Tuesday, November 26, 2024

Exclusive Story – చేసింది ఎక్కువ … చెప్పుకునేది త‌క్కువ

పదేళ్లలో అద్భుత ప్రగతి… ఎన్నో పథకాలు దేశానికే రోల్‌ వెూడల్‌
ప్రచారం చేసుకోని అభ్యర్థులు
ఓటర్ల నుంచి భిన్న స్పందనలు
సంక్షేమాభివద్ధిని వివరించాలి
రచ్చబండ భేటీలు జరపాలి
ఓటర్లను ఆకట్టుకోవాలి
నిర్లక్ష్యం చేస్తే పెనుప్రమాదమే!
రాజకీయ నిపుణుల విశ్లేషణలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కారు ఫుల్‌ కండిషన్‌లో ఉంది. హైవేలన్నీ క్లియర్‌గానే ఉన్నాయి. గ్రామీణ రోడ్లే అక్కడక్కడ గుంతలు పడ్డాయి. ఇప్పుడు చిన్న స్పీడ్‌ బ్రేకర్లుగా అనిపిస్తున్నా… పోను పోను మరింత పెద్ద గుంతలుగా మారి రహదారి ఛిద్రమయ్యే పరిస్థితి పొంచి ఉంది. భారాస అధినేత కేసీఆర్‌ చెప్పిన విధంగానే అందరికంటే ముందే అభ్యర్థులను ప్రక టించారు. ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభిం చేశారు. ఎంతో కోలాహలంగా, ఉత్సాహంగా, హ్యాట్రిక్‌ కొట్టడానికి శ్రేణులు రణోత్సాహంతో కదులుతున్నా యి. ఇక్కడి వరకూ బాగానే ఉంది. కాని, గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. అధికార భారాస వాస్తవానికి చెప్పింది… చెప్పనది కూడా చేసి గత పదేళ్లలో అన్నివర్గాల ప్రజల నుంచి నీరాజనాలు అందుకుంది. కానీ ప్రస్తుత ఎన్నికల్లో అభ్యర్థులు… సీఎం కేసీఆర్‌ చేసిన పనులన్నీ విడమ రిచి జనాలకు చెప్పలేకపోతున్నారనేది వాస్తవం. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్ల కాలంలో అమలు చేసిన, చేస్తున్న అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించి ఒక్కో పథకం గురించి, జరిగిన మేళ్ల గురించి వివరించి చెప్పలేకపోవడం అభ్యర్థులకు ఒకింత ఇబ్బందికరం గా మారింది. దీంతోనే ఓటర్ల నుంచి ఆశించిన సాను కూల స్పందన రావడం లేదని రాజకీయ నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.

పట్టణ, నగర ప్రాంతాల్లో భారాస ప్రచారం నిరాఘాటంగా సాగుతోంది. ఓటర్ల స్పందన సానుకూలంగానే కనిపిస్తోంది. పదేళ్లుగా రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల్లో కారు యథేచ్ఛగా దూసుకు పోయింది. ఎటువంటి అవరోధాలు ఎదురుకాలేదు. గ్రామీణ ప్రజానీకం ఎంతో ఆదరించింది కూడా. సర్పంచ్‌ నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ, అసెంబ్లిd, పార్ల మెంటు వరకూ ఏ ఎన్నికలైనా కారెక్కి మరీ జేజేలు పలికారు. కాని… తాజా ఎన్నికల్లో ప్రజానీకం నుంచి అభ్యర్థులకు వింత పరిస్థితి ఎదురవుతోంది. గత పదేళ్లుగా చాలాసార్లు కారుకు ఓటేశాం కదా… అని దీర్ఘాలు తీస్తున్నారు! అభ్యర్థుల కళ్లలోకి చూడకుండా ఎటో చూస్తూ సమాధానమిస్తున్నారు. కొందరైతే వాళ్లు ఒక్క ఛాన్సంటున్నారని గునుస్తున్నారు! దీంతో అభ్యర్థుల్లో టెన్షన్‌ మొదలైంది. అదికాదన్నా… అంటూ ఏమి చెప్పబోతున్నా… అలాగే వేస్తాం… చేస్తాం అంటూ వ్యక్తిగతంగా కలిసిన ఓటర్లు చెబుతున్న సమాధానాలతో ఏం చేయాలో అర్థంకాని స్థితిలోకి అభ్యర్థులు జారిపోతున్నారు.

ఇది ఏదో ఒక నియోజకవర్గంలో ఎక్కడో ఒక్క గ్రామంలో జరిగిన సంఘటన కాదు… దాదాపు ప్రతి రూరల్‌ నియోజకవర్గంలోనూ కనిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం వెతికితే… కాంగ్రెస్‌ ఒక్క ఛాన్స్‌ అంటూ ప్రాధేయపడడం… ఆరు గ్యారంటీలు జనంలోకి బాగా చొచ్చుకుపోవడంగా అర్థం చేసుకోవచ్చు. అయితే, అభ్యర్థులు, ప్రచారంలో ఉన్న కార్యకర్తలు కూడా గులాబీ బాస్‌ చేసిన, చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమ కార్యక్రమాలను సరిగ్గా వివరించకపోవడంగా కనిపిస్తోంది. అంతేకాకుండా, మితిమీరిన విశ్వాసంతో కూడా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది.

వాస్తవానికి ఇప్పుడు ఊళ్లన్నీ ఎప్పుడో గుర్తుపట్టలేనివిధంగా మారిపోయాయి! పట్టణ, నగరాలతో ధీటుగా గ్రామాలకు మౌలిక సౌకర్యాలు ఏర్పడ్డాయి. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథల నుంచి నర్సరీలు, వైకుంఠధామాల వరకూ వచ్చాయి. పంచాయతీలకు భవనాల నుంచి ఓవర్‌హెడ్‌ ట్యాంకుల వరకూ నిర్మించారు. చక్కని పార్కులు, పాఠశాలల భవనాలు ఏర్పాటయ్యాయి. ఏపీలో వాలంటీర్లు అధికార పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. చేసిన పనులన్నీ ఇంటింటికీ తిరిగి వివరించి చెబుతున్నారు. ఎక్కడ సమస్యలు ఉన్నా తక్షణం స్పందించి చక్కని పరిష్కారానికి దారి చూపిస్తున్నారు. అయితే, తెలంగాణలో కింది స్థాయి నేతలు, కార్యకర్తలు ప్రతి ఊరు, కుటుంబం విషయంలో ఈవిధమైన శ్రద్ధ తీసుకుని తగిన చర్యలు తీసుకోవడంలో వెనుకబడి ఉన్నారనే చెప్పుకోవాల్సి ఉంటుంది.

- Advertisement -

ప్రతి ఊళ్లోను ప్రతి సమావేశంలోనూ భారాస ఇప్పటివరకూ అందించిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను చక్కగా వివరించి, తెలియజేసింది తక్కువే! ఎంతసేపూ తమపై నేతల మెప్పుకోసం ఆర్భాటం చేయడమే కాని, క్షేత్రస్థాయిలో ఓటరును ఆకట్టుకునే విధంగా కేసీఆర్‌ ఏం చేసిందీ, చేస్తోందీ వివరించిన వైనాలు వేళ్లమీద లెక్కించుకోవచ్చు! ఇప్పటికైనా అభ్యర్థులు, శ్రేణులు గ్రామీణ స్థాయిలో రచ్చబండ కార్యక్రమాలను చేపట్టి సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను చక్కగా వివరిస్తే కచ్చితంగా మళ్లిd గ్రామీణ రోడ్లపై కారు రివ్వున దూసుకుపోవడం ఖాయం!

Advertisement

తాజా వార్తలు

Advertisement