Sunday, November 17, 2024

Exclusive – బ‌స్తీవాసుల‌ను ముంచెత్తుతున్న మురుగు నీరు …. ముందుందీ వర్షాకాలం

బ‌స్తీవాసుల‌ను భయపెడుతున్న నాలాలు
రోడ్ల‌పై పారుతున్న వేస్ట్ వాట‌ర్‌
సెంటీమీట‌ర్ వాన‌కే రోడ్ల‌న్నీ జ‌ల‌మ‌యం
హైద‌రాబాద్ వాసుల‌కు త‌ప్ప‌ని ఆందోళ‌న‌
ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకోని జీహెచ్ఎంసీ అధికారులు
షేక్‌పేట నాలా ప్ర‌వాహం తీరుపై స్పెష‌ల్ ఫోక‌స్‌

హైదరాబాద్ సిటీలో చిన్న‌పాటి వర్షం పడితే చాలు.. రోడ్ల‌న్నీ చెరువుల‌ను త‌ల‌పిస్తుంటాయి. దీనికితోడు నాలాల నీరంతా రోడ్ల‌పైకి వ‌చ్చి మురుగునీరు కంపుకొడుతుంది. ఇక‌.. ఆ పూట జన జీవనం అస్తవ్యస్తంగా మారుతుంది. రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు నిలిచిపోతాయి. ఇందుకు కారణం వరద ప్రవహించే నాలాలు, ఇతర మార్గాలు మూసుకుపోవడమే. నిర్లక్ష్య ధోరణితో కొందరు నాలాల్లో వేసే చెత్తా చెదారం వరదకు కొట్టుకురావడం ఈ సమస్యకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు. అయితే.. నాలాల్లో చెత్తా చెదారం, పూడిక తీయాల్సిన బల్దియా యంత్రాంగం మొక్కబడిగా ఆ ప‌నులు వ్యవహరిస్తోందనే విమర్శలున్నాయి. అంతేకాకుండా వ్యర్థాలు, మురుగు నీటితో స్థానికులు అనారోగ్యం బారినపడుతున్నారు. పూడికతీతకు వెచ్చిస్తున్న కోట్లాది రూపాయ‌ల‌ నిధులు మురుగు పాలవుతున్నాయి. దీనికి షేక్​పేట బుల్కాపూర్ నాలా ప‌రిస్థితి ఓ ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవ‌చ్చు.

- Advertisement -

నాలాల పూడికతీతలో నిర్లక్ష్యం వద్దు
వర్షాలు రాకముందే కోర్ ఏరియాలను గుర్తించి పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించాలి. సీఎం రేవంత్ రెడ్డి జీహెచ్​ఎంసీ అధికారులను ఆదేశిస్తూ చెప్పిన మాటలివి. క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా నాలాల‌ పరిస్థితి ఉంది. నాలాల తీరు ఎంత భయంకరంగా ఉందో ఇక్క‌డ ఉన్న ఫొటోల ద్వారా తెలుసుకోవ‌చ్చు. టన్నుల కొద్దీ పేరుకుపోయిన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలతో కిలోమీటర్ల మేర స్తంభించిన మురుగు.. చుట్టుపక్కల భరించలేని దుర్వాసన క‌లిగిస్తోంది. చూడటానికి భయంకరంగా ఉన్న ఈ ప్రాంతం హైదరాబాద్‌లోని షేక్‌పేట్‌ నాలా అంటే న‌మ్మ‌కం క‌ల‌గ‌కపోవ‌చ్చు. కానీ, ఇది నిజం..

10 కిలోమీట‌ర్ల మేర‌.. దుర్గంధ‌మే..

షేక్‌పేట్‌ నుంచి వ‌ర‌ద నీరు ఫిల్మ్ నగర్ కొత్త చెరువు, మాసబ్‌ట్యాంకు మీదుగా హుస్సేన్‌సాగర్‌లో కలుస్తుంది. 10 కిలోమీటర్ల మేర ప్రవహించే ఈ నాలా నిర్వహణ లేక ఏళ్ల తరబడి స్థానికులు అవస్థలు పడుతున్నారు. సంవత్సరాల నుంచి దీని చుట్టపక్కల నివసిస్తున్న వారి బాధలు వర్ణణాతీతంగా మారాయి. చిన్నపాటి వర్షానికే నాలాలో ఎక్కడికక్కడే వరద నిలిచిపోయి చుట్టుపక్కల ప్రాంతాలను ముంచెత్తుతోంది. ఫిల్మ్‌నగర్, మహాత్మాగాంధీ నగర్ మీదుగా వెళ్లే ఈ నాలా వల్ల స్థానికులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ఎగువ నుంచి వరదతో పాటు చెత్తా చెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు భారీగా కొట్టుకొచ్చాయి. సుమారు 10 కిలోమీటర్ల మేర నాలా పరివాహక ప్రాంతాన్ని పరిశీలించగా.. ఆయా ప్రాంతాల్లో నివాసం ఉండే వారి దయనీయ పరిస్థితి క‌నిపించింది.

భ‌రించ‌లేని దుర్వాస‌న‌..

మహాత్మాగాంధీ నగర్ నుంచి కిందకు వెళ్లే కొద్దీ నాలా పొడవునా ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయాయి. వంతెనల పక్కన గుట్టలు గుట్టలుగా చెత్త పేరుకుపోయింది. నాలాలో పెరిగిపోయిన పిచ్చి మొక్కలు, దానికి తోడు స్థానికులు చెత్తా చెదారం వేయడం వల్ల నీరు ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. మురుగు నీరు నివాసాల ముందే నిల్వ ఉండటం వల్ల భరించలేని దుర్వాసనతోనే సావాసం చేస్తున్నామని బస్తీవాసులు వాపోతున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

ప‌ట్టించుకోని బల్దియా..
నాలా పరివాహకం వెంట ఇరుకైన ప్రదేశంలో జీవిస్తున్న బస్తీ వాసులు రాకపోకలు సాగించేందుకు ఇనుప వంతెన ఏర్పాటు చేసుకున్నారు. అది పూర్తిగా దెబ్బతిని ప్రమాదకరంగా మారింది. ఇటీవల వరద తాకిడికి ఆ వంతెనపై నడుస్తున్న ఇద్దరు నాలాలో పడిపోయారని స్థానికులు తెలిపారు. నాలా గోడలు సైతం అక్కడక్కడ దెబ్బతిని మురుగునీరు బయటికి ప్రవహిస్తోంది. వానాకాలం ముందే నాలాలో పూడికతీత పూర్తి చేయాల్సి ఉన్నా.. ఆ దాఖలాలు కనిపించడం లేదు. ఈసారి వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలను బల్దియా కూడా ప‌ట్టించుకోవ‌డం లేదనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

చెత్త తొల‌గింపు సాహ‌స‌మే..
కాగా, నాలాను మీడియా టీమ్‌ పరిశీలిస్తున్న విషయం తెలుకున్న జీహెచ్​ఎంసీ సిబ్బంది, హుటాహుటిన అక్కడికి చేరుకుని వ్యర్థాలను తొలగించే ప్రయత్నం చేశారు. టన్నుల కొద్దీ పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించేందుకు ఇద్దరిని నియమించారు. అయితే.. అది కూడా నామమాత్రంగా కొంత తీసి ఒడ్డున పడేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నాలాల్లో పూడిక, వ్యర్థాల తొలగింపు కాంట్రాక్ట‌ర్ల‌కు సవాల్‌గా మారింది. బురద పేరుకుపోయి ఉండటం, వ్యర్థాల్లో గృహోపకరణాలు సహా రకరకాల వస్తువులు ఎక్కువగా ఉండటం, తీవ్ర దుర్గంధం వల్ల తీయడానికి కూలీలు సాహసం చేయడం లేద‌ని తెలుస్తోంది. ఇక‌.. జేసీబీల సహాయంతో తీద్దామంటే ఇరుకైన సందుల్లో వాహనాలు వెళ్లే మార్గం లేదని కాంట్రాక్ట‌ర్లు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement