స్టేట్ చీఫ్ కిషన్‌రెడ్డి తీరుపై ఎమ్మెల్యేల అసంతృప్తి
కేంద్ర మంత్రి పదవి దక్కిన తర్వాత తీరు మారిందని కినుక
రాష్ట్ర పదాధికారుల సమావేశానికి ఏడుగురు గైర్హాజర్
పక్క పార్టీలవైపు మారిన చూపులు
అయినా ఇదేమీ పట్టించుకోని పార్టీ నేతలు
పార్టీ కేడర్‌పై తీవ్ర ప్రభావం ఉండే చాన్స్
ఆవేదన వ్యక్తం చేస్తున్న సెకండరీ లీడర్స్
ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో విజయాలతో కమలం పార్టీ శ్రేణులు ఖుషీగా ఉన్నారు. తెలంగాణకు చెందిన ఇద్దరికీ కేంద్ర కేబినెట్‌లో స్థానం దక్కింది. దీంతో ఖుషీ డబుల్ అయ్యింది. అయితే.. ఆ తర్వాత రాష్ట్ర పార్టీలో జరుగుతున్న పరిణామాలు కేడర్‌ని డైలామాలో పడేశాయి. తమకు ప్రయారిటీ దక్కడ లేదని ఎమ్మెల్యేలు, సెకండరీ లీడర్లు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక.. బడ్జెట్‌లో తెలంగాణకు ఎలాంటి ప్రాధాన్యం లేదని అన్ని పార్టీలతోపాటు, ఆ పార్టీ లీడర్లు.. సామాన్య జనం కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు పార్టీని క్షేత్ర స్థాయికి తీసుకు వెళ్లాలని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో ఎమ్మెల్యేలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం అయినట్టు తెలుస్తోంది. ఇదే అంతర్గత విబేధాలకు తెర తీసింది. ఎమ్మెల్యేలను బుజ్జగించకపోతే పార్టీపై ప్రభావం పడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
కొత్త ఎమ్మెల్యేలకు ప్రోత్సాహం కరువు
తెలంగాణలో ఎన్నికైన ఎనిమిది మంది ఎమ్మెల్యేల్లో ఆరుగురు కొత్తవారు. ఇక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఎమ్మెల్యేలను సిద్ధం చేసే పరిస్థితి లేకపోయింది. పార్టీ నుంచి సరైన గైడెన్స్ లేకపోవడంతో అసెంబ్లీలో ఉత్సవ విగ్రహాలుగా వారు ఉంటున్నారనే అపవాదు వచ్చింది. అసెంబ్లీలో అటు అధికార కాంగ్రెస్‌కు, ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు దీటుగా ముందుకెళ్లేవిధంగా కొత్త ఎమ్మెల్యేలను ప్రోత్సహించడం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి.
గ్రాఫ్ పెంచడంలో కీలకం…
లోక్‌సభ ఎన్నికల్లో ఎమ్మెల్యేల పాత్ర కీలకంగా మారింది. ఆ ఎన్నికల్లో గ్రాఫ్ పెంచడంలో ఎమ్మెల్యేల పాత్ర ఉన్నా, ఎన్నికల తర్వాత వారిని పట్టించుకునే పరిస్థితి లేకపోయిందని విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం ఎవరికి వారే తమ రాజకీయ ప్రాబల్యం పెంచుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. కేంద్రంలో ఇద్దరికీ మంత్రి పదవులు వచ్చినా పార్టీని ఏకతాటిపై నడపడంలో విఫలమవుతున్నారని, అలాగే పార్టీ అధ్యక్ష పదవి కోసం సీనియర్ ఎంపీలు ఆరాటం పడడం తప్ప.. అంతర్గత విబేధాలు చోటుచేసుకోకుండా తీసుకున్న చర్యలు కనిపించడం లేదని పలువురు భావిస్తున్నారు.
నో ఇన్విటేషన్…
ఇటీవల బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రైతు రుణమాఫీ హెల్ప్ లైన్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదని తెలుస్తోంది. దీనికి సంబంధించిన పోస్టర్లలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కిషన్ రెడ్డి ఫొటోలు తప్ప.. మిగతా వారి ఫోటోలేవీ ముద్రించలేదు. రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశానికి కూడా ఎమ్మెల్యేలందరీకి సమాచారం ఇవ్వలేదని ప్రచారం నడుస్తోంది.
ఎమ్మెల్యేల గైర్హాజర్‌కు కారణం ఏమిటి?
రాష్ట్ర పదాధికారులు సమావేశానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా మాత్రమే హాజరయ్యారు. మిగిలిన వారు ఎందుకు హాజరు కాలేదన్న చర్చ కూడా జరగలేదని, కనీసం వారిని మీటింగ్‌కు ఎందుకు రాలేదని అడిగే నాథుడే కూడా కరువయ్యారని తెలుస్తోంది. ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా కిషన్ రెడ్డి కూడా ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదని అడగలేకపోవడం అందరినీ బాధకు గురిచేసినట్టు సమాచారం.
పక్క పార్టీ వైపు చూపులు..
ఎమ్మెల్యేలకు పార్టీలో తగిన ప్రాధాన్యం లేకపోతే రాజకీయంగా బలపడే అవకాశాలు ఉండవని, ఈ నేపథ్యంలో పక్క పార్టీకి చేరితే బాగుంటుందన్న ఆలోచనలో ఒక్కరిద్దరు ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అనుకూల పరిస్థితులు లేకపోవడంతో వారు సతమతమవుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికైనా అధిష్టానం మేలుకోకపోతే పార్టీకి నష్టం జరిగే అవకాశాలు లేకపోలేదని పలువురు భావిస్తున్నారు.
పార్టీపై ప్రభావం
స్థానిక సంస్థలకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అసంతృప్తిలో ఉన్న ఎమ్మెల్యేలను బుజ్జగించే ప్రయత్నం చేసేలా కనిపించడం లేదు. పార్టీలో ఉన్న అసంతృప్తిని తొలగించకపోతే దాని ప్రభావం రాబోయే ఎన్నికల్లో పడే అవకాశం ఉందని పార్టీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అలాగే.. పార్టీ పీఠాన్ని ఆశిస్తున్న నేతలు కూడా ఎమ్మెల్యేలను బుజ్జగించే యత్నం చేయడం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి.