రూ. 5 కోట్లతో అభివృద్ధికి ప్రణాళికలు
మంత్రి శ్రీధర్ బాబు చొరవతో కదలిక
ప్రకృతి అందాల నిలయం
రాముడు నడయాడిన నేల
శిల్ప కళలకు పెట్టింది పేరు
ఏటేటా పెరుగుతున్న పర్యాటకులు
రామగిరి, డిసెంబర్ 11 (ఆంధ్రప్రభ): పెద్దపల్లి జిల్లా ప్రజల కల సాకారం కానుంది. జిల్లాలోని ప్రకృతి రమణీయమైన అందాలతో కనువిందు చేస్తున్న రామగిరి ఖిల్లా ఇక పర్యాటక కేంద్రంగా మారనుంది. ప్రజా ప్రభుత్వంలో రామగిరి ఖిల్లాను పర్యాటక కేంద్రంగా మార్చేందుకు అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చొరవతో ఇటీవలే రామగిరి ఖిల్లా అభివృద్ధి కోసం రూ. 5కోట్లను కేటాయించారు. మంత్రి శ్రీధర్ బాబు కృషితో రామగిరి ఖిల్లాను పర్యాటక కేంద్రంగా మార్చేం దుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ప్రకృతి అందాల నిలయం .. చరిత్రకు సాక్ష్యం..
ఆహ్లాదాన్ని పంచే ప్రకృతి రమణీయ అందాలను ఆస్వాదించేందుకు ప్రకృతి ప్రేమికులు ఖిలాను సందర్శించేందుకు వస్తుంటారు. రామగిరి దుర్గంపై కాకతీయుల కాలంలో అపురూపమైన శిల్పకళలు, కట్టడాలు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. సీతా సమేతుడైన శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు, ఆంజనేయుడితోపాటు వనవాస సమయంలో రామగిరి దుర్గంపై విడిడి చేసినట్లుగా స్థానికులు కథలుగా చెప్పుకుంటారు. దీంతో పర్యాటక కేంద్రంగానే కాకుండా ఆధ్యాత్మిక కేంద్రంగానూ రామగిరి ఖిల్లా ప్రసిద్ధి చెందింది. 200 రకాలకు పైగా వన మూలికలు లభించే ఖిల్లా ఆయుర్వేద వైద్యానికి మూల కేంద్రంగా ఉంటుందని చరిత్ర చెబుతుంది. రామగిరి చరిత్రను వెలుగులోకి తెచ్చేందుకు రచయితలు వ్యయ ప్రయాసలకోర్చి పుస్తక రూపంలో ప్రచురించారు. కాల్వశ్రీరాంపూర్ మండలం మంగపేటకు చెందిన ఎరబాటి బాబురావు, కమాన్‌పూర్ మండలానికి చెందిన మాధవరావు, బలరాం దాసులు, రామగిరి మహత్యం పేరుతో గ్రంథాన్ని రాశారు. అంతకుముందే చరిత్రను వెలికి తీసిన ఘనత బాలప్రసాద్‌కు దక్కుతుంది. రామగిరి మండలంలోని రత్నాపూర్, బేగంపేట పరిధిలోని ఖిల్లా విశేషాలు ఇలా ఉన్నాయి..
చారిత్రక ఆనవాళ్ల ఖిల్లా..
క్రీ.శ 1వ శతాబ్ధంలో రామగిరి కోటను నిర్మించారు. ఈ ప్రాంతాన్ని గౌతమిపుత్ర శాతకర్ణి పులోమావి పాలించినట్లు పెద్దబొంకూర్, గుంజపడుగు తవ్వకాల్లో బయటపడిన ఆధారాలు తెలుపుతున్నాయి. చంద్రగుప్తుడు, బిందుసారుడు, అశోకుడు దుర్గాన్ని అభివృద్ధి చేశారని చరిత్ర చెబుతుంది. క్రీ. శ 1158లో చాణక్య గుండ రాజును ఓడించి కాకతీయులు రామగిరి దుర్గాన్ని స్వాధీనం చేసుకున్నారు. రామగిరి ఖిల్లాను ప్రతాపరుద్రుడు 1195 వరకు పాలించినట్లు, ఓరుగల్లు మంత్రకూటముల శాసనాలు తెలియజేస్తున్నాయి. 1442లో బహనీ సుల్తాన్‌లు ఆక్రమించుకోగా, వారి నుంచి రెడ్డి రాజులు స్వాధీనం చేసుకుంటున్నట్లు ఆధారాలున్నాయి. 1595లో మొగలాయిలు, 1606లో గోల్కొండ నవాబులు, తర్వాత మహ్మదీయులు నిజాం కాలం వరకు పాలించారు. కోటకు ఇరువైపులా 9 ఫిరంగులు, 40 తోపులుండగా కాలక్రమేణా కేవలం ఒక్క ఫిరంగి మాత్రమే ఉంది.
రాముడు నడయాడిన నేల..
పౌరాణికంగా కూడా రామగిరి ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. శ్రీరామచంద్రుడు వనవాసం సమయంలో ఖిలాపైకి కాలినడకన చేరుకొని తపస్సుగావించి శివలింగాన్ని ప్రతిష్టించినట్లు పురాణాలు చెబుతున్నాయి. సీత సమేత రాముడు, హనుమాన్ విగ్రహం, నంది, శ్రీరాముడి విగ్రహం వద్ద వెయ్యి మంది తలదాచుకునేలా విశాల ప్రదేశం ఉంది. రాజుల పాలనలో రామగిరి ఖిల్లా పరిసర ప్రాంతానికి రామగిరి పట్టణం అనే పేరు వచ్చిందని, చుట్టు పక్కల గ్రామాలు వాడలుగా ఉండి ఆస్థానంలో సంగీత నృత్య కళాకారులు ఉండే ప్రాంతాన్ని భోగం వాడ అనేవారని, కాలక్రమేణా బోగంపేటగా మారింది. కాకతీయుల కాలంలో నిర్మించిన కోట శిల్పకళా సంపదతో శోభిల్లుతుంది. శిల్ప సాంస్కృతిక సంపదకు తార్కాణంగా నిలుస్తూ నిర్మించిన రాతి కట్టడాలు ఇప్పటికి నైపుణ్యాన్ని చాటుతాయి. రాతిపై చెక్కిన సుందర దృశ్యాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి.
చూడాల్సిన ప్రదేశాలు..
రామగిరి దుర్గంలో అంతర్భాగంలో సాలుకోట, సింహాల కోట, జంగేకోట, ప్రతాపరుద్ర కోట, అశ్వశాలకోట, కొలువుశాల, మొఘల్‌శాల, చరసాల, గజశాల, భజనశాల, సభాస్థలివంటి వాటితోపాటు సీతమ్మ బావి, పసరు బావి, సీతమ్మకొలను, రహస్య మార్గాలు, సొరంగాలు, ఫిరంగులు తదితర ప్రదేశాలు పర్యాటకులను ఆకట్టుకునేలా ఉంటాయి. వనవాస సమయంలో శ్రీరాముడు రామగిరిపై కొద్దిరోజులు కుటీరం ఏర్పరుచుకొని సీతాదేవి, లక్ష్మణలతో ఉన్నారని చరిత్ర చెబుతుంది. ఖిల్లా సీతారామ లక్ష్మణులు సంచరించినట్లు చెబుతున్న ఆనవాళ్లు ఇప్పటికి చెక్కు చెదరకుండా పర్యాటకులకు దర్శనమిస్తున్నాయి. ఖిల్లాపై గల బండరాతిపై శ్రీరాముని పాదాలు సీతాదేవి స్నానమాచరించిన కొలనుతోపాటు శ్రీరాముడుతో సంచరించిన ఆంజనేయస్వామి విగ్రహం కూడా నెలకొల్పబడి ఉంది.
శ్రావణం వస్తే.. పర్యాటకుల సందడే..
వర్షాకాలంలో పచ్చదనం పరుచుకోవడంతో ప్రతి ఏటా శ్రావణమాసంలో రామగిరి ఖిల్లాపై పర్యాటకుల సందడి నెలకొంటుంది. రామగిరి దుర్గంపై ప్రకృతి అందచందాలను తిలకిస్తూ పర్యాటకులు మైమరచిపోతారు. ఆయుర్వేద వైద్యులు ఖిల్లాపై విలువైన వన మూలికలు సేకరిస్తారు. గత చరిత్ర వైభవానికి సజీవ సాక్ష్యమైన రామగిరి ఖిల్లా గతంలో పాలకులు మారినా నిర్లక్ష్యం నీడన ఉండిపోయింది. ప్రభుత్వాలు, పురావస్తు శాఖ నిర్లక్ష్యం మూలంగా ఆనవాళ్లను కోల్పోయే ప్రమాదంలో పడింది.
రామగిరి ఖిల్లాపై ప్రత్యేక దృష్టి..
ప్రాచీన సంస్కృతికి, కళా వైభవానికి అద్దం పట్టిన ఇక్కడి కట్టడాలు కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉండడంతో ప్రజా ప్రభుత్వం రామగిరి ఖిల్లాపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నో ఏళ్లుగా రామగిరి ఖిల్లా అభివృద్ధితోపాటు పర్యాటక కేంద్రంగా మార్చాలన్న డిమాండ్ పర్యాటకులతోపాటు పరిసర గ్రామాల ప్రజల నుంచి వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత రామగిరి ఖిల్లా అభివృద్ధి దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవ తీసుకొని ఖిల్లాను పర్యాటక కేంద్రంగా మార్చే దిశగా రూ. 5కోట్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇకనైనా రామగిరి ఖిల్లాను పర్యాటక కేంద్రంగా మార్చితే పర్యాటకులకు ఆహ్లాదం పంచడంతోపాటు చారిత్రతాత్మక ఆనవాళ్లను కోల్పోకుండా భవిష్యతుత్త తరాలకు అందించిన వారవుతారని ప్రకృతి ప్రేమికులు పేర్కొంటున్నారు.
పర్యాటక కేంద్రంగా మారుస్తాం..
- దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
పెద్దపల్లి జిల్లాకే తలమానికంగా ఉన్న ప్రాచీన కట్టడాలతో చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచిన రామగిరి ఖిల్లాను పర్యాటక కేంద్రంగా మార్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం. భవిష్యత్తు తరాలకు రామగిరి ఖిల్లా విశిష్టతను తెలియజేసేలా అభివృద్ధి చేస్తాం. పర్యాటకులు ఖిల్లాను సందర్శించేందుకు సౌకర్యాలు కల్పిస్తాం. ఇప్పటికే రామగిరి ఖిల్లా అభివృద్ధి కోసం రూ. 5కోట్లను కేటాయించాం. దశల వారీగా రామగిరి ఖిల్లాను పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. చారిత్రాక ఆనవాళ్లను కాపాడుకునే బాధ్యత తమపై ఉంది.