శ్రీరాంసాగర్‌లో మూడోవంతు నీటి నిల్వ
నిజాంసాగర్ పరిస్థితిపై ఆందోళనలో రైతులు
సింగూర్‌కు స్వల్పంగా చేరుతున్న నీరు
జూరాలకు 2.06 లక్షల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో
ఆంధ్రప్రభ స్మార్ట్, నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్ – తెలంగాణలో విస్తారంగా వానలు కురిశాయి. గోదావరి ఉప్పొంగి ప్రవహించింది. అయినా నీటి వనరులు పూర్తి స్థాయిలో నిండలేదు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు పంటలకు జీవం పోసినప్పటికీ భవిష్యత్తులో ఎలా ఉంటుందన్న ఆందోళనలో రైతులు ఉన్నారు. ఈ సీజన్లో నీటి వనరులు పూర్తి స్థాయిలో నిండి ఉంటే వానాకాలం సీజన్ పంటలపై ధైర్యంగా ఉండే అవకాశం ఉంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. గోదావరి ఆధారంగా ఉన్న శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులు సగం కూడా నిండలేదు. మెదక్ జిల్లాలో ఉన్న సింగురూ ప్రాజెక్టులోకి కూడా ఆశించిన స్థాయిలో నీరు చేరలేదు. తుంగభద్ర నుంచి వచ్చిన నీటితో జూరాలలో మాత్రం నీటి మట్టం కాస్తా మెరుగ్గా ఉంది.
శ్రీరాంసాగర్‌లో మూడో వంతు నీటి నిల్వ
ఉత్తర తెలంగాణ వర ప్రదాయిని శ్రీరాం సాగర్ ప్రాజెక్టులోకి గోదావరి వరద నీరు చేరుతోంది. వానాకాలం సీజన్ లో వర్షాలు ఆలస్యంగా కురవడంతో ప్రాజెక్టులోకి ఆశించిన స్థాయిలో నీరు చేరలేదు. ప్రస్తుతంలో మూడో వంతు నీటి నిల్వ ఉంది. గత వారం రోజులుగా కురిసిన వర్షాలకు, అలాగే గోదావరిలో పెరిగిన వరదతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి నీరు చేరుతోంది. గురువారం గోదావరి నది ద్వారా ప్రాజెక్టులోకి 19వేల 870 వేల క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుతం 1071.50 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి సామర్థ్యం 80.1 టీఎంసీ లకు ప్రస్తుతం 25.96 టీఎంసీల మాత్రమే నీరు నిల్వ ఉంది. వానాకాలం సీజన్ గట్టేందుకు ప్రస్తుతం ఉన్న నీరు సరిపోదు. కనీసం 50 టీఏంసీలు అవసరం ఉంది.
నిజాంసాగర్ పరిస్థితి ఆందోళనకరం
నిజామాబాద్ జిల్లా వరప్రదాయిని అయిన నిజాంసాగర్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రాజెక్టులోకి కేవలం 750 క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తోంది. ప్రాజెక్టు నీటిమట్టం 1405 అడుగులకు 1388.12 అడుగులుగా వుంది. 17.802 టీఎంసీ ల సామర్థ్యానికి గాను 3.297 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ వుంది. గోదావరి, మంజీరా నదులకు భారీ వరదలు వస్తే గాని ప్రాజెక్టులు నిండే పరిస్థితి లేదు. గతేడాది ఇదే సమయానికి శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులు పూర్తిగా నిండాయి. వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రాజెక్టుల్లోకి నీరు రావడం లేదు.
సింగూర్ ప్రాజెక్టులోకి స్వల్పంగా వరద నీరు
గత వారం రోజులుగా సింగూర్ ప్రాజెక్టులోకి స్వల్పంగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1444 క్యూసెక్కుల ఇన్ ప్లో వస్తుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 29.917 టిఎంసిలు ఉండగా, ప్రాజెక్ట్ లో ప్రస్తుతం 13.899 టీఎంసీల నీటి నిల్వ ఉంది. సింగూరు ప్రాజెక్టు ఎగువన మంజీరా నది తీర ప్రాంతాల్లో కురుస్తున్న ముసురు వర్షానికే స్వల్పంగా ఇన్ ఫ్లో నమోదవుతుందని ప్రాజెక్ట్ ఏఈ మైపాల్ రెడ్డి తెలిపారు.