నదీ తీర ప్రాంతాల్లో విస్తృత సర్వే
హిమాయత్‌నగర్ తహసీల్ధార్ ఆధ్వర్యంలో కొలతలు
ఆక్రమణలు కూల్చివేసే ప్రాంతాలకు మార్కింగ్
భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు
తెల్లవారుజాము నుంచే చర్యలు
రంగంలోకి దిగిన 16 బృందాలు
బాధితులకు పునరావాసం కల్పిస్తామన్న సీఎం రేవంత్
ఆంధ్రప్రభ, న్యూస్ నెట్ వర్క్: మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఆపరేషన్ మూసీ చేపట్టింది. నదీ తీరా ప్రాంతాల్లో అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. హిమాయత్‌నగర్ తహశీల్దార్ సంధ్యారాణి ఆధ్వర్యంలో సిబ్బంది కొలతలు వేస్తున్నారు. కూల్చివేసే ప్రాంతాలకు మార్కింగ్ ఇస్తున్నారు. దీంతో ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. మూసీ నదీ తర ప్రాంతాల్లో అలజడి ప్రారంభమైంది.
తెల్లవారు జాము నుంచే…
మూసీనది పరివాహక ప్రాంతాల్లో గురువారం తెల్లవారు జాము నుంచి అధికారులు సర్వే ప్రారంభించారు. గోల్కొండ మండల పరిధిలోని ఇబ్రహీంబాగ్, ఆశ్రమ్‌నగర్‌లో కొలతలు తీసుకున్నారు. అలాగే పాతబస్తీలోని ఛాదర్‌ఘాట్, మూసానగర్, శంకర్‌నగర్‌లో సర్వే నిర్వహించారు. కూల్చబోయే నిర్మాణాలపై మార్క్ చేస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో 55 కిమీ పరిధిలో మొత్తం 12 వేల ఆక్రమణలను ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
16 బృందాలతో సర్వే…
మూసీ నది పరివాహక ప్రాంతంలో పోలీసుల బందోబస్తు మధ్య అధికారుల సర్వే కొనసాగుతోంది. 16 బృందాలు సర్వే నిర్వహిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 4 బృందాలు, మేడ్చల్ మల్కాజిగిరిలో 5 బృందాల సభ్యులు సర్వే చేస్తున్నారు. నదీ గర్భంలో నివాసముంటున్న వారి నిర్మాణాల వివరాలను రెవెన్యూ అధికారులు ఆరా తీస్తున్నారు. మూసీ నదిలో బఫర్‌జోన్‌లో నిర్మాణాలను గుర్తించనున్నారు. హిమాయత్‌నగర్ తహసీల్దార్ సంధ్యారాణి ఆధ్వర్యంలో మూసీ నదీ తీరా ప్రాంతాలైన చాదర్‌ఘాట్, మూసానగర్, శంకర్‌నగర్ లో కొలతలు వేస్తున్నారు. గోల్కొండ పరిధిలోని ఇబ్రహీం బాగ్ ప్రాంతంలోనూ సర్వే చేశారు. లంగర్‌హౌస్ డిఫెన్స్ కాలనీలో అధికారులు సర్వే చేయనున్నారు. అయితే పలు ప్రాంతాల్లో సర్వేకు వచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకుంటున్నారు.
పునరావాసం కల్పిస్తాం…
మూసీ పరివాహక ప్రాంతం నిర్వాసితులను పునరావాసం కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం ఇటీవల అధికారులతో కలిసి పలు చోట్ల పర్యటించి కొన్ని కుటుంబాలతో మాట్లాడారు. నిర్వాసితులకు అన్యాయం జరగకుండా తగిన పునరావాసం, నష్టపరిహారం, డబుల్ బెడ్ ఇండ్ల కేటాయింపు తదితరాలపై కలెక్టర్ల సమక్షంలోనే ప్రతీ కుటుంబానికి వివరాలను అందించేలా షెడ్యూలు రూపొందించినట్లు తెలిసింది.