Sunday, November 10, 2024

Exclusive – డబుల్ ధమాకా! … కిరమరి.. ఓ కిరికిరి

ఒక ఓటరు.. రెండు చోట్ల ఓటింగ్​
అక్కడ మేమే.. ఇక్కడా మేమే
ఒకే ఊరిలో ఇద్దరు సర్పంచులు
రెండు రాష్ట్రాలకు చెందిన పాఠశాలల ఏర్పాటు
తెలంగాణ -మహారాష్ట్రలో సరిహద్దు వివాదం
ఎన్నికల్లోనూ ఇదే తరహా విధానాలు
అటు మహారాష్ట్రలో ఓటు హక్కు​..
ఇటు తెలంగాణలోనూ సిరా చుక్క
ఈనెల 19న ఓటు వేయనున్న 14 గ్రామాల ప్రజలు
సరిహద్దు గ్రామాల్లో 3,357 ఓటర్లు..
మొత్తం 6,255 మంది జనాభా
సుప్రీంకోర్టుకు చేరిన వివాదం..
ఏం చేయలేమంటున్న అధికారులు

ఆంధ్ర‌ప్ర‌భ‌, ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో:
తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల వివాదం తెగని పంచాయతీలా మారింది. రెండు రాష్ట్రాల మధ్య ఇంకా చిచ్చు రేపుతూనే ఉంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కెరామెరి మండలంలోని 14 గ్రామాల ప్రజలు ఇప్పటికీ రెండు రాష్ట్రాలకు ఓట్లు వేసే ఆనవాయితీ కొనసాగిస్తూనే ఉన్నారు. ఈనెల 19న మహారాష్ట్రలోని చంద్రపూర్ లోక్‌స‌భ స్థానానికి జరిగే ఎన్నికల్లో తొలి ఓటు వేసి, ఆ తర్వాత మే 13న జరిగే ఆదిలాబాద్ లోక్‌సభ ఎన్నికల్లోనూ మ‌రోసారి ఓటు వేసేందుకు సిద్ధమవుతున్నారు.

- Advertisement -

రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలోనే..

రాష్ట్రాల విభజన సమయంలో తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా, మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా సరిహద్దుల్లో జీవనం సాగిస్తున్న ఈ గ్రామాల ప్రజలు సరిహద్దుల్లో వివాదాస్పదంగా రెండు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించడం విశేషం. సర్పంచు నుంచి రాష్ట్రపతి ఎన్నికల వరకు ప్రజాస్వామ్యంలో ఒక ఓటు మాత్రమే వినియోగించుకుంటాం. ఇక్కడ మాత్రం రెండు రాష్ట్రాలకు తమ ఓటు హక్కును కలిగి ఉండడం విశేషం. ఒక కుటుంబానికి ఇటు తెలంగాణ, అటు మహారాష్ట్ర రేషన్ కార్డులు, ఉపాధి హామీ కార్డులు, రెండు రాష్ట్రాలకు సంబంధించి ఆధార్ కార్డులు కలిగి ఉన్నారు. ఒక ఊరిలో తెలంగాణ పాఠశాల, మహారాష్ట్ర పాఠశాల, ఇరు రాష్ట్రాలకు సంబంధించి అంగన్వాడీలు, ఆరోగ్య కేంద్రాలు ఈ గ్రామాల్లో వింతగా కనిపిస్తాయి. రెండు రాష్ట్రాల పథకాలను ప్రయోజనాలను పొందడంలో వీరికి వీరే సాటి. మహారాష్ట్ర అధికారులు వెళితే.. తాము మహారాష్ట్ర వాసులమని, తెలంగాణ అధికారులు వ‌స్తే తాము తెలంగాణ ప్రజలమేనని చెబుతుంటారు.

నాలుగు గ్రామపంచాయతీలు.. 14 ఆవాస గ్రామాలు..

ప్రస్తుత ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లా కెరమరి మండలంలో పరండోలి, ముఖదంపూర్, బోలా పటార్, అంతపూర్ గ్రామపంచాయతీ పరిధిలో మొత్తం 14 ఆవాస సరిహద్దు గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లో 3,357 మంది ఇటు తెలంగాణలో, అటు మహారాష్ట్రలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పరండోలి, తాండ, లెండిజాల, చింతగూడ, ముఖద్దం గూడ, మహారాజ్ గూడా, బోలా పటార్, గౌరీ, లేడి గూడా, అంతాపూర్, ఇస్లాపూర్, నారాయణగూడ, ఇంద్రానగర్, పద్మావతి గ్రామాలు రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో నలుగుతున్నాయి.

ఎన్నికల ఏర్పాట్లపై అధికారుల పరిశీలన

కిరమరి మండలం 14 వివాదాస్పద గ్రామాల్లో లోక్ సభ ఎన్నికల ఏర్పాట్లను ఆసిఫాబాద్ ఆర్డిఓ లోకేశ్వర్, కెరమెరి తాహసిల్దార్ దత్తు ప్రసాద్ రావు పరిశీలించారు. నాలుగు పోలింగ్ కేంద్రాల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అక్కడ బీఎల్ఓలను, పర్సన్ ఇన్చార్జిలను నియమించిన‌ట్టు తహసీల్దార్ తెలిపారు. మహారాష్ట్రలోని చంద్రపూర్ లో జరిగిన సరిహద్దు జిల్లాల అధికారుల సమావేశంలో తెలంగాణ మహారాష్ట్ర అధికారులు సమన్వయంతో సామరస్యంగా ఎవరికివారు ఓటింగ్ ఏర్పాట్లు చేసిన‌ట్టు తెలిపారు. ఈ వివాదం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున వీరిని ఇప్పటికీ తెలంగాణ ప్రాంత వాసులుగానే గుర్తించి ప్రభుత్వపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement