జోరుగా కొనసాగుతున్న కాంగ్రెస్ నోటుకు సీటు కార్యక్రమం…
సునీల్ కనుగోలు ను కొనుగోలు చేసిన రేవంత్ రెడ్డి…
రేవంత్ వర్గానికి సీట్లు వచ్చేలా సర్వేలు,రిపోర్టులు..
టీపీసీసీ పదవి నుండి రేవంత్ రెడ్డీని తొలగొంచే యోచనలో మల్లికార్జున్ ఖర్గే…
రేవంత్ కోట్ల రూపాయలకు సీట్లు అమ్ముకుంటున్నాడని ఉత్తమ్ కుమార్ రెడ్డి పైర్.
సోషల్ మీడియాలో కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలే టాప్ ట్రెండింగ్..
హైదరాబాద్ – కాంగ్రెస్ లో అంతర్గత కుమ్మలాటలు మళ్లీ ప్రారంభమయ్యాయి.. టాప్ లీడర్స్ మధ్య అధిపత్య పోరు జోరుగానే సాగుతున్నట్లు సోషల్ మీడియా కోడై కూస్తున్నది.. రేవంత్ రెడ్డి ఒక వర్గంగా, ఉత్తమకుమార్ రెడ్డి, భట్టి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి లు మరో వర్గంగా పావులు కదుపుతున్నట్లు పొలిటికల్ విశ్లేషకుల సమాచారం.. సఖ్యతగా ఉండి కలసి కట్టుగా ఎన్నికల సమరంలోకి దూకాల్సిన సమయంలో సఖ్యత మాత్రం కనిపించడం లేదు.. రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం పిసిపి అధ్యక్షుడిపై ఎఐసిసి కి ఫిర్యాదులపై ఫిర్యాదులు చేస్తున్నారు.. ఇటీవలే పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని లైమ్ లైట్ లోకి తీసుకువచ్చిన భట్టి విక్రమార్క సైతం రేవంత్ రెడ్డి పనితీరుపై అసంతృప్తితో ఉన్నారు.. అనేకమంది నేతలు భట్టిని కలసి రేవంత్ బిసిలకు సీట్లు రాకుండా చేస్తున్నారని ఫిర్యాదులు చేశారు.. ఈ విషయాన్ని భట్టి అధిష్టానానికి చేరవేశారని వార్తలు గుప్పు మంటున్నాయి.. ఇక మరో ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏకంగా రేవంత్ డబ్బులకు సీట్లు అమ్ముకుంటున్నారంటూ బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.. దీనిపై అధిష్టానం వద్ద జరిగిన పంచాయితీలో రేవంత్ డబ్బున్న వాళ్లకు, డబ్బు ఇచ్చిన వాళ్లకు, తనకు నచ్చిన వాళ్లకే సీట్లు కేటాయిస్తున్నారంటూ ఉత్తమ్ తేల్చి చెప్పారు.. అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం లేదంటూ ఎఐసిసి చీఫ్ మల్లిఖార్జున ఖర్గేకి నేరుగానే ఫిర్యాదు చేశారు.
అలాగే మరో సీనియర్ నేత , ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం రేవంత్ పై గుర్రుగానే ఉన్నారు.. తొలి నుంచి రేవంత్ కు అంటిముట్టనట్లు ఉన్న వెంకటరెడ్డిను అధిష్టానం రేవంత్ తో సఖ్యత కుదిర్చింది.. అయినప్పటికీ కోమటిరెడ్డి తనదైన శైలీలో రేవంత్ పనితీరును ప్రశ్నిస్తున్నారు.. సీనియర్లను పట్టించుకోవడం లేదని, కార్యక్రమాలకు సైతం పిలువడం లేదని, కొత్తవారికి రేవంత్ ప్రాధాన్యత ఇస్తున్నారనేది కోమటిరెడ్డి ప్రధాన వాదన.. ఉత్తమ్ కుమార్ చేసిన ఆరోపణలను సైతం కోమటిరెడ్డి సమర్ధించడం ఒకింత కొసమెరుపు..
ఇక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కొనుగోలు ఏకంగా కొనుగోలు చేసినట్లు ట్రోలింగ్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ దూసుకుపోతున్నది.. సునీల్ ను తన గుప్పెట్లో ఉంచుకుని నియోజకవర్గాల సర్వేలలో తనకు అనుకూలమైన వారి పేర్లు ఉండేలా మేనేజ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.. ఈ విషయాలు ముందుగానే వెలుగు చూడటంతో ఇప్పటికే పలు స్థానాలలో సీనియర్లలో కలవరం మొదలైంది.. వారంతా రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం నేతలతో తమ గోడును వినిపించుకుంటున్నారు.
కాంగ్రెస్ లో సాగుతున్న అధిపత్య పోరుతో అధిష్టానం తలలుపట్టుకుంటున్నది.. నేతల మధ్య సఖ్యత కోసం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జీ మాణిక్ రావు ఠాక్రే ఎన్ని ప్రయత్నాలు చేసినా నేతలలో మార్పు రావడంలేదు.. ఇప్పటికే తెలంగాణలో నేతల మధ్య కొనసాగుతున్న అధిపత్య పోరుపై నేరుగా ఎఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాజకీయ వ్యవహారాల కార్యదర్శి కెసి వేణుగోపాల్ ఒక నివేదిక ఇచ్చినట్లు తాజా సమాచారం.. ఈ వివాదాలకు చెక్ పెట్టేందుకు నేరుగా ఖర్గే రంగంలో దిగనున్నారు.. ప్రస్తుత పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిని తొలగించి కొత్త చీఫ్ ను నియమించే ఆలోచన కూడా ఉన్నట్లు ఢిల్లీ నుంచి సమచారం.. రేవంత్, భట్టి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ కుమార్ రెడ్డి, మధు యాష్కీ తదితర సీనియర్లతో ఫైనల్ గా ఒక భేటి ఏర్పాటు చేసి వారితో అన్ని విషయాలు ప్రస్తావించనున్నారు ఖర్గే.. ఇదే సమయంలో కర్నాటక ట్రబుల్ షూటర్ డికె కూడా తెలంగాణ వ్యవహారాలపై దృష్టి సాంరించనున్నారు .. ఏదీ ఏమైనా కాంగ్రెస్ నేతలు కలసికట్టుగా లేకుండా ముందుకు సాగితే అధిష్టానం తీవ్ర నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు.. మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి పైనా ఎక్కువ ఫోకస్ ఉండటంతో పిసిపి పదవికి చెక్ పడే అవకాశాలు తోసిపుచ్చలేమని తెలంగాణలోని పలువురు కాంగ్రెస్ నేతలు అంటున్నారు.