Monday, September 16, 2024

Exclusive – ప్ర‌కృతి మాత‌కు ప్రాణ‌గండం – బలిపీఠంపై స‌హ‌జ సంప‌ద‌

క‌బ‌లించ‌నున్న ఫార్మాహబ్ రక్కసి

మంజీరా ఇక కాలకూటం కానుందా

పొలాలకు.. పశువులకు నీటి క‌ష్టాలు త‌ప్ప‌వా

వాగులు వంకలు నాశనం అవ్వాల్సిందేనా

- Advertisement -

300 జాతుల పక్షిరాజుల గెంటివేత తగదు

500 మొసళ్లు అంత‌రించే ప్ర‌మాద‌మూ ఉంది

సర్కారు ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న జ‌నం

ఆ ప్రాంతంలో వ‌ద్దంటున్న ప‌ర్య‌వర‌ణవేత్త‌లు

సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణ‌యంపైనే మంజీరా భ‌విష్య‌త్తు

.ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, సెంట్ర‌ల్ డెస్క్‌:సహజ వనరుల పరిరక్షణే ధ్యేయంగా.. ఎక్కడ తగ్గేది లే.. ఎవ్వరి మాట వినేది లే.. అంటున్న సీఎం రేవంత్ రెడ్డికి ఓ పెను సవాల్ ఎదురవుతోంది. రాష్ట్ర‌ అభివృద్ధి.. సంక్షేమం కోసం సంపద సృష్టించాల్సిందే.. ఇందుకు పారిశ్రామీకరణ అనివార్యం. అందుకు పరిశ్రమల పెట్టుబడిని ఆహ్వానించాల్సిందే. కానీ, ఇక్కడే ఓ తిరకాసు ఉంది.

సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండలంలో ఫార్మా హబ్‌ ఏర్పాటుకు ప్రభుత్వం తప్పుడు స్థలాన్ని ఎంచుకుందని విమర్శలున్నాయి. ఔషధ కంపెనీలు పనిచేయడం ప్రారంభించగానే ఫార్మా కంపెనీలు విడుదల చేసే వ్యర్థాలు నేరుగా మంజీరా న‌దిలో క‌లిసే ప్ర‌మాదం ఉంది.. దీంతో తాగునీరు అందించే మంజీరా న‌ది కాస్తా.. కాలకూటంగా మారిపోతోందని, ఎంచుకున్న ఈ భూమి పర్యావరణ విపత్తుకు దారితీస్తుంద‌నే ఆందోళనలు మొద‌ల‌య్యాయి.

ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యపై సామాన్య జనం, పర్యావరణవేత్త‌ల నుంచి తీవ్ర వ్యతిరేకత క‌నిపిస్తోంది.

.

అసలేం జరిగిందంటే.. సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండలం డప్పూరు, వడ్డి, మల్గి గ్రామాల్లో దాదాపు 2,003 ఎకరాల భూమిని ఫార్మా హబ్‌ కోసం సేకరించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ గ్రామాల మీదుగా న్యాల్‌కల్ వాగు, చాకిరి వాగు, కోట వాగు.. వంకలు పొంగి మంజీరా నదిలో కలుస్తున్నాయన్న వాస్తవాన్ని ప్రభుత్వం గుర్తించలేదు. చెనెగపల్లి ప్రాజెక్టు ఎగువన ఈ మూడు వాగులు కలుస్తాయి. హుమ్నాపూర్, మరియంపూర్, చాల్కి గ్రామాల మీదుగా పెద్దవాగు ప్రవహించిన తర్వాత.. మంజీరలో కలుస్తుంది. మంజీరా నదికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ప్రతిపాదిత ఫార్మా హబ్ ఉంది.

హైద‌రాబాద్ జ‌నాల‌కు తాగు నీటికి క‌ష్టాలు త‌ప్ప‌వా.

.హైదరాబాద్ మహా నగరం, సంగారెడ్డి జిల్లాల తాగునీటి అవసరాలకు ఏకైక మంచినీటి వనరు.. మంజీరా నది మాత్ర‌మే. వేసవి ఎద్దడిలో నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజీ సమయంలోనూ.. రోజుకు 270 ఎంజీడీల నీటి కొరతను మంజీరా నది మాత్రమే తీర్చింది. ఇక.. సంగారెడ్డి ప్రజలకు మంజీరా నది తాగునీటిని ప్రసాదించే జీవనది. అంతే కాదు.. వన్యప్రాణులకు ఈ ప్రాంతం ఒక అభయారణ్యం. మంజీరా ప్రాంతంలో 117 జాతీయ, అంతర్జాతీయ వలస పక్షులున్నాయి. వాటి విడిదికి ఈ ప్రాంతం ఆలవాలం. 300కు పైగా పక్షి జాతులు ఇక్కడ కిలకిలరావం చేస్తాయి. అందిన ఆహారంతో క్షుద్బాధను తీర్చుకుంటాయి.

అంతే కాకుండా.. 500కు పైగా మగ్గర్ మొసళ్లకు ఇది రక్షణ నిలయం. ఇక.. ఫార్మా కంపెనీల చెలగాటంతో ఈ గ్రామాల్లోని వాగుల వెంబడి డప్పూరు చెరువు, ఇతర చెరువులు కూడా కలుషితం అయ్యే ప్ర‌మాదం ఉంది. ఈ భూమిని ఫార్మా కంపెనీలు స్వాధీనం చేసుకుంటే.. మేకలు, గొర్రెలను మేపుకుని జీవించే సశువుల కాపరులు కూడా త‌మ‌ జీవనాధారాన్ని కోల్పోతారు.అందుకే వ్య‌తిరేకిస్తున్న స్థానికులు..

న్యాల్‌కల్‌ మండలంలో ఫార్మా హబ్ ఏర్పాటు చేయాల‌న్న‌ ప్రభుత్వ నిర్ణయాన్ని స్థానికులు, రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

వ్యవసాయమే వారికి జీవనోపాధి. దీనికి ఏకైక ఆధారం భూమి. ఈ పుడమితల్లిని వదులుకోవటానికి రైతులు సిద్ధంగా లేరు. ఈ సందర్భంగా డప్పుర్‌కు చెందిన బేగరి విట్టల్ అనే రైతు మాట్లాడుతూ.. తమ భూముల్లో పంటలు పండించడం తప్ప.. మరో మార్గం తమకు తెలీదని, తమ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ సేకరించేందుకు మా ఊరు రైతులు అనుమతించరని అన్నారు. ఫార్మా కంపెనీలు తమ జీవితాలను నాశనం చేస్తాయని, ప్రతిపాదిత ప్రాజెక్టును తమ గ్రామం నుంచి మార్చాలని మహిళా రైతు సత్యమ్మ ప్రభుత్వాన్ని వేడుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement