భవిష్యత్ తరాల ముచ్చటతీర్చనున్న ముచ్చర్ల
వరల్డ్ బెస్ట్ సిటీగా ఉండాలని ఆలోచనలు
కర్బన రహిత నెట్ జీరో సిటీకి సన్నాహాలు
రాష్ట్రం నలుమూలల నుంచి ఈజీగా ట్రాన్స్‌పోర్టేషన్
ఔటర్, రీజనల్ రింగ్ రోడ్లతో కనెక్టివిటీ
సిటీ చుట్టూరా తిరిగి రానున్న మెట్రో రైలు
ఎయిర్పోర్ట్ నుంచి 20 నిమిషాల్లో చేరుకునే చాన్స్
16 రేడియల్ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు
పెద్ద ఎత్తున ఏర్పాటు కానున్న పరిశ్రమలు
ఫారెన్ టూర్లో పెద్ద ఎత్తున ప్రచారం
అమెరికాలోని ట్రేడ్ సెంటర్ మాదిరిగా టవర్స్
ఆంధ్రప్రభ స్మార్ట్, సెంట్రల్ డెస్క్
తెలంగాణకు ఫ్యూచర్ సిటీ రాబోతోంది. అక్కడ కొత్త కొత్త జోన్లు.. వివిధ రంగాలకు కేటాయించే భూములపై ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. ఈ నెట్ జీరో చేరుకోవాలంటే ట్రాన్స్ పోర్ట్ ఎంతో కీలకం. హైదరాబాద్ శివార్లలో శ్రీశైలం హైవేపై ఏర్పాటు కాబోతున్న ఈ సిటీకి నిమిషాల్లో చేరుకోవాలంటే విస్తృతమైన ట్రాన్స్ పోర్టేషన్ కావాల్సి ఉంది. దీనిపై సీఎం రేవంత్ ఉన్నతాధికారులతో రివ్యూలు చేస్తున్నారు. ఎయిర్ పోర్ట్ నుంచి, ఓఆర్‌ఆర్ నుంచి అలాగే త్వరలో నిర్మితమయ్యే రీజనల్ రింగ్ రోడ్ నుంచి చేరుకోవడం ఎలా అనే దానిపై సమాలోచనలు జరుగుతున్నాయి.
ఔటర్, రీజనల్ రింగ్ రోడ్ల నుంచి..
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల నుంచి.. ముఖ్యంగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్, ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్ నుంచి ఫ్యూచర్ సిటీకి రోడ్డు, మౌలిక సదుపాయాలు, మెట్రో రైలు కనెక్టివిటీ కల్పించడంపై సీఎం రేవంత్ వివిధ శాఖలతో సమాలోచనలు చేస్తున్నారు. దీనికి ఓ గైడెన్స్ ఇచ్చారు. సిటీ నిర్మాణంపై ఓ క్లారిటీ కల్పించారు. ఫ్యూచర్ సిటీకి 16 రేడియల్ రోడ్లు నిర్మించాలని సీఎం రేవంత్ రూట్ మ్యాప్ ఇచ్చారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి 20 నిమిషాల్లో ఫోర్త్ సిటీకి చేరుకునేలా ఉండాలనే ప్లాన్ చెప్పారు. ముచ్చర్ల అభివృద్ధిపై అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూనే ఉన్నారు. రోడ్ల నిర్మాణానికి ముందే ఎక్కడెక్కడ అవి మెయిన్ రోడ్లకు లింకప్ కావాలి., సిగ్నల్, ఇతర సమస్యలు లేకుండా సాఫీగా జర్నీ చేసేందుకు వీలుగా నిర్మాణాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలనే ప్లాన్ రెడీ అవుతోంది. రేడియల్ రోడ్లు, ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ అనుసంధానానికి అనువుగా ఉండాలని, ఫ్యూచర్ సిటీలో ఏర్పాటుకానున్న వివిధ పరిశ్రమలు, సంస్థలకు ఉపయోగకరంగా ఉండేలా రహదారుల నిర్మాణం ఉండాలని సీఎం రేవంత్ ఫోకస్ పెట్టారు.
పారెన్ టూర్లో పెద్ద ఎత్తున ప్రచారం..
ఈ అద్భుత నగరం గురించి న్యూయార్క్ నుంచి హైదరాబాద్ దాకా సీఎం రేవంత్ విస్తృత ప్రచారం కల్పించారు. ఫ్యూచర్ సిటీ భవిష్యత్తులో భారత్‌కు సమాధానం అవుతుందని, ఇది ఇండియా మొదటి నెట్ జీరో కార్బన్ సిటీ అవుతుందని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారు. ఫ్యూచర్ సిటీలో AI, మెడికల్ టూరిజం, స్పోర్ట్స్, సాఫ్ట్‌వేర్ అలాగే ఫార్మాకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారబోతుదని అంటున్నారు. ఇది సెకండ్ గోల్డ్ రష్‌గా అవుతుందనే టాక్ కూడా వినిపిస్తోంది. తెలంగాణకు కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తున్నామని, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, ఉన్నవాటిని విస్తరించడం ఎంతో ముఖ్యమనే భావనలో సీఎం ఉన్నారు. వీటన్నిటీ ఈజీగా కంప్లీట్ చేస్తామని ఇటీవలి విదేశీ పర్యటనల్లో పారిశ్రామిక వేత్తలకు సీఎం రేవంత్ హామీ ఇచ్చి వచ్చారు.
రైలు, రోడ్డు కనెక్టెవిటీ..
ఫ్యూచర్ సిటీకి వివిధ ప్రాంతాల నుంచి రోడ్డు, రైలు మార్గాలపై ప్రణాళికలు తయారు చేసి యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. అవుటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగు రోడ్డును అనుసంధానం చేసేలా ప్రణాళిక చేయాలన్నారు. కొత్త హైకోర్టు నుంచి శంషాబాద్ విమానాశ్రయం మీదుగా ఫ్యూచర్ సిటీకి మెట్రో మార్గానికి ప్రణాళికలు తయారు చేయాలని సూచించగా.. వారు కొన్ని మోడల్స్‌ని రెడీ చేశారు. ఈ క్రమంలో అవుటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగు రోడ్డును అనుసంధానం చేసేలా ప్రణాళిక చేయాలని సీఎం రేవంత్ వారికి సూచించారు. భూసేకరణ, ఇతర అంశాలపై వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. కొత్త హైకోర్టు నుంచి శంషాబాద్ విమానాశ్రయం మీదుగా ఫ్యూచర్ సిటీకి మెట్రో మార్గానికి ప్రణాళికలు తయారు చేయాలని చెప్పారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి రోడ్ కనెక్టివిటీ కోసం ప్రతిపాదించిన రూట్ మ్యాప్‌ను అధికారులు సీఎంకు వివరించారు.
ఫ్యూచర్ సిటీకి మెట్రో..
ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీకి మెట్రో సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఇందులో భాగంగా మెట్రో రూట్, అలాగే రోడ్డు మార్గాలను నిర్మించాలని గత నెలలో నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. మెట్రో రైలు ప్రతిపాదిత రెండో దశ 78కిలోమీటర్లతో అయిదు కారిడార్లు రానున్నాయి. ఇందులో శంషాబాద్ ఎయిర్‌పోర్టు హైదరాబాద్ సిటీలోని మెట్రో లైన్లతో లింకప్ కానున్నాయి. అటు ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్‌సిటీకి మెట్రో రైలు రూట్ ఆప్షన్లను అధికారులు కొద్దిరోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు.
మూడు రకాల ప్లాన్లు రెడీ..
శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి రావిర్యాల మీదుగా ఒకటి, తుక్కుగూడ మీదుగా శ్రీశైలం మార్గంలో మరోటి రెండేసి ఆప్షన్లను అధికారులు రూపొందించారు. ఆప్షన్ 1లో భాగంగా ఎయిర్ పోర్ట్ నుంచి స్కిల్ వర్శిటీ దాకా దూరం 32 కిలోమీటర్లు ఉంటే.. స్టేషన్ల సంఖ్య 12 ఉంటాయని, నిర్మాణానికి 6173 కోట్లు అవసరమవుతాయని అంచనాలు ఉన్నాయి. ఆప్షన్ 2లో భాగంగా ఎయిర్ పోర్ట్ నుంచి స్కిల్ వర్సిటీ వయా రావిర్యాల మీదుగా అయితే 32 కిలోమీటర్లు ఉండగా, 10 స్టేషన్లు, నిర్మాణ వ్యయం 5216 కోట్లు అవుతాయని లెక్కలేశారు. ఆప్షన్ 3లో భాగంగా ఎయిర్ పోర్ట్ నుంచి వయా శ్రీశైలం రోడ్డు ద్వారా 32కిలోమీటర్లు ఉండగా, 12 స్టేషన్లు, 3256 కోట్లు అవసరమవుతాయని లెక్కేశారు. 2028 నుంచి 2053 వరకు ప్రయాణికుల సంఖ్య కూడా ఎంత ఉంటుందో అంచనాలు వేసి అంతా పకడ్బందీగా ప్రణాళికలు రచిస్తున్నారు.
అమెరికాలోని ట్రేడ్ సెంటర్ మాదిరిగా..
అటు అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్ తరహాలో ఫ్యూచర్ సిటీలో వాణిజ్య కేంద్రం ఏర్పాటు చేసేందుకు వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రతినిధులు ముందుకొచ్చారు. ఇటీవల ప్రభుత్వంతో ఇందుకు సంబంధించిన ఒప్పందం జరిగింది. ఈ నేపథ్యంలో దాని నిర్మాణానికి అనువైన స్థలం కోసం రెవెన్యూ, పరిశ్రమల శాఖ అధికారులు అన్వేషిస్తున్నారు. విమానాశ్రయం, మెట్రో రైల్ స్టేషన్లకు వేగంగా చేరుకునేలా తమకు 50ఎకరాల స్థలాన్ని కేటాయించాలని, అలాగే భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పార్కింగ్ కోసం అదనంగా మరో 20 ఎకరాలు కేటాయించాలని సంస్థ ప్రతినిధులు కోరుతున్నారు. దీంతో ఇక అన్ని రకాలుగా ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ ప్లాన్ తో శరవేగంగా రెడీ అవుతోంది.