగించేందుకు నియమించిన ఫోర్‌మెన్‌ కమిటీ ఏ మేరకు సఫలీకృతమవుతోందనే వాదన కూడా వినిపిస్తోంది.

ప్రాంతీయ పార్టీల్లో పార్టీ ప్రధాన నాయకుడు చెబితే.. భవిష్యత్‌లో రాజకీయ భరోసా ఉంటుందని, అదే జాతీయ పార్టీల్లో మాత్రం ఆ హామీ ఉండదనే చర్చ కూడా నడుస్తోంది. మెజార్టీ వస్తే ఎవరు కుర్చీలో కూర్చుంటారో చివరి వరకు తెలియదని, ఒకవేళ అధికారానికి దూరమైతే పట్టించుకునే వారే ఉండరనే భయం కూడా ఆశావహులను వెంటాడుతోంది. ఎందుకంటే ఒక్కో నియోజక వర్గం నుంచి పదుల సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటే వారిలో మూడు పేర్లను ఎంపిక చేసి.. ఒకరిని ఫైనల్‌ చేశారని టాక్‌ వినిపిస్తోంది. టికెట్‌ రాని వారికి ఎమ్మెల్సీ లేదా ఎంపీగా పోటీ చేసే అవకాశంతో పాటు నామినెటెడ్‌ పదవులు ఇస్తామని హామీ ఇవ్వాలని నిర్ణయించారు. టికెట్లు ఆశించిన వారే కాకుండా.. పార్టీ కోసం పని చేసిన వారు వేలాది మంది ఉంటారని, ఇంత మందికి పదవులు ఇవ్వడం ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్న వినిపిస్తోంది.

కొనసాగుతున్న రెండు సీట్ల పంచాయతీ
కాంగ్రెస్‌ పార్టీలో ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌కు చెల్లుచీటి పెడుతున్నదనే విమర్శలు సొంత పార్టీ నుంచే వినిపిస్తోంది. ఒక కుటుంబానికి ఒక టికెట్‌ ఇవ్వాలి… లేదంటే పార్టీలో ఐదేళ్లు పనిచేసిన వారికి పోటీచేసే అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో రెండు టికెట్ల పంచాయతీ కొనసాగుతోంది. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఆయన తనయుడు రోహిత్‌ బీఆర్‌ఎస్‌ నుంచి ఇటీవలనే కాంగ్రెస్‌లో చేరారు. హనుమంతరావుకు మల్కాజ్‌గిరి సిట్టింగ్‌ ఇవ్వడంతో పాటు ఆయన తనయుడికి మెదక్‌ అసెంబ్లి టికెట్‌ ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది. పార్టీలోకి ఇటీవల వచ్చిన వారికి రెండు సీట్లు ఎలా ఇస్తారని.. కాంగ్రెస్‌లోకి ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మైనంపల్లి పార్టీలోకి వచ్చాక.. మేడ్చల్‌, మెదక్‌ డీసీసీ అధ్యక్షులు కాంగ్రెస్‌ను వీడి కారు ఎక్కారని, దీంతో పార్టీకి నష్టం జరిగిందని కొందరు సీనియర్లు మండిపడుతున్నారు. మాజీ మంత్రి జానారెడ్డికి ఇద్దరు తనయులకు టికెట్‌ ఇప్పించుకునే పనిలో బీజీ అయ్యారు. నాగార్జునసాగర్‌, మిర్యాలగూడ నియోజక వర్గాల్లో జయవీర్‌ రెడ్డి, రఘువీర్‌ రెడ్డిలను బరిలోకి దించేందుకు పావులు కదుపుతున్నారు. అయితే మిర్యాలగూడలో మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిర్యాలగూడ ఈసారి బీసీలకే ఇవ్వాలని కోరుతున్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కూడా రెండు సీట్లు పట్టుబడుతున్నారు. హుజూర్‌నగర్‌ నుంచి ఉత్తమ్‌, కోదాడ నుంచి ఆయన సతీమణి పద్మావతి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు.

బీసీలకు 25 లేదా 27 మాత్రమే?
ఇక టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయం పాటించాలని బీసీ వర్గాలు కోరుతున్నాయి. ఒక్కో పార్లమెంట్‌ నియోజక వర్గం నుంచి రెండు అసెంబ్లిd సీట్ల చొప్పున బీసీలకు మొత్తం 34 సీట్లు ఇవ్వాలని, కుదిరితే ఇంకో ఐదారు సీట్లలోనూ పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని బీసీ వర్గాల నుంచి బలమైన డిమాండ్‌ వినిపిస్తోంది. లేదంటే ఆయా వర్గాల నుంచి పార్టీకి సానుకూలత లభించదనే అభిప్రాయం బీసీ నాయకుల నుంచి వ్యక్తమవుతోంది. బీసీ వర్గాలకు సరైన న్యాయం దక్కకపోతే.. వారి నుంచి తీవ్ర అసంతృప్తి పెరుగుతుందనే భయం కూడా నెలకొన్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement