Thursday, November 21, 2024

Exclusive – వంద శాతం వ‌చ్చేది మేమే … ఆంధ్ర‌ప్ర‌భ ప్రత్యేక ఇంట‌ర్వ్యూలో కెటిఆర్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో అలజడి సృష్టించి తమ ఉనికిని కాపాడుకోవడం కోసమే ప్రతిపక్ష కాంగ్రెస్‌, భాజపాలు పోటీపడి తమపై బురద జల్లు తున్నాయని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు స్పష్టం చేశారు. ఎన్నికల నేపథ్యం లో తెలంగాణ ప్రజలను నమ్మించి మోసగించేందుకు కుట్రలు, కుతంత్రాలతో కూడగట్టుకుని వస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీలో మొత్తం 22 బ్యారేజీలు, కాల్వలు అన్నీ కలిసి సరాసరిగా రూ.81 వేల కోట్లు ఖర్చు చేశామని, వాస్తవం ఇలా ఉంటే.. లక్ష కోట్ల అవినీతి అని దుష్ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. మేం గనుక తప్పు చేస్తే.. అత్యున్నత పదవి ప్రధాని స్థానంలో ఉన్న నరేంద్రమోడీ మమ్మల్ని వదిలి పెట్టేవాడా..! అని ప్రశ్నించారు. సినిమా కథల్లో సిద్దహస్తుడు ఆయన.. అంటూ కేటీఆర్‌ చమత్కరించారు. తెలంగాణ ప్రజల పక్షాన పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించిన ఉద్యమనేత కేసీఆర్‌.. ఏ ప్రాంతంలోని ప్రజలకు ఏం కావాలో తెలుసు కుని, అడగకుండానే అన్నీ
చేశారని వివరించారు. ముఖ్యమంత్రిగా, పేద కుటుంబాల్లో పెద్దన్నగా అండగా నిలిచిన ఆయనను కాదని ప్రజలు మరే పార్టీకి ఓట్లేసే అవకాశం లేదని ధీమా వ్యక్తం చేశారు. బలమైన ద్విముఖ పోటీతో బరిలో దిగిన ఎన్నికల్లో జయాపజయాలపై ‘ఆంధ్రప్రభ’ ప్రత్యేక ఇంటర్వ్యూలో భారాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సూటిగా సమాధానాలిచ్చారు.

తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి కేసీఆర్‌కు అన్ని వర్గాల ప్రజలు ఏకమై మరోసారి పట్టం కడతారని ఆయన బలమైన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. నిత్యం ప్రచారంలో తెగనరుకుతున్న విపక్షాల మైండ్‌ బ్లాకయ్యేలా.. కేసీఆర్‌ మళ్ళీ వస్తారు.. హ్యాట్రిక్‌ సీఎంగా.. అంటూ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. కొంతమంది విశ్లేషకులు అంటున్నట్లుగా ఈ ఎన్నికల్లో ‘హంగ్‌’ వచ్చే ఆస్కారమే లేదని స్పష్టం చేశారు. నూటికి నూరుపాళ్ళు కేసీఆర్‌ ఘనవిజయం సాధించి హ్యాట్రిక్‌ సీఎంగా బాధ్యతలు చేపడుతారని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. కాళేశ్వరం.. కేవలం ఓ రాజకీయ రాద్దాంతం మాత్రమేనని కొట్టిపారేశారు. అభివృద్ధి, సంక్షేమ రంగంలో దూసుకుపోయి లక్ష్యాలు చేరుకోవాలన్న బలమైన ఆకాంక్షతో పనిచేసే ఓ ప్రభుత్వంలోనైనా అప్పు చేయక తప్పదని, అసలు అది తప్పే కాదని పేర్కొన్నారు. అప్పు చేయడం అభివృద్ధిలో భాగమేనంటూ మంత్రి కేటీఆర్‌ సమర్థించుకున్నారు. కేసీఆర్‌ది అరాచక పాలన అయితే.. తప్పుచేసిన రేవంత్‌రెడ్డి బయట తిరిగేవాడా? అంటూ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

రాష్ట్రానికే పరిమితమైన భారాస జాతీయ పార్టీ ఎలా అవుతుంది?

  • నిజానికి జాతీయ పార్టీగానే కార్యకలాపాలు విస్తరించి ఎన్నికలకు వెళ్ళాలనుకున్నాం. అంతలోనే కొన్ని ప్రతికూల పరిస్థితుల కారణంగా వ్యూహాన్ని మార్చుకున్నాం. నిజమే.. ప్రస్తుతానికి భారాస ప్రాంతీయ పార్టీనే.. అదే సమయంలో చిన్న సైజు జాతీయ పార్టీ కూడా. ఎన్నికల తర్వాత ముందు మహారాష్ట్రలో జెండా పాతుతాం..

కొడుకును సీఎం చేసేందుకు కేసీఆర్‌ తనవద్దకు వచ్చారన్న మోడీ ఆరోపనపై మీ స్పందన?

- Advertisement -
  • ఆయన ఓ రాజకీయ సన్యాసి. సినిమా కథల్లో సిద్దహస్తుడు. దేశానికి ఆయన చేసిన వాగ్దానంలో ఏ ఒక్కటీ నెరవేరలేదు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని మరిచారు. ఇంటింటికీ రూ.15 లక్షలు ఖాతాల్లో జమ, ఏటా రెండు కోట్ల ఉద్యోగాల భర్తీ లాంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రజలు అన్నీ చూస్తున్నారు. ఇక నిర్ణయం వారిదే. ఇలాంటి పనికిమాలిన సవాళ్ళు, కాకమ్మ కథలకు ఉన్నతమైన దృక్పథం గల కేసీఆర్‌ ఎందుకు స్పందించాలి.

నీళ్ళు, నిధులు సరే.. నియామకాల్లో వైఫల్యం ఎందుకు?

  • ఈ విషయంలో విపక్షాలది పున్నమి చంద్రుడిపై మచ్చలు వెతికే ప్రయత్నం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక 95శాతం లోకల్‌ రిజర్వేషన్లు సాధించాం. 2.35 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చాం. 1.63 లక్షల నియామకాలు పూర్తి చేశాం. టీఎస్‌ఎస్సీకి సంబంధించి బండి అనుచరులే పేపర్‌ లీక్‌ చేశారు. కోర్టుకు వెళ్ళింది రేవంత్‌ అనుచరులు. ఉద్దేశపూర్వకంగా అడ్డుకుని వైఫల్యమంటూ సర్కారుపై బురద జల్లుతున్నారు. బీజేసీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో మాకన్నా ఎక్కువ ఏం చేశారో చెప్పమనండి. మళ్ళీ అధికారంలోకి వచ్చాక టీఎస్సీఎస్సీని ప్రక్షాళన చేస్తాం. ఆ బాధ్యత నేనే తీసుకుంటా.

రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్న విపక్షాల ఆరోపణపై మీ జవాబు?

  • అప్పు చేయడం అభివృద్ధిలో భాగమే. చెల్లించే మార్గాలు ఉంటేనే మంజూరు చేస్తారు. 2014లో 7700 మెగావాట్లుగా ఉన్న విద్యుదుత్పత్తి సామర్థ్యం ఇప్పుడు 24,000 మెగావాట్లకు చేరుకుంది. అలాగే మిషన్‌ భగీరథ, ప్రాజెక్టుల నిర్మాణానికి అప్పు తెచ్చాం. అది తెలంగాణ ప్రజలపై భారం కాదు.. ఒక రూపాయితో ఇంకో రూపాయి సృష్టించేందుకు పెట్టిన పెట్టుబడి. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి లోబడి అప్పు తెచ్చాం.

కాళేశ్వరంలో లక్ష కోట్లు నీళ్ళపాలు అన్న ఆరోపణలపై మీ స్పందన?

  • ఇది నూటికి నూరుపాళ్ళు అవాస్తవం. ప్రతిపక్షాలు నోటికొచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నాయి. మొత్తం 22 రిజర్వాయర్లు, 22 పంప్‌హౌజ్‌లు, వరద కాలువలు.. ఇలా అన్నీ కలిపి రూ.81 వేల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచిన నిర్మాన సంస్థ ఎల్‌అండ్‌టీ ఈ పనులను చేపట్టింది. కాళేశ్వరం అంటే ఒకే ప్రాజెక్టు కాదు.. ఒకచోటే సమస్య తలెత్తింది. ప్రకాశం, ధవళేశ్వరం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులు బ్యారేజీలు కట్టినపుడు కూడా ఇలాంటి సమస్యలు వచ్చాయి. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ వ్యయం రూ.1,834 కోట్లు మాత్రమే. రెండు పిల్లర్లు కుంగిపోతే.. ఎల్‌అండ్‌టీ సంస్థ బాధ్యత వహించి పునర్నిర్మాణానికి అంగీకారం తెలిపింది. అంతలోనే లక్ష కోట్ల అవినీతి అంటూ రాహుల్‌గాంధీ మొదలుకుని అంతా దుష్ప్రచారం మొదలు పెట్టారు. కేంద్ర బృందం ఇచ్చింది ఎన్‌డీఎస్‌ఏ రిపోర్టు కాదు.. ఎన్‌డీయే రిపోర్టు. గుజరాత్‌లో ఓ బ్రిడ్జి కూలి 130 మంది చనిపోతే.. రిపోర్టు ఏదీ..? చర్యలు ఏవీ..?

కాంగ్రెస్‌ నాయకుల ఇళ్ళపై ఐటీ దాడులు మీపనేనని ఆరోపిస్తున్నారు.. మీరేమంటారు?

  • ఆధారాలు, ఫిర్యాదులు ఉంటేనే ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహిస్తుంది. అతి రాజకీయాలతో సంబంధం లేదు. ఇదివరకు గంగుల కమలాకర్‌, వద్దిరాజు రవిచంద్ర, పార్థసారధి రెడ్డి, తలసాని, మల్లారెడ్డి.. ఇలా అనేక మంది మా పార్టీ నాయకులపైనా దాడులు జరిగాయి. ఐటీ, ఈడీ దాడులకు, రాజకీయాలకు సంబంధం లేదు. ఇది కూడా బురదజల్లే ప్రయత్నమే.

