పోలీస్.. ఇదో బ్రాండ్ నేమ్.. అయితే సానుకూలత కంటే సమాజంలో బెరుకు, వ్యతిరేకతే ఎక్కువ. అధికార దర్పానికి ప్రతీక… అధికార వర్గానికి భేషజ రూపం! ఏ చరిత్ర చూసినా, ఎవరి ఉత్థానపతనాలు చూసినా పోలీస్ పాత్రే ఎక్కువ! ముఖ్యమంత్రి స్థాయిలో పోలీస్ హడావుడి ఎలా ఉన్నా జనానికి పెద్దగా పట్టదు! ఎందుకంటే ఆయన నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండరు కనుక. కాని, ఎమ్మెల్యేల విషయంలో అలా కాదు. ఆయన కాలు బయటపెడితే పోలీస్ హడావుడే ఎక్కువ! పైలట్లు, ఎస్కార్ట్‌లు, బందోబస్తులు… అబ్బో ముఖ్యమంత్రి కంటే వీరి హంగే ఎక్కువ..
హైదరాబాద్, ఆంధ్రప్రభ: కేవలం రక్షణ వరకైతే ఎలాగోలా సర్దుకుపోవచ్చు… కాని, వీరి హంగు చూపించి అనుచరగణం చేసే దర్పం, దర్జాలే ఎమ్మెల్యేల కొంప ముంచుతున్నాయి. చివరకు ప్రభుత్వాలే కూలుతున్నాయి. కొందరు ఎమ్మెల్యేలే ఇవన్నీ చూసీ చూడనట్టు నడిపిస్తుంటారు. గత ప్రభుత్వ హయాంలోనూ ఇదే చివరకు భారాస పార్టీనే ముంచింది. జిల్లా స్థాయిల్లో ఎమ్మెల్యేల హడావుడి, అధికారదర్పం అసలుకే మోసం తెచ్చింది. మొత్తం పోలీస్ వ్యవస్థనే ఈ ప్రజాప్రతినిధులు శాసించారు. ఇష్టానుసారం పెత్తనం చేశారు. ఫలితం ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకింది. ముందుగానే ప్రభుత్వ పెద్దలు గ్రహించినా అప్పటికే పరిస్థితి సాంతం అదుపుతప్పింది. ఫలితం ఊహించనంత తీవ్రంగా వెలువడింది. ప్రజా ప్రతినిధులు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు ప్రజల పిలుపునకు వెంటనే స్పందించాలి. అంతే కాని, పైలట్, ఎస్కార్ట్‌ల పేరుతో దూరంగా అధికార దర్పంతో వెళ్లిపోతే వారి గోడు ఎవరికి చెప్పుకోవాలి?
నిన్నటికి నిన్న యశోద హోటల్‌లో మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించ డానికి ముఖ్యమంత్రి రేవంత్ వెళ్లారు. ఈ సందర్భంగా ఒక మహిళ రేవంతన్నా… అని పిలవగానే టక్కున వెనుదిరిగి ఆ మహిళను కలిసి సాధకబాధకాలు విన్నారు. ఇది మొత్తం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. సామాజిక, మేధావి వర్గాల ప్రశంసలు అందుకుంది. కేసీఆర్‌ను పరామర్శించడం ద్వారా రేవంత్ రెడ్డి ఎంత హుందాతనాన్ని ప్రదర్శించారో అంతకుమంచి ఈ ఘటన మన్ననలను అందుకుంది.
ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజల సమస్యలను వినడానికి ముందుండాలి కాని, అధికార దర్పం ప్రదర్శించడానికే ప్రాధాన్యం ఇవ్వడం తమకు తామే ఇబ్బందులను కొనితెచ్చుకోవడం అవుతుందని గ్రహించాలి.
ప్రజలు నేరుగా తమను కలవడానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా తామే చూసుకోవాలి. అనుచరగణం, పోలీసులే ప్రజలకు, తమకు దూరం పెంచుతున్నారన్న విషయాన్ని గ్రహించాలి. బదలీలు, సిఫారసు లేఖలు ఇవ్వడం ఎంతగా దుర్వినియోగం అవుతున్నాయో తెలుసుకోవాలి. సమర్ధత ఆధారంగా అవకాశాలను కల్పిస్తే తమ స్థానం మరింత సుస్థిరం అవుతుందని గమనించాలి.
ప్రతి దానికీ అధికారదర్పంతో పోలీస్ శాఖను వాడుకుంటూ పోతే మిగిలేది ప్రజాగ్రహమే. ఇందుకు గత ప్రభుత్వంలోనే ఎన్నో సంఘటనలు కోకొల్లలు. ఇందుకు కూడా రేవంత్ మార్క్ ప్రక్షాళన అవసరమని సామాజిక, మేధో వర్గాలు అంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపై దృష్టి సారించాలని, ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఆయన అనుచరులు పోలీస్‌ను ఉపయోగించుకుని ఎటువంటి దాష్టీకాలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అంతేకాకుండా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు.