Saturday, November 23, 2024

Exclusive Story – గులాబీ బాస్ న‌జ‌ర్ – అసెంబ్లీ బ‌రిలో 30మంది కొత్త ముఖాలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: ఈ ఏడాది చివర్లో జరుగనున్న అసెంబ్లి ఎన్నికల్లో 20 నుంచి 30 స్థానాల్లో కొత్త అభ్యర్థులు, ఇతర పార్టీల ఎమ్మెల్యేలున్న 15 స్థానాల్లో గతంలో పోటీ చేసిన వారు కాకుండా కొత్త వారిని ఎంపిక చేసే దిశగా భారత రాష్ట్ర సమితి అధినేత (భారాస) ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కసరత్తు చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి #హదరాబాద్‌లో ఎంఐఎం ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహస్తున్న ఏడు అసెంబ్లి స్థానాల్లో భారాస పోటీ నామమాత్రంగానే ఉండే అవకాశం ఉంటుందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. సిట్టింగ్‌ స్థానాలు, ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ఉన్న చోట మొత్తం కలిపి సుమారు 20 నుంచి 30మంది కొత్త ముఖాలను బరిలోకి దించాలన్న నిర్ణయానికి కేసీఆర్‌ వచ్చారని ఇందుకు సంబందించిన తుది జాబితాను సిద్ధం చేసే పనిలో ఆయన నిమగ్నమయ్యారని తెలుస్తోంది.

వాళ్లకు మాత్రం మళ్లి అవకాశం
కాంగ్రెస్‌, టీడీపీల నుంచి భారాసలో చేరిన ఎమ్మెల్యేల్లో దాదాపు అందరికీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వనున్నట్టు సమాచారం. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ నుంచి 12, టీడీపీ నుంచి ఇద్దరు, మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు భారాస తీర్ధం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరిపై తీవ్రమైన ఆరోపణలతో పాటు… అటు ప్రజలు, ఇటు పార్టీ కార్యకర్తల్లోనూ వ్యతిరేకత ఉన్నట్లు సర్వేల్లో బయట పడినందున వారికి ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఉంటుందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. అయితే ఈ విషయంలో పార్టీ అధినేత కేసీఆర్‌ వివిధ కోణాల్లో ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఆరోపణలు ఉన్నప్పటికీ.. ఇచ్చిన హామీ మేరకు మళ్లి టికెట్‌ ఇచ్చి ప్రత్యేక వ్యూ హంతో గెలవాలా.. లేక వారికి ఎమ్మెల్సీ వంటి హామీ ఇచ్చి కొత్తవారిని కదనరంగంలోకి దించాలా? అనే విషయంలో కసరత్తు జరుగుతోందని చెబుతున్నారు. ఆయా పార్టీల నుంచి వచ్చి భారాసలో చేరిన ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరికి పోటీకి అవకాశం ఇవ్వకపోతే వారు పార్టీని వీడి విపక్ష పార్టీల్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని ఉప్పందడంతో వారికి నచ్చజెప్పే ప్రక్రియకు శ్రీకారం చుట్టారని ఈ బాధ్యతను ఇద్దరు కీలక నేతలకు అప్పగించినట్టు ప్రచారం జరుగుతోంది.

సిట్టింగుల్లో గల్లంతయ్యే వారిలో వరంగల్‌ నుంచే ఎక్కువ
వచ్చే అసెంబ్లి ఎన్నికల్లో భారాస తరపున పోటీ చేసేందుకు అవకాశం దక్కని సిట్టింగుల్లో అధిక శాతం ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచే ఉన్నారన్న ప్రచారం భారాసలో విస్తృతంగా సాగుతోంది. ఒక ఎస్టీ, ఒక ఎస్సీ రిజర్వు నియోజక వర్గాలతోపాటు మరో రెండు జనరల్‌ నియోజక వర్గాల్లో అభ్యర్థుల మార్పు ఉంటుందని సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహతంగా ఉండే కీలక నేత ఒకరు సంకేతాలిచ్చారు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పార్టీకి ఇబ్బందులు పెడుతుండడం, జిల్లా యంత్రాగాన్ని బెదిరించి బ్లాక్‌ మెయిల్‌ ఘటనలకు పాల్పడడం ఎంత చెప్పినా వైఖరి మార్చుకోని సిట్టింగుల్లో ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన నలుగురికి ఉద్వాసన తప్పదని అంచనా వేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

మంత్రులందరికీ మళ్ళీ చాన్స్‌
కేసీఆర్‌ మంత్రి వర్గంలో ఉన్న వారందరికీ ఈ దఫా పోటీకి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. కేబినెట్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహా 17 మంది ఉన్నారు. వారిలో మహమూద్‌ అలీ, సత్యవతి రాథోడ్‌ ఎమ్మెల్సీలుగా కాగా… మిగతా వారందరూ ఎమ్మెల్యేలే. 14 మంది మంత్రుల పనితీరుపై సీఎం కేసీఆర్‌ సంతృప్తిగానే ఉన్నారు. అయితే తీవ్రమైన ఆర్థిక నేరాభియోగాలు ఎదుర్కొంటున్న ఓ మంత్రికి సంబంధించిన కేసులో ఆరు నెలల్లో విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించింది. ఒకవేళ ఆ కేసులో ఎన్నికల్లోపే ప్రతికూల తీర్పు వస్తే టికెట్‌పై ప్రభావం చూపవచ్చునని ప్రచారం జరుగుతోంది.

- Advertisement -

కాగా పలువురు ఎమ్మెల్సీలు, ఒకరిద్దరు ఎంపీలు కార్పొరేషన్‌ చైర్మన్లకు ఎన్నికల్లో పోటీచేసే అవకాశం దక్కవచ్చని సమాచారం. మంతులు మ హమూద్‌ అలీ, సత్యవతి రాథోడ్‌లను అసెంబ్లి ఎన్నికల్లో పోటీ చేయించాలని నిర్ణయించినట్టు సమాచారం. మహబూబాబాద్‌కు చెందిన ఓ మహళా ఎంపీని వారి తండ్రి ప్రాతినిధ్యం వహస్తున్న నియోజక వర్గం నుంచి బరిలోకి దింపే అవకాశం ఉంది. మంత్రి హరీష్‌రావుకు అత్యంత సన్నిహతుడైన మరో ఎంపీని ఉప ఎన్నిక జరిగిన దుబ్బాక నుంచి పోటీకి దింపాలని ప్రతిపాదించారు. హుజురాబాద్‌ నుంచి ఓ ఎమ్మెల్సీ బరిలోకి దిగనుండగా మంత్రి కేటీఆర్‌కు సన్నహతుడైన మరో ఇద్దరు ఎమ్మెల్సీలు పోటీకి తహతహ లాడుతున్నారు. ఇందులో ఒకరు జనగామ జిల్లా నుంచి మరొకరు మేడ్చల్‌ జిల్లా నియోజక వర్గం నుంచని సమాచారం. ఓ మాజీ ఉప ముఖ్యమంత్రికి కూడా సిట్టింగ్‌ను మార్చి పోటీ చేయించాలన్న ఆలోచనతో కేసీఆర్‌ ఉన్నట్టు సమాచారం. దాదాపు ఆరుగురు కార్పొరేషన్‌ చైర్మన్లు తమకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నట్టు తెలుస్తోంది. జహరాబాద్‌, గద్వాల, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌, #హుజురాబాద్‌, నర్సంపేట అసెంబ్లి సెగ్మెంట్లలో తమను బరిలోకి దింపాలని చైర్మన్లు కోరుతున్నట్టు సమాచారం. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లి స్థానానికి పోటీ పడుతున్న ఐదుగురు కార్పొరేషన్‌ చైర్మన్లు కావడం విశేషం.

ఆషాడం ముగిశాకే
అసెంబ్లిd ఎన్నికలకు వేగంగా సిద్ధమవుతున్న భారత రాష్ట్ర సమితి చీఫ్‌ కేసీఆర్‌ జులై 17న ఆషాడ మాసం ముగిసిన తర్వాత.. మంచి ముహూర్తాన తొలి జాబితా ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సర్వేలు, వివిధ అంశాలపై సమాచార సేకరణ ద్వారా.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొలిక్కి వస్తున్నట్లు సమాచారం. 2018 ముందస్తు ఎన్నికలప్పుడు ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్‌… ఇప్పుడూ అదే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.

టికెట్ల కోసం భారీ పోటీ
రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌లో టికెట్ల కోసం తీవ్రమైన పోటీ ఉంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలతో పాటు అనేక మంది నేతలు టికెట్‌లను ఆశిస్తున్నారు. నియోజకవర్గాల్లో పోటాపోటీ కార్యక్రమాలు చేస్తూ అధిష్ఠానం దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు కొన్ని నెలల ముందే అభ్యర్థులను ప్రకటించడమే మంచిదని గులాబీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థిపై అసంతృప్తి, అసమ్మతి కనిపిస్తే సరిదిద్దుకోవడానికి, నచ్చచెప్పడానికి తగిన సమయం ఉంటుందని ఆలోచన. అసంతృప్తులు, అసమ్మతులకు భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయని నచ్చచెప్పాలని.. ఒకవేళ వినకపోతే వదులుకోవాలనే కఠినమైన ఆలోచనతో పార్టీ నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

ఆషాడం ముగిశాక తొలి జాబితాను ప్రకటించేందుకు సిద్ధమైన కేసీఆర్‌ ముందే అభ్యర్థులను ప్రకటిస్తే ఓటర్లను కనీసం మూడు, నాలుగు సార్లు వ్యక్తిగతంగా కలిసేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అభ్యర్థుల ప్రకటనపై ఆలస్యం చేస్తే నేతల మధ్య పోటీ పెరిగి పరిస్థితులు తారుమారయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నట్టు సమాచారం. టికెట్‌ కోసం అధిష్ఠానంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నాలు పెరిగే అవకాశం కూడా ఉంటుందని భావిస్తుంన్నారు. అందుకే వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఆషాడం ముగిసిన తర్వాత తొలి జాబితా ప్రకటించాలని కేసీఆర్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement