పోరాటమే ఆయుధం.. విజయం ఖాయం
జనం కోసం మనం.. మనకోసం జనం!
అన్నింటా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
ప్రజల్లో వ్యతిరేకత.. ఇక ఉద్యమించాల్సిందే
కేంద్రంలో బీజేపీ వైఖరీ అలాగే ఉంది
తెలంగాణపై మొదటినుంచీ అదే తీరు
శుష్కప్రియాలు.. శూన్యహస్తాలు
సంక్షేమం, అభివృద్ధి ఆగిపోయాయి
హైదరాబాద్‌ను ఆగమాగం చేశారు
నేనేం చెప్పానో అదే జరుగుతోంది
ఇదొక విఫల ప్రభుత్వం
సమయమివ్వాలని ఆగా.. ఇక బెబ్బులిలా వస్తా
కేటీఆర్, హరీష్ ఫైట్ బాగుంది
కారు జోరు గ్యారెంటీ
పార్టీ నేతలకు స్ఫూర్తి రగిలిస్తున్న కేసీఆర్
న్యూస్ నెట్‌వర్క్ ఇన్‌ఛార్జ్, ఆంధ్రప్రభ :
శాసనసభ ఎన్నికల్లో అనూహ్య పరాజయం తరువాత నిరాశా నిస్ప్రృహల్లో కూరుకుపోయిన బీఆర్‌ఎస్ ఇప్పుడిప్పుడే నిప్పులా రగులుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం ప్రారంభించింది. అటు బీజేపీనీ దునుమాడుతోంది. హైడ్రా కూల్చివేతలు, మూసీ సుందరీకరణ పేరుతో ఇళ్ల తొలగింపు, గ్రూప్ 1 పరీక్షలు, రుణమాఫీ, రైతుభరోసా వంటి సమస్యలపై గళమెత్తుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పది నెలలు పూర్తయ్యాయి. ఎన్నికల వేళ ఆ పార్టీ ఇచ్చిన గ్యారెంటీ హామీలపై అప్పట్లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు, భయాందోళనలు, ప్రజలకు చేసిన హెచ్చరికలు నిజమవుతున్నాయని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఏతావాతా పరిస్థితులు బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మారుతున్నాయని, ఇప్పుడు ప్రజల పక్షాన నిలిచి పోరాడాల్సిన సమయం వచ్చిందని కేసీఆర్ భావిస్తున్నారు. అదే విషయాన్ని తనను కలసిన పార్టీ నేతలు, శ్రేణులతో ఆయన చెబుతున్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా కేసీఆర్ ప్రజలను అప్రమత్తం చేశారు. కాంగ్రెస్ వస్తే పాలన అస్తవ్యస్తమవుతుందని, రుణమాఫీ, రైతుబంధు, రైతుభరోసా వంటి పథకాలను వారు అమలు చేయలేరని, అడ్డగోలు హామీలను నమ్మి గోసపడవద్దని హెచ్చరించారు. కానీ ప్రజల తీర్పు కాంగ్రెస్‌కు అనుకూలంగా వచ్చింది. రేవంత్ సారథ్యంలోని ప్రభుత్వం పగ్గాలు చేపట్టింది. ఓటమితో బీఆర్‌ఎస్ డీలా పడింది. అయితే, కేసీఆర్ ఆ పరిణామాలను ఒక ఆశావాదిగా పరిశీలించారు. కొత్త ప్రభుత్వానికి ఒక ఏడాది గడువు ఇవ్వాలని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయని పక్షంలో ప్రజల తరపున పోరాడాలని ప్రకటించారు. ఒకటి రెండు సందర్భాలలో మినహా ఆయన మౌనరాగమే ఆలపిస్తున్నారు.
రైతులు, సామాన్యులు రగిలిపోతున్నారు..
ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్, బీజేపీ నాయకులనుంచి విమర్శలు పెరిగాయి. కేసీఆర్ అయిపులేరని ఎద్దేవా చేయడం మొదలుపెట్టారు. కానీ బీఆర్‌ఎస్ అధినేత కాలక్షేపం చేయడం లేదు. తనను కలవడానికి వచ్చిన నేతలతో అంతరంగ వ్యూహాన్ని వివరిస్తున్నారు. తాను చెప్పినట్టే రేవంత్ ప్రభుత్వం అన్నింటా విఫలమైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. రైతులు, సామాన్యులు రగిలిపోతున్నారని, వారికి అండగా నిలవాలని సూచిస్తున్నారు. హైడ్రా కూల్చివేతలు, మూసీపై కేటీఆర్, హరీష్‌రావు మంచిగా పోరాడుతున్నారని, ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించాల్సిన సమయం వచ్చేసిందని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వానికి ఏడాది సమయం ఇవ్వాలని ఆగానని, ఇక భేరి మోగిస్తానని స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థ పాలన వల్ల రైతులు గోసపడుతున్నారని, హైదరాబాద్ ఆగమాగమైందని.. ఇదంతా ప్రజలకు ముందే చెప్పానన్న కేసీఆర్.. ప్రజల పక్షాన పోరాడక తప్పదని పార్టీ నాయకులకు చెబుతున్నారు. త్వరలో బెబ్బులిలా వచ్చి ప్రభుత్వంపై పోరాడతానని, ఈలోగా మీరంతా ఉద్యమించాలని మార్గనిర్దేశం చేస్తున్నారు.
బీజేపీని వదిలేది లేదు..
బీఆర్‌ఎస్ పోరాటం కేవలం కాంగ్రెస్‌పైనే కాదని, బీజేపీని వదిలిపెట్టకూడదని స్పష్టంగా చెబుతున్నారు. నిజానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం బీజేపీకి ఇష్టం లేదని, ఎల్‌కే అద్వానీ-సుష్మా స్వరాజ్ గట్టిగా పట్టుబట్టడంవల్లే సాకారమైందని, మోడీయే అప్పుడు ఉంటే రాష్ట్రం వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ సాక్షిగా ప్రధాని నరేంద్రమోడీ అనేక సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు ఆయన ధోరణికి అద్దంపట్టాయని గుర్తు చేస్తున్నారు. అందువల్ల తెలంగాణపై బీజేపీది సవతితల్లి ప్రేమేనని, బడ్జెట్‌లో కేటాయింపుల నుంచి నిధుల విడుదల వరకూ బీజేపీ చర్యలన్నీ అదే చెబుతున్నాయని ఉదహరిస్తున్నారు. కాంగ్రెస్-బీజేపీల వైఫల్యాలను, చేతగానితనాన్ని ప్రజలు గమనించారని, అసంతృప్తితో రగిలిపోతున్నారని అంటున్న కేసీఆర్… వచ్చే జమిలి ఎన్నికల్లో సెంచరీ కొడతామని పార్టీ నేతలకు గట్టిగా చెబుతున్నారు. బీఆర్‌ఎస్ పాలనలో వారికి ఎంత మేలు జరిగిందో గుర్తు చేసుకుంటున్నారని, మళ్లిd మనకు అవకాశం ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారని గంటాపథంగా చెబుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలపై రచ్చబండల్లో చర్చలు జరుగుతున్నాయని, సమయం వస్తే ఆ పార్టీలకు బుద్ధి చెబుతారని, అందువల్ల.. సమరానికి సమయం ఆసన్నమైందని, రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమపంథాలో కాంగ్రెస్ – బీజేపీలపై పోరాడాలని దిశానిర్దేశం చేస్తున్నారు. రోజంతా రైతులు, నిరుద్యోగులు, నిరాశ్రయులు ఇలా బాధితవర్గాలకు అందుబాటులో ఉండాలని సూచిస్తున్నారు. ప్రజల తరపున గళమెత్తితే.. జనం మనవెంట ఉంటారని చెబుతున్నారు.
ఈసారి కొట్టే దెబ్బ మామూలుగా ఉండొద్దు
తెలంగాణ ఉద్యమ సమయంలో అటు వైఎస్‌రాజశేఖర్ రెడ్డి, ఇటు చంద్రబాబు వంటి బలమైన నాయకులతో పోరాడి ఫలితం సాధించానని, వారితో పోలిస్తే ఇప్పటి కాంగ్రెస్ – బీజేపీ నేతలు ఒక లెక్కే కాదని ధీమాగా చెబుతున్నారు. రాజకీయం కోసమో, ఓట్ల కోసమో బీఆర్‌ఎస్ పోరాడుతోందన్న భావన ప్రజల్లో కలగకూడదని, నిజంగా వారికి సమస్యలు ఏర్పడినప్పుడు.. వారి తరపున పోరాటం చేయాలని, అందుకు ఇది సమయమని చెబుతున్న కేసీఆర్ తను ఆయా పార్టీలకు ఈసారి కొట్టే దెబ్బ మామూలుగా ఉండదని పార్టీ నేతలతో అంటున్నారు. ఇంకొంచెం రోజులు ఓపికపడితే తానేమిటో చూపిస్తానని, సమయం చూసి యుద్ధం ప్రారంభిస్తానని మాటిస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటమి బాధ కలిగించినా, ప్రజలకు కాంగ్రెస్ – బీజేపీ ఏమిటో అర్థమైందని, వారి జాతకాలు తెలిసిపోయాయని.. ఇక ప్రజలు మనకు బ్రహ్మరథం పడతారని విశ్వసిస్తున్నట్లు చెబుతున్నారు. ఈసారి భారీ మెజారిటీతో గెలుస్తామని, మరో ఇరవై ఏళ్లపాటు బీఆర్‌ఎస్ కారు దూసుకుపోతుందని ధీమాగా చెబుతున్నారు. ఫామ్‌హౌస్‌లో కలిసిన నేతలు కేసీఆర్ అంతరంగ వ్యూహాన్ని తెలుసుకుని ఉద్యమస్ఫూర్తితో బయటకు వస్తున్నారు.. ఎంతో నమ్మకంతో.. ఉత్సాహంతో. భవిష్యత్‌పై ఆశలతో!