హైదరాబాద్, ఆంధ్రప్రభ: మునుగోడు ముందు వరకూ కాషాయ జెండా రెపరెపలాడిం ది! దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించింది. ఆ తర్వాత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భారాసతో నువ్వా? నేనా? అన్నట్టుగా విజయ ప్రస్థానం సాగింది. ఆయా ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్లను కూడా దక్కించుకోలేని పరిస్థితి! భారాసకు తానే ప్రత్యామ్నాయంగా ఎదిగి సవాల్ విసిరిన కమలదళం మునుగోడు ముందు నుంచి కోవర్ట్ కుట్రలను అంచనా వేయ లేక చతికిలపడడం మొదలైందన్న విశ్లేషణలు సాగుతున్నాయి. ఒక ప్రణాళిక ప్రకారం భాజపా ను దెబ్బతీస్తూ వచ్చారని విశ్లేషకులు స్పష్టం చేస్తు న్నారు. ప్రస్తుతం ఎన్నికల వేళ రాజగోపాల్ రెడ్డి అస్త్ర సన్యాసం ఎందుకు చేసినట్టు? సమాధానం కోసం చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఆయన మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే పదవికి రాజీ నామా చేయడమే పెద్ద డ్రామాగా ఇప్పుడు పరిశీ లకులు అనుమానిస్తున్నారు.
భాజపాలోకి అట్ట హాసంగా చేరిన ఆయన ఉప ఎన్నికలో అక్కడి నుంచే పోటీలోకి దిగి కాంగ్రెస్‌పై తొడ చరిచారు. అప్పటి నుంచి కాంగ్రెస్ నుంచి భాజపాలోకి వల సలు కూడా భారీగానే సాగాయి. అయితే, ఉప ఎన్నికలో ఆయన ఓడిపోయారు. దీనివెనుక కూడా అంతు చిక్కని ఎత్తుగడ ఉందని భాజపా వ్యూహకర్తల్లోనూ అనుమానాలు ఉన్నాయని అంటున్నారు. కావాలనే ఎమ్మెల్యే పదవికి రాజీ నామా చేసి భాజపా అధిష్టానాన్ని నమ్మించా రన్నది ఇప్పుడు ప్రధాన ఆరోపణ!
మునుగోడు ఉప ఎన్నిక నుంచి ఆ తర్వాత వరుసగా పలు తప్పిదాలు జరిగాయని విశ్లేషిస్తు న్నారు. చివరకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను మార్చే వరకూ ఇది సాగి చివరకు రేసులో బాగా వెనుకబడిపోయిందని చెబుతు న్నారు. మరో నెల రోజుల్లో ఎన్నికలు జరుగనుం డగా, కీలక నేతలు ఇప్పుడు కాడి పారేయడం వెనుక కారణాలు ఇవేనని డీలా పడిపోయిన శ్రేణులే అంటున్నాయి. కాంగ్రెస్‌పై విరుచుకుపడి రెచ్చగొట్టిన నేతలంతా ఇప్పుడు గాలితీసిన బెలూన్‌ల వలె మారిపోవడమేమిటని వారు ఆగ్రహావేశాలతో ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్రంలో భారాస అంతుచూస్తామని ప్రగల్బాలు పలికిన నేతలంతా ఇప్పుడు తోకముడిచి పార్టీని భ్రష్టుపట్టించారని కార్యకర్తలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. రాజకీయాల్లో గెలుపోటములు ఎలా ఉన్నా, మునుగోడులో ఒడిన తర్వాతి నుంచి రాజగోపాల్ ప్రవర్తన వివాదాస్పదంగా మారందని వారి వాదన. పార్టీలోకి ఎందుకొచ్చానా అన్నట్టు ఆయన వ్యవహరిస్తున్నారని, కీలక సమావేశాలకు డుమ్మా కొట్టారని వారు గుర్తు చేస్తున్నారు. ఇదంతా కాంగ్రెస్ అధిష్టానం అనుమతితో కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యూహమేనని ఘంటాపథంగా చెబుతున్నారు. ఇందుకు వారు చూపుతున్న కారణం కూడా అందుకు దోహదపడుతోంది. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్, రేవంత్, ఇతర నేతలపై పలు ఆరోపణలు చేసినా, పార్టీ కార్యక్రమాలకు అప్పట్లో దూరంగా ఉన్నా, మునుగోడు ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డికి ఓట్లేయాలని చెబుతూ అడ్డగోలుగా దొరికిపోయినా ఆయనపై ఏమాత్రం చర్యలు తీసుకోకపోవడాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. పైగా… నాపై క్రమశిక్షణ చర్యలు తీసుకోమని ఇచ్చిన ఫిర్యాదులు ఎప్పుడో బుట్టదాఖలయ్యాయని ఆయనే స్వయంగా చెప్పడాన్ని కూడా వారు గుర్తు చేస్తున్నారు.
ఇదిలావుంటే… మొత్తం ఎపిసోడ్‌లో కేవలం రాజగోపాల్ రెడ్డి ఒక్కరేనా? ఇంకా మరికొంతమంది నేతలు ఉన్నారా అన్నది ఇప్పుడు భాజపా అధిష్టానాన్ని తొలుస్తోంది. అందుకే కొందరు కీలక నేతలకు మొదటి లిస్ట్‌లో సీట్లు కేటాయించలేదన్న ప్రచారం ఇప్పుడు ప్రబలంగా వినిపిస్తోంది! మరి వీరంతా కట్టకట్టుకుని కాంగ్రెస్‌లోకి దూకి కోవర్టలన్న ఆరోణలను నిజం చేస్తారా? లేక గమ్మున ఉండిపోయి భాజపాలో నామ్‌కే వాస్తే నేతల్లా మిగిలిపోతారా? అన్నది మరో వారంలో తేలిపోతుందంటున్నారు.