ప్రాజెక్టు కెపాసిటీ 18.3 అడుగులు
ప్రస్తుత నీటి మట్టం 5.5 అడుగులు
సాగు పనులకు అందని నీరు
ఆయకట్టుదారుల్లో ఆందోళన
మత్స్య సంపదపైనా తీవ్ర ప్రభావం
వైరా , ప్రభ న్యూస్ : జలకళతో నిత్యం కళకళలాడే వైరా రిజర్వాయర్ నీరు లేక వెలవెలబోయింది. ఒక వైపు సాగర్ నీరు రాకపోవడంతో, మరోవైపు వర్షాలు లేకపోవడంతో రిజర్వాయర్‌లో నీటి మట్టం పూర్తిగా పడిపోయింది. జలాశయంలో నీటి సామర్థ్యం 18.3 అడుగులు, ప్రస్తుతం 5.5 అడుగులు నీటి మట్టం ఉంది. వైరా రిజర్వాయర్ లోతట్టు విస్తీర్ణం నాలుగు వేల తొమ్మిది వందల ఎకరాలు విస్తీర్ణం కలిగి ఉంది. 1930లో నైజాం నవాబు రాజు నీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వైరా రిజర్వాయర్‌ను నిర్మించారు. ఈ ప్రాజెక్టు ఆధారంగా 14 వేల మంది ఆయకట్టుదారులు సాగు చేస్తున్నారు. ఎక్కువగా వరి సాగు చేసే రైతులు ఎక్కువగా ఉన్నారు. ఈ ప్రాజెక్టు పై ఆయకట్టుదారులతోపాటు మత్స్యకారులు ఉపాధి పొందుతున్నారు. సుమారు 362 గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతుంది. పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా ఈ రిజర్వాయర్ ఉంది.
ఆయకట్టుదారుల ఆందోళన
వైరా ప్రాజెక్టు కింది సుమారు 27 వేల ఎకరాలకు కుడి, ఎడం కాలువల ద్వారా నీటి సరఫరా అవుతుంది. ఖరీఫ్ సీజన్‌లో వరి అధికంగా సాగవుతుంది. నీరు పుష్కలంగా ఉంటే తప్పా వరి అధిక దిగుబడులు వచ్చే అవకాశం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. రిజర్వాయర్ నీటి సామర్థ్యం 18.3 అడుగులు. అయితే నీటిమట్టం 18.5 అడుగులకు చేరుకుంటే కాలువల ద్వారా నీరు విడిచి పెడతారు. ప్రస్తుతం 5.5 అడుగుల నీరు మాత్రమే ఉంది. ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో వర్షాలు లేవు. సాగర్ నుంచి నీరు రాలేదు. దీంతో సాగునీరు విడిచిపెట్టే పరిస్థతి ఇప్పట్లో కనిపించడం లేదు. రుతుపవనాలు ప్రవేశించినప్పుడు కురిసిన వర్షాలకు రైతులు విత్తనాలు వేశారు. ఆ తర్వాత వర్షాలు జాడ లేదు. దీంతో విత్తనాలు మొలకలు కూడా రాలేదు. ఆందోళన చెందుతున్న రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు.
తాగునీరు ప్రశ్నార్థకం
మిషన్ భగీరథ ద్వారా మూడు నియోజకవర్గాలు వైరా, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాల పరిధి 12 మండలాల్లోని 362 గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతుంది. రోజుకు పది కోట్ల లీటర్ల తాగునీరు సరఫరా అవుతుంది. నీటి మట్టం పూర్తి స్థాయిలో పడిపోయింది. ప్రస్తుతం 5.5 అడుగుల నీటి మట్టం మాత్రమే ఉంది. ప్రస్తుతం వర్షాలు జాడ లేదు. ప్రాజెక్టులో నీరు చేరకపోతే తాగునీరు ప్రశ్నార్థకంగా మారుతుంది.
మత్స్య సంపదపై ప్రభావం
ఈ రిజర్వాయర్ లో ఉన్న మత్స్యసంపదపై వైరా, కొణిజర్ల , తల్లాడ మండలాల్లో రెండు వేల మంది మత్స్యకారులు ఉపాధి పొందుతున్నారు. ప్రతి ఏటా రెండు వందల టన్నుల తెల్ల చేపలు, 50 టన్నుల రొయ్యలు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. జలాశయంలో నీరు చేరకపోతే మత్స్య సంపదపై ప్రభావం చూపుతుందని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. పూర్తిస్థాయిలో నీరు లేకపోతే మత్స్య సంపద తగ్గపోయే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.