మక్తల్, జూన్ 25 (ప్రభన్యూస్) సమస్యల సుడిగుండంలో సర్కారు బడులు కొట్టుమిట్టాడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు మనబడి పేరుతో ఆర్భాటం చేస్తున్నప్పటికీ అనేక పాఠశాలల్లో ఇప్పటికీ అదనపు గదుల కొరత ప్రహరీలు లేకపోవడం అవసరమైన కిచెన్ షెడ్ మరుగుదొడ్లు లేక అవస్థల పడుతున్నారు. తీవ్రమైన ఉపాధ్యాయుల కొరతతో విద్యకు విఘాతం కలుగుతుందని చెప్పవచ్చు.
మక్తల్ నియోజకవర్గంలో 233 పాఠశాలలు ఉండగా అందులో 253 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి. 36 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండగా నాలుగు బడుల్లో అసలు ఉపాధ్యాయులు లేని దుస్థితి ఉంది. ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తుందని మంత్రుల నుండి ఎమ్మెల్యేల వరకు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం తప్ప క్షేత్రస్థాయిలో మౌలిక వసతుల కల్పనతో పాటు ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోంది
. ఉపాధ్యాయులు లేకుండా ఏ విధంగా నాణ్యమైన విద్య అందుతుందో అర్థం కావడం లేదు. కంప్యూటర్ యుగంలో దూసుకుపోతున్నామన్న గొప్పలే తప్ప పాఠశాలలో విద్యను అందించే ఉపాధ్యాయుల నియామకాలు లేక బడులు మూతపడే పరిస్థితి నెలకొంది. ఏకోపాధ్యాయ పాఠశాల లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అధికారిక పనిమీద మండల కేంద్రానికి వెళ్ళినా, వ్యక్తిగత పనిపై సెలవు పెట్టినా ఆరోజు ఆ బడి మూతపడినట్లేనని చెప్పవచ్చు.గుడి లేని ఊరు ఉంటుందేమో కానీ బడి లేని ఊరు ఉండదన్నారు .కానీ బడి ఉన్న అక్కడ చదువు చెప్పే సార్లు లేక పిల్లలు గొర్రెలు, బర్రెలు కాపర్లుగా బాల కార్మికులుగా మారిపోతున్నారు
.మక్తల్ నియోజకవర్గం లో మండలాల వారీగా పాఠశాలలు ఉపాధ్యాయుల కొరతను పరిశీలించినట్లయితే మక్తల్ మండలంలో మొత్తం 58 పాఠశాలలు ఉన్నాయి. 37 ప్రాథమిక ,13 ప్రాథమికోన్నత ,8 ఉన్నత పాఠశాలలు ఉండగా దాదాపు తొమ్మిది వేల పైచిలుకమంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. మండలానికి 307 ఉపాధ్యాయ పోస్టులు మంజూరు కాగా 245 మంది ఉపాధ్యాయులు మాత్రమే పని చేస్తున్నారు. 62 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మక్తల్ మండలంలో ఏడు ఏకోపాధ్యాయ పాఠశాలలు 7 కొనసాగుతున్నాయి. మండలంలోని ఎర్సన్ పల్లి, పారేవుల, కొత్తపారేవుల, మాదన్ పల్లి ,రామసముద్రం, టేకులపల్లి గ్రామాల్లో ఏకోపాధ్యాయ పాఠశాలలు కొనసాగుతున్నాయి. ఇక గోప్లాపూర్ పాఠశాలలో అసలు ఉపాధ్యాయుడే లేడు. అక్కడ ఒకే ఒక పోస్ట్ ఉండగా ఒక ఉపాధ్యాయుడు లేకపోవడంతో మండలంలో ఇతర బడి నుండి సర్దుబాటు చేయడం లేదా విద్యా వాలంటీర్ను నియమించి బడిని కొనసాగించే పరిస్థితి ఉంది. అదేవిధంగా మాగనూరు మండలంలో మొత్తం 24 పాఠశాలలు ఉండగా వాటిలో 17 ప్రాథమిక ,నాలుగు ప్రాథమికోన్నత ,మూడు ఉన్నత పాఠశాలలు కొనసాగుతున్నాయి. 3200 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తుండగా 119 మంది ఉపాధ్యాయులకు గాను 83 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 35 ఉపాధ్య పోస్టులు ఖాళీగా ఉన్నాయి .ఈ మండలంలో పెగడబండ, అమ్మపల్లి ,పుంజనూర్, గజరం దొడ్డి, గురావ్ లింగంపల్లి ,తాళం కేరి ,బైరంపల్లి మొత్తం 8 పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా కొనసాగుతున్నాయి
. ఈ మండలంలో అచ్చంపేట గ్రామంలో ఉపాధ్యాయుడు లేకుండా బడి కొనసాగుతోంది. కృష్ణ మండలంలో 23 పాఠశాలల్లో 15 ప్రాథమిక, నాలుగు ప్రాథమికోన్నత, నాలుగు ఉన్నత పాఠశాలలో మొత్తం 3500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక్కడ 112 మంది ఉపాధ్యాయులు పని చేయాల్సి ఉండగా కేవలం 75 మంది మాత్రమే పని చేస్తున్నారు. 37 ఉపాధ్యాయ ఖాళీలు తో విద్య సక్రమంగా అందడం లేదు. మారుతి నగర్, సుకూర్ లింగంపల్లి, హిందూపూర్ ,కుసుమూర్తి నాలుగు పాఠశాలలో ఏకోపాధ్యాయ పాఠశాలలుగా కొనసాగుతుండగా అడవి ఖానాపూర్ పాఠశాలలో అసలు ఉపాధ్యాయుడు లేకపోవడం అక్కడ చిన్నారులకు గొడ్డలిపెట్టుగా మారింది.
. ఊట్కూర్ మండలంలో మొత్తం 46 పాఠశాలలకు గాను 28 ప్రాథమిక 11 ప్రాథమికోన్నత ఏడు ఉన్నత పాఠశాలలో సుమారు 7000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇక్కడ 215 మంది ఉపాధ్యాయులకు గాను 185 మంది పని చేస్తుండగా 43 ఉపాదయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సమిస్తాపూర్, నాగిరెడ్డిపల్లి, గార్లపల్లి ,తిమ్మారెడ్డిపల్లి తండా, ఎర్గట్ పల్లి, లక్ష్మీ పల్లి, బాపూర్ మొత్తం 7 పాఠశాలలు ఏకోపాధ్యాయ బడులుగా కొనసాగుతున్నాయి .నర్వ మండలంలో 27 పాఠశాలలకు గాను 15 ప్రాథమిక ,ఐదు ప్రాథమికోన్నత, 7 ఉన్నత పాఠశాలలో దాదాపు 5000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 135 మంది ఉపాధ్యాయులు పనిచేయాల్సిన మండలంలో 109 మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా 26 పోస్టులు ఖాళీగా ఉన్నాయి
. జంగం రెడ్డిపల్లి, లక్కర్ దొడ్డి ,ఎల్లంపల్లి పాఠశాలలు ఏకోపాధ్యా పాఠశాలలుగా పనిచేస్తుండగా రాజు పల్లి పాఠశాలలో అసలు ఉపాధ్యాయుడే లేడు.అదేవిధంగా అమరచింత మండలంలో మొత్తం 27 పాఠశాలలకు గాను 19 ప్రాథమిక, 3 ప్రాథమికోన్నత ,6 ఉన్నత పాఠశాలలో 3000మంది విద్యార్థులు చదువుకోవడం జరుగుతోంది. మండలంలో 112 మంది ఉపాధ్యాయులకు గాను 91 మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా 21 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ మండలంలో ధర్మాపూర్, తొక్యాతాండ, మిట్ట నందిమల్ల ,చింత రెడ్డి పల్లి పాఠశాలలో ఏకోపాధ్యా పాఠశాలలుగా కొనసాగుతున్నాయి. ఇక ఆత్మకూర్ మండలంలో మొత్తం 31 పాఠశాలలకు గాను 19 ప్రాథమిక ,2 ప్రాథమికోన్నత, 10 ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్నాయి.4500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ మండలంలో 158 మంది ఉపాధ్యాయులకు గాను 129 మంది పనిచేస్తుండగా 29 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి. బాలకృష్ణాపూర్, వీర రాఘవపూర్, సోంసాగర్ పాఠశాలలో ఏకోపాధ్యాయ పాఠశాలలుగా కొనసాగుతున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా 253 ఉపాధ్యాయ ఖాళీలు ఉండగా 36 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉపాధ్యాయులు లేని నాలుగు పాఠశాలలు కొనసాగుతున్నాయి
. ఆయా పాఠశాలల్లో అనేకచోట్ల అదనపు గదుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. వంట గది, విద్యార్థులకు అవసరమైన టాయిలెట్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. పేరుకు మన ఊరు మనబడి అంటూ మండలంలో ఒకటి రెండు పాఠశాలలను ఎంపిక చేసి రంగుల అద్దడం చిన్నచిన్న పనులు చేయడం తప్ప ప్రయోజనం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వం విద్యా వ్యవస్థను సమూలంగా మారుస్తుందని గొప్పలు చెప్పడమే తప్ప సమస్యల సుడిగుండం నుండి ప్రభుత్వ బడులను బయటకు వేయడం లేదని అంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం కొనసాగిస్తామంటూ ఉపాధ్యాయులకు సైతం శిక్షణ ఇవ్వడం జరిగింది. కానీ ఎక్కడ ఆంగ్ల బోధన జరుగుతున్న దాఖలాలు కనిపించడం లేదని పలువురు అంటున్నారు.
గురుకులాలు పేరుతో గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రభుత్వ పాఠశాలలను పాలకులు ఏమాత్రం పట్టించుకోలేదు అని ప్రజలు ఆరోపిస్తున్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు నాణ్యమైన విద్య అందాలంటే ప్రభుత్వ పాఠశాలలో పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పించడంతోపాటు ప్రతి తరగతికి ఉపాధ్యాయుడిని నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉపాధ్యాయ ఖాళీలను తక్షణమే భర్తీ చేసి ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలని పలువురు కోరుతున్నారు. ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేసేది ఎప్పుడు? పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేది ఎప్పుడు? బడుగుల పిల్లలకు నాన్యమైన విద్య అందేది ఎప్పుడు? వారి బతుకులు బాగుపడేది ఎప్పుడో అందుకు ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సి ఉంది. అంతవరకు వేచి చూడాల్సిందే మరి.