కేసీఆర్‌ కుటుంబానికి గర్వం తలకెక్కిందన్న రేవంత్‌ ఆరోపణలపై మీ సమాధానం?

  • చెప్పుకోవడానికి ఏమీ దొరకక, కేసీఆర్‌ కుటుంబంపై ఆరోపణలు మొదలుపెట్టారు. నెహ్రూ మొదలుకుని రాహుల్‌, ప్రియాంక వరకు కుటుంబ పాలన కాదా..? దమ్ముంటే అవినీతి ఆరోపణలపై ఒక్క ఆధారం చూపండి. కేసీఆర్‌ నియంతే అయితే.. రేవంత్‌రెడ్డి లాంటి వాళ్లు అనేక మంది నేర చరితులు బయట తిరిగే పరిస్థితి ఉండేది కాదు. అహంకారవాది అయితే, పరిపాలనలో ఇంతటి పరిపక్వత ఎలా వస్తుంది. ఫలితాలు ఎలా సాధిస్తారు. దీనికి ఎక్కడో ఒకచోట పుల్‌స్టాప్‌ పెట్టాల్సిందే. ఈసారి వదిలిపెట్టం.

కేసీఆర్‌ మానస పుత్రిక ‘ధరణి’ రాద్ధాంతంపై వ్యూహమేంటి..?

  • ధరణి అత్యంత అద్భుతమైన ప్రాజెక్టు. భూ రికార్డుల నిర్వహణలో దేశంలోనే మొట్టమొదటి పారదర్శక వ్యవస్థ. ఎలుకలున్నాయని ఎవడూ ఇల్లు తగులబెట్టుకోడు. లోపాలుంటే సరిదిద్దుకోవాలి.. ఆ చర్యలు ఎప్పటికప్పుడు కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో 8 స్థాయిల్లో భూ రికార్డుల వ్యవస్థ ఉండేది. ఇప్పుడంతా పారదర్శకంగా లబ్ధిదారుడి వేలిముద్రలోనే ఇమిడి ఉంది. ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామంటే.. వాళ్ళే కలిసిపోక తప్పదు.

వర్షం పడితే రాజధాని నగరమంతా చిత్తడి.. విశ్వనగరం ఎలా సాధ్యం?

  • ఏదైనా పరిమితి మించితే.. తట్టుకునే శక్తి ఉండదు. నగరంలో మురుగునీటి వ్యవస్థ్థ కూడా అలాగే ఉంది. తెలంగాణ ఏర్పాటయ్యాక అనేక కోణాల్లో అభివృద్ధి చేసి మెరుగు పరిచాం. భారీ వర్షాలు కురిసిన సందర్భాల్లో న్యూయార్క్‌లోనూ కార్లు, ఇళ్ళు మునిగిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి. జనసాంద్రత ఎక్కువగా ఉన్న మహానగరాల్లో పరిస్థితులు అలాగే ఉండడం సహజం. వాటిని మెరుగుపర్చుకుంటూ ముందుకు వెళ్ళాల్సిందే. ఎన్‌ఎన్‌డీపీ, ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టుల ద్వారా అత్యంత మెరుగైన ఫ్లడ్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థను త్వరలోనే ఆవిష్కరిస్తాం. ఇప్పటివరకు సాధించింది చాలానే ఉంది.. ఇంకా సాధించాల్సింది కూడా ఎక్కువగానే ఉంది.

సిట్టింగులకు సీట్లివ్వడంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారా..?

  • రాజకీయాల్లో అసంతృప్తులు సహజం. 97శాతం ఎమ్మెల్యేలకు తిరిగి అవకాశం కల్పించాం. కొత్త వాళ్ళకు ఇచ్చినా.. అసంతృప్తులు ఉంటాయి. ప్రజల్లో బీఆర్‌ఎస్‌ అత్యంత బలంగా, సుస్థిరంగా ఉంది. మా పథకాల లబ్ధిదారులే మమ్మల్ని గెలిపించుకుంటారు. అసంతృప్తులు ఉన్నా.. గులుగుడు గులుగుడే.. గుద్దుడు గుద్దుడే.. వందశాతం మళ్ళీ అధికారంలోకి వస్తాం.. కాంగ్రెస్‌కు 11సార్లు అధికారం ఇస్తే.. ప్రజలకు ఏం చేశారు? వంచన తప్ప. రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ సర్కారు రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దింది. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి దిక్సూచిగా మారాయి. స్వాాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు గడిచినా.. ఏ రాష్ట్రం ఆ దిశగా ఆలోచన కూడా చేయలేదు. దేశంలో ఇంటింటికీ సురక్షిత తాగునీరు అందించిన ఘనత కేవలం తెలంగాణాలోనే సాధించాం.
Advertisement

తాజా వార్తలు

Advertisement