Saturday, November 23, 2024

Exclusive – అభివృద్ధికి ఆమడదూరంలో జ్ఞాన సర‌స్వ‌తి ఆలయం….

బాస‌ర స‌ర‌స్వ‌తి ఆల‌య అభివృద్ధికి నిర్ల‌క్ష్య‌మెందుకో?
అభివృద్ధికి నోచ‌ని జ్ఞాన సర‌స్వ‌తి దేవ‌స్థానం
బాస‌ర‌లో స‌మ‌స్య‌ల‌తో భ‌క్తులు స‌త‌మ‌తం
కార్య‌రూపం దాల్చ‌ని మాజీ సీఎం కేసీఆర్ హామీ
గ‌ర్భాల‌యం లీకేజీల‌తో వ‌ర్ష‌పు నీరు
క్యూ కాంప్లెక్స్‌లోవాష్ రూమ్స్ లేక మ‌హిళ‌ల అవ‌స్థ‌లు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, బాస‌ర : తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత యాదాద్రి, వేముల‌వాడ ఆల‌యాల‌కు ఇచ్చిన ప్రాధాన్యం బాస‌ర శ్రీ‌జ్ఞాన స‌ర‌స్వ‌తి ఆల‌యానికి ఇవ్వ‌డం లేద‌ని భ‌క్తుల‌తోపాటు ఈ ప్రాంత ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. తెలంగాణ‌లో ప్రఖ్యాతి గాంచిన బాస‌ర‌ శ్రీ‌జ్ఞానసరస్వతి ఆలయంపై పాల‌కులు నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నార‌ని ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి.

- Advertisement -

భార‌త దేశంలో ఉన్న ప్ర‌ముఖ స‌ర‌స్వ‌తీ ఆల‌యాల్లో ఒక‌టి కాశ్మీర్‌లో ఉండ‌గా, రెండోవ‌ది బాస‌ర‌లోనే ఉంది. బాసరలో జ్ఞాన సరస్వతీ అమ్మవారు మహాలక్ష్మి, మహాకాళి సమేతులై కొలువుదీరి ఉన్నారు. ఈ ఆల‌యం చాళుక్యుల కాలంలో నిర్మించారు. అమ్మ‌వారు ద‌ర్శ‌నం కోసం దేశ న‌లుమూల‌ల నుంచి భ‌క్తులు వ‌స్తుంటారు. ఎంతో ప్రాధాన్య‌త గ‌ల ఈ పురాత‌న ఆల‌యంపై నిర్ల‌క్ష్య‌మెందుకో అని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు.

నిత్యం భ‌క్తుల ర‌ద్దీ
బాస‌ర శ్రీ‌జ్ఞాన స‌ర‌స్వ‌తీ అమ్మావారి ఆల‌యంలో నిత్యం భ‌క్తులు ర‌ద్దీ ఉంటుంది. ఇక్కడ సరస్వతీ ఆలయంలో బాలబాలికలకు అక్షరాభ్యాసం చేయడానికి దేశ న‌లుమూల‌ల నుంచి భ‌క్తులు వ‌స్తుంటారు. తెలంగాణ‌, ఆంధ్ర నుంచే కాకుండా దేశ న‌లుమూల నుంచి కూడా భ‌క్తులు ఇక్క‌డ‌కు వ‌స్తారు. కొంద‌రు భ‌క్తులు రాత్రి వేళ ఇక్క‌డ ఉండి తెల్ల‌వారు జామున జ‌రిగే పూజ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. వ‌సంత పంచ‌మి, ద‌స‌రా రోజుల్లో వేలాది మంది భ‌క్తులు ఇక్క‌డ అమ్మ‌వారిని ద‌ర్శించుకుంటారు. అలాంటి రోజుల్లో సుమారు ఆరేడు గంట‌లు క్యూలో ఉంటూ అమ్మ‌వారిని ద‌ర్శించుకుంటుంటారు.

తెలంగాణ ఏర్ప‌డి ప‌దేళ్లు దాటినా…
ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బాస‌ర ఆల‌యానికి పెద్ద‌గా ప్రాధాన్యం ఇవ్వ‌లేదు. తెలంగాణ ఏర్ప‌డి ప‌దేళ్లు దాటినా బాసర క్షేత్రం ఆల‌య అభివృద్ధి మాత్రం గ‌డ‌ప‌దాట‌లేదు. దేవాలయ అభివృద్ధికి 2018 తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో 50 కోట్ల రూపాయలు కేటాయిస్తున్న‌ట్లు అప్ప‌టి ప్ర‌భుత్వం కేటాయించింది. అయితే ఆ నిధులు మాత్రం విడుద‌ల కాలేదు. దీంతో ఆల‌య అభివృద్ధి ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే ఉన్న‌ట్లు ఉంది.

వ‌ర్షం వ‌స్తే…
ఏమాత్రం వ‌ర్షం ప‌డినా అమ్మవారి సన్నిధిలోని గర్భాలయంలో లీకేజీలు ద్వారా నీరు కింద‌కు ప‌డుతుంది. ఏక‌ధాటిగా వ‌ర్షాలు కురిస్తే చెరువుగా మారుతుంది. గ‌ర్భాల‌యంలో భక్తులపై నీరు పడకుండా ఆలయ అధికారులు ట‌బ్బుల‌ను ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాకార‌ మండపం సైతం వర్షాలకు శ్లాబ్ నుంచి కూడా నీరు లీకేజీ ఉంటుంది. గ‌త ప్ర‌భుత్వం ఆలయ ప్రాంగణంలో సుమారు రూ.8 కోట్లతో రెండు తాత్కాలిక షెడ్డులను నిర్మించారు. ఆలయ వసతి భవనాలపై ఏసీ వసతి భవనలు కూడా నిర్మించారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన 50 కోట్ల నిధులను విడుదల చేస్తే ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభం అయ్యేవి.

భ‌క్తుల‌కు అనుగుణంగా సౌక‌ర్యాలు క‌ల్పించాలి
భక్తుల ర‌ద్దీకి అనుగుణంగా మండపాలు, క్యూ కాంప్లెక్స్ లేక పోవడంతో భక్తులు చిన్నారులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఆలయ క్యూ లైన్‌లో మరుగుదొడ్లు లేక‌ మహిళ భక్తులు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు. వ‌సంత పంచ‌మి, ద‌స‌రా రోజుల్లో సుమారు ఏడు గంట‌ల క్యూలైన్‌లో భ‌క్తులు వేచి ఉండాల్సి ఉంటుంది. మరుగుదొడ్లు లేక ఎన్నో అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. క్యూలైన్‌లో మ‌రుగుదొడ్లు నిర్మించాల్సి ఉంది. అమ్మవారి సన్నిధిలో విశాలమైన ప్రత్యేక అక్షరాభ్యాస‌ మండపలు, క్యూ కాంప్లెక్స్, గర్భాలయం వెడల్పు, కుంకుమార్చన మండపం ఏర్పాటు అయితే వేల సంఖ్యలో వచ్చే భక్తులకు ఇబ్బందులు తొలగుతాయి. ఇందుకు కావలసిన ఆలయ భూమి కూడా అందుబాటులో ఉంది. కానీ నిధులు లేక అభివృద్ధికి నోచుకోవడం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